The body should be emptied ఇల్లులా శరీరాన్ని ఖాళీ చేయాలి
The body should be emptied
ఇల్లులా శరీరాన్ని ఖాళీ చేయాలి
దేహిల్లు
ఇల్లు ఖాళీ చేసినట్లు
దేహాన్ని ఖాళీ చేయాలి
ఏదో నాడు..
ఎన్నాళ్ళో ఉన్న ఊరిని
విడిచి వెళ్లినట్లు !
ఎవరొస్తారు నీ వెంట
నీ చుట్టూ దడి కట్టిన
గోడలు రావు
అన్నాళ్ళు నీలోకి తెరుచుకున్న
కిటికీ రాదు..
నిన్ను రానిచ్చి పోనిచ్చిన
తలుపు రాదు..
బేడానికి నీ బెడద తప్పుతుంది
దండెం కొత్తవారి దుస్తుల
వాసన కోసం వేచి ఉంటుంది
నాపరాళ్లు కొత్త సైజు పాద ముద్రల
స్పర్శ కై.. ఆ వెచ్చదనంలో తేడా చూడ్డానికి ఎదురుచూస్తాయి
తనను దాటే అంగలను
చూసే గనుమ
తనలోంచి ప్రవేశించే వారి
ఎత్తును వెడల్పును
జానా బెత్తా కొలుచుకుంటుండే ద్వారం
ఏవీ రావు
ఊచల్లేని కిటికీ
బేడం లేని తలుపూ
తలుపే లేని ఇల్లు కదా
నీ కల
అసలు నువ్వే లేని
ఈ లోకం
ఇప్పుడేమీ అవదు
తన మానాన తను
డొలుపుకు పోతూనే ఉంటుంది!
స్కైబాబ, కవి
హైదరాబాద్