Header Top logo

The heart must be open హృదయం అన్నాక విచ్చుకోవాలి

The heart must be open
హృదయం అన్నాక విచ్చుకోవాలి

అవును..విచ్చుకోవాలి హృదయం. పువ్వులా విచ్చుకోవాలి. విచ్చుకున్నప్పుడే హృదయ పరిమళం తెలుస్తుంది. ఈ కవి ఎలనాగ గురించి ఎంత చెప్పినా తక్కువ. “కురిసే కాంతిపాతంలో తడిసి తడిసి వెలుగు ముద్దలా జగత్తు వెండిచాపలా వియత్తు ప్రతీ మనిషీ పాలనురగ ప్రతి ఎదలో వెలుగుతరగ ఆయనైతే వడబోసిన వెన్నెలను ఒడలంతాపులుము కుని కడవలకొద్దీ వెలుగును గటగటా తాగేశారు.

ఇప్పుడు ఆయన గుండె ఒక వెలుగుకుండ ఆయన మెడలో కిరణాల దండజాలువారే వెన్నెల ఎదమీదికి ఎగబ్రాకి ఒంటినిండా పారి, కళ్లనిండా పేరి తనువులో అణువణువులో ఇప్పుడురోచిస్సుల తేజస్సుల జలపాతాల చప్పుడుఆయన్ను గిల్లితే కవిత్వం వెన్నెల బొట్లుబొట్లుగా కారుతుంది సన్నగిల్లని ఏకధారగా ఎల్లప్పుడూ పారుతుంది.” ఇప్పుడు ఆయన తాజా కవితను చూడండి. The heart must be open

తలుపులు తెరవగానే
శుభ్రశీతలసమీరం లాంటి మధురోహ ఒకటి
బంగారు పావురమై రివ్వున వచ్చి
వాలుతుంది నా భుజం మీద
అప్పటిదాకా ఊపిరి సలపనీయని శ్వాసరాహిత్యం
శృంఖలాల్ని ఛేదించుకున్నట్టు
ఆవిశ్రాంత ఊహల కల్లోలకడలికి ఆటవిడుపు
ముకుళిత కుసుమంలా పడివున్న
పుస్తకపు అంతరాళాన్ని తెరవగానే
పరిమళభరితమైన చంద్రకాంతి
చిరుమేఘమై ఎగిరివచ్చి
కమ్ముకుంటుంది నన్ను సమ్మోహనకరంగా –
నిలువెల్లా నిస్త్రాణ ఆవహించిన దేహానికీ
నిరుత్సాహం నీరుగార్చిన మస్తిష్కానికీ
శ్రీచందనస్పర్శలా చల్లని పరామర్శ…

పాత ఫోటోల ఆల్బమ్ లో
పాతర అయివున్న జ్ఞాపకాల గుప్తనిధిని
నెమ్మది నెమ్మదిగా పెకలిస్తుంటే
ఎండి మోడైన హృదయం మీద
నీలీరాగపు ఊటలు నింపాదిగా
పారాడిన పరవశహేల!

తెరచుకోనంత వరకే
ముడుచుకుపోయిన తనపు పరితాపం
విచ్చుకోవాలే గానీ
వినూత్న స్వప్న విహాయసానికి
గవాక్షాన్ని తెరచినట్టే….!!

ఎలనాగ !!

మనిషి శ్వాసిస్తున్నాడంటే ఇంకా బతికున్నట్లు లెక్క. శ్వాస ఆగిన రోజున మనిషి మరణించినట్లే. గది తలుపులు మూసి వుంచితే గాలాడదు.శ్వాస కష్టం గా వుంటుంది.హృదయమూ గది లాంటిదే..మూసు కుంటే డుచుకుంటుంది.స్పందనలు కరువవుతాయి.అందుకే హృదయాన్ని ఎప్పుడూ తెరిచే వుంచాలి.

గది తలుపులు తెరవగానే శుభ్రశీతలసమీరం లాంటి మధురోహ ఒకటి బంగారు పావురమై రివ్వున వచ్చి మన భుజం
పై వాలుతుంది.అప్పటిదాకా ఊపిరి సలపనీయని శ్వాసరాహిత్యం శృంఖలాల్ని ఛేదించుకున్నట్టు ఆవిశ్రాంత ఊహ
ల కల్లోలకడలికి ఆటవిడుపవుతుంది.హృదయం, పుస్తకమూ అంతే…తెరుచుకోగానే పరిమళిస్తాయి. ముకుళిత కుసుమంలా పడివున్న పుస్తకపు అంతరాళాన్ని తెరవగానే పరిమళభరితమైన చంద్రకాంతి చిరుమేఘమై ఎగిరివచ్చి సమ్మోహనకరంగా చుట్టూ కమ్ముకుంటుంది.నిలువెల్లా నిస్త్రాణ ఆవహించిన దేహానికీ ,నిరుత్సాహం నీరుగార్చిన మస్తిష్కానికీ శ్రీచందనస్పర్శలా చల్లని పరామర్శ అవుతుంది. The heart must be open

పాత ఫోటోల ఆల్బమ్ అంటే జ్ఞాపకాల పాతర. జ్ఞాపకాల గుప్తనిధిని నెమ్మది నెమ్మదిగా పెకలిస్తుంటే ఎండి మోడైన హృదయం మీద నీలి రాగపు ఊటలు నింపాదిగా పారాడి పరవశిస్తాయి. ఏదైనా తెరచుకోనంత వరకే ఉక్కబోత. పరితాపం . విచ్చుకుంటే వినూత్న కలల విహాయసానికి గవాక్షాన్ని తెరచినట్టే.అందుకే.. గది నైనా.. మది నైనా..పుస్తకాన్నైనా… పాత ఫొటో ఆల్బమ్ అయినా…ఎప్పుడూ తెరిచే వుంచాలి. తెరిచిన గవాక్షంలోనే గాలి స్వేచ్ఛగా పారాడుతుంది. అప్పుడే మన మనసు విచ్చుకుంటుంది.ఊహలకు రెక్కలు మొలుస్తాయి…!!

తెరిచి వున్న గదిలో శ్వాస రాహిత్యం వుండదు. అలాగే తెరిచి వున్న హృదిలో.. భావ దారిద్ర్యం వుండదు.పుస్తకాలైనా..పాత ఫోటో ఆల్బమ్ లైనా జ్ఞాపకాల పరిమళాల్ని మోసుకొచ్చేవే…!!

Abdul-Rajahussen-write

ఎ.రజాహుస్సేన్.!!
నంది వెలుగు

Leave A Reply

Your email address will not be published.

Breaking