Undavalli Caves .. Let’s see ఉండవల్లి గుహలు.. చూద్దాం రండి..!!
Undavalli Caves .. Let’s see
ఉండవల్లి గుహలు.. చూద్దాం రండి..!!
ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సమీపంలో వున్నాయి ‘‘ఉండవల్లి” గుహలు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి వెళ్ళేరోడ్డు (ఉండవల్లి గ్రామం గుండా) వెళ్ళే మార్గంలోనే వున్నాయి. ఈ గుహలు నాలుగంతస్తులుగా విస్తరించి వున్నాయి. క్రీ.శ. మూడు, ఏడుశతాబ్దాల మధ్య చాళుక్య రాజులు ఈ గుహలను తొలిపించారని అంటున్నారు.!!
రహస్య సొరంగం మార్గాలు
దక్షిణాదిలోనే ఉండవల్లి గుహలు అపురూపమైనవి. కొండను తొలిచి సొరంగ నిర్మాణాలు చేశారు. ఒక సొరంగం సమీ పంలో వున్న మంగళగిరి కొండకు,రెండోది విజయవాడ కనకదుర్గమ్మ గుడి కొండకు చేరుకోవటానికి వీలుగా తవ్వించారట. మంగళగిరి కొండ పానకాలరాయుడి ఆలయం పక్కనే దీనికి కలుపబడినట్లు చెబుతున్న సొరంగం మార్గంకూడావుంది. ప్రస్తుతం ఈ సొరంగం పూడిపోయింది. ఇక్కడి నుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గమ్మ గుడికి రహస్య సొరంగం మార్గాలున్నాయని ప్రతీతి.
మొదటి అంతస్తులో త్రిమూర్తులు
శత్రువులకు తెలీకుండా రాజులు ఈ మార్గాల గుండా సైన్యాన్ని తరలించేవారని చెబుతారు. మంగగిరి కొండమీద ఇలాంటి సొరంగ మార్గాన్ని చూడొచ్చు. అయితే ఇది కూడా పూడిపోయి వుంది. ఉండవల్లి గుహలు నాలుగు అంతస్తులుగా తీర్చిదిద్దబడి వున్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తులున్న త్రికుటాలయంవుంది. కింద మండపం నిర్మాణం మాత్రం అసంపూర్తిగా వుంది.Undavalli Caves .. Let’s see
అనంత పద్మనాభుని విగ్రహము
రెండో అంతస్తులో పవళించి వున్న అనంత పద్మనాభుని ఏకశిలా విగ్రహముంది. దక్షిణాదిలోని తిరువనంతపురంలో ఇటువంటి విగ్రహమేవుంది. ఇది అరుదైన విగ్రహం.! ఈ అనంతశయనుడి (పవళింపు) విగ్రహాన్ని ఎంత సేపు చూసినా తనివి తీరదు.
*శిల్ప సంపద…!!
1.మొదటి అంతస్తులో రుషులు, సింహాలు వగైరా విగ్రహాలున్ళాయి.నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు,దత్తాత్రేయుడు, ఇంకా కొన్ని శిల్పాలు గోడలకు చెక్కబడి వున్నాయి. అక్కడి స్తంభాల మీదా కొన్ని శిల్పాలున్నాయి.
2.రెండో అంతస్తులో శయనించిన అనంత పద్మనాభుని విగ్రహం వుంది. 20అడుగుల ఏకశిల లో చెక్కబడిన సుందరం విగ్రహమిది. గర్భాలయం ద్వారానికి ‘జయ, విజయుల’ విగ్రహాలున్నాయి.
3.మూడో అంతస్తులో పూర్తిగా నిర్మించబడిన త్రికూటాలయం వుంది. నారద, తుంబురుడు శిల్పాలున్నాయి. ఇంతకు మించి అక్కడ ఇతర విగ్రహాలేమీ లేవు.
4.నాలుగవ అంతస్తు అసంపూర్తిగా వుంది. ఎందు వల్లనో గానీ ఇక్కడ ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు.!! ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శిల్పాలు కూడా వున్నాయి. క్రీ.శ. 4,5 శతాబ్దాల కాలంనాటి గుహలు కావచ్చని నిర్థారణ కాగా ఈ గుహలు విష్ణుకుండినులు చెక్కించారని, అందుకే వారి గుర్తు సింహం కూడా ఇక్కడ చెక్కబడిందని అంటారు. కానీ ఇవి పల్లవులు చెక్కించినగుహలన్న మరో వాదన కూడా వుంది. ఇక్కడికి సమీపంలోని మొగల్రాజపురంలో పల్వవులు చెక్కించిన శిల్పాల్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. కాగా మహాబలిపురం (తమిళ నాడు) లోమాదిరిగానే ఇక్కడ కూడా అనంత పద్మనాభుని విగ్రహం గుహ పక్క గోడమీద వుంది.
బౌద్ధ, హిందూ శిల్పకళా..
కొండను కదిలించకుండా కొండలోనే గుహలు. మూడంతస్తుల నిర్మాణాలు. ప్రతి అంతస్తులో రమణీయ శిల్పాలు. ముఖ్యంగా ఒకటి మాత్రం నిజం అనిపిస్తోంది. (ఇక్కడి ఆధారాలను బట్టి)ఈ గుహలు.. బౌద్ధ.. హిందూ శిల్పకళా రీతుల సమ్మేళనంగా కనిపిస్తోంది. ఏదిఏమైనా వీటి వెనుక వున్న వాస్తవాన్ని చారిత్రిక పురాతత్వ నిపుణులే నిర్ధారించాలి. విజయవాడ, అమరావతికి వెళ్ళేవారు ఈ ఉండవల్లి గుహల్ని తనివితీరా చూడటం మాత్రం మర్చిపోకండి.!! Undavalli Caves .. Let’s see