Header Top logo

Ten days of Dussehra celebrations

Ten days of Dussehra celebrations

పది రోజులు దసరా వేడుకలు

 

హిందువులకు అత్యంత ముఖ్యమైన శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ దసరా. శరదృతువు ఆరంభంలో జరుపు  కుంటుంన్నందున శరన్నవరాత్రు లంగా చండీ ఉత్సవాలు నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్నది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయ దశమిని కలిపి దసరా అంటారు.

దైత్య వంశంలో జన్మించిన “మహిషాసురుడు” మరణం లేని జీవితం కోసం మేరు పర్వత శిఖరం చేరి, బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయగా, సృష్టికర్త ప్రత్యక్షమై, వరం కోరుకొమ్మన్నపుడు, తనకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించమని కోరగా, జనన మరణాలు ప్రతి ప్రాణికి సహజ ధర్మాలని, ఇది ప్రకృతి విరుద్ధం కనుక మృత్యువుకు ఒక మార్గం వదిలిపెట్టి, మరే వరమైనా కోరుకొమ్మనగా, అందుకు మహిషాసురుడు ఆడది అబలయైనందున, పురుషుని చేతిలో మరణం సంభవించ కుండా వరం అనుగ్రహించమని ప్రార్థించి, అను గ్రహం పొందాడు. Ten days of Dussehra celebrations

బ్రహ్మవరంతో బలగర్వితుడై, దేవ తలను యుద్ధంలో ఓడించి, ఇంద్ర పదవి చేపడతాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకోగా, మహిషునిపై వారికి కలగిన క్రోధాగ్ని ప్రకాశవంత తేజంగా మారి, కేంద్రీకృతDasara 10 Daysమై, ఒక స్త్రీ రూపు దాల్చింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ  తేజం పాదములుగా అవతరించినది 18 బాహువుల మంగళమూర్తి. ఆమెకు శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, బ్రహ్మ అక్షరమాల, కమండలము, హిమ వంతుడు సింహాన్ని వాహనంగా సమకూర్చారు. సర్వ దేవాతాయుధాలతో, దేవి మహిషునితో భీకర పోరు సల్పి, మహిషుని పక్షాన గల ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొద లైన వారిని హతమార్చి, అనంతరం మహిషి రూప అసురుని తొమ్మిది రోజులు పోరు సల్పి పదవరోజు సంహరించినది.

అప్పటి నుండి మహిషుని సంహరించిన దినం దసరా పర్వంగా జరుప బడుతున్నది. మహాలయ పక్షం యుద్ధ పక్షం కాగా, దేవాసుర యుద్ధంలో దేవతలు (ఆర్యులు) ఓడి తొమ్మిది దినాలు తమ ఇష్టదైవాలను ప్రార్థించారు. నవ రాత్రి పూజ వల్ల ఆర్యులందరికీ విజయ దశమి నాటికి గొప్ప ఆవేశం వచ్చి, వారంతా తిరిగి ఏకమై ఉత్తరాషాఢ – శ్రవణా నక్షత్రాల మధ్య

భాగాన అభిజిత్తున రాక్షసులపై దాడి చేసి పూర్తిగా ఓడించి, విజయం పొందిన దశమి విజయ దశమి అయింది. ప్రాచీన కాలం నుండీ ఆర్యులు విజయ దశమి పండువగా జరుపు కున్నారు. ప్రధానంగా రాజులు విజయ యాత్ర కోసం “అగ్ని పూజ, గుర్రాలు, ఏనుగులు” మొదలైన వాటికి పూజలు చేయడాన్ని ఆచరించారు. సంబంధిత కొన్ని విశేషాలను కాళిదాసు రఘువంశం కావ్యంలో సూచించారు. “శతాగ్ని మధించుటకై , జమ్మికొమ్మ అవసరమైంది. అరణులలో అడుగు కర్ర జమ్మికర్ర, పై కర్ర రావికర్ర వాడారు. జమ్మిని స్త్రీ లింగంగా, రాగిణి పుంలింగంగా ఆర్యులు పేర్కొన్నారు. అగ్ని శమీ గర్భాన కలదని (శమీ గర్భాదగ్నిం మందతి) అని శ్రుతి వచనం. కనుకనే శమీ పూజ ప్రాధాన్యత ఏర్పడింది.

Ten days of Dussehra celebrations

విజయ దశమి నాడు శమీవృక్ష దర్శన సమయాన “శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జు నస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ” అనడాన్ని బట్టి రామార్జున గాధల సంబంధం స్పష్టం అవుతున్నది. రాముడు, రావణునిపై విజయం సాధించిన దినంగా, పాండవులు వనవాసం వెళుతూ, శమీవృక్షం పైనుండి తమ ఆయుధాలను తిరిగి పొందిన దినంగా, విజయ దశమి ప్రత్యేకత ఉంది. కృత యుగాన సుకేతుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్య భ్రష్టుడై, భార్యతో కూడి అడవులలో సంచరిస్తుండగా, అంగీ రస రుషి, ఆయనకు నవరాత్రి పూజా విధులను ఉపదేశించగా, మహర్షి ఉపదేశించిన విధంగా పూజలు చేసి, సుకేతుడు తిరిగి ఐశ్వర్యాలు పొందినట్లు ఐతి హాసికాధారం. దుర్గ, లక్ష్మి, సరస్వతి లో ఒక్కొక్క దేవిని మూడేసి దినాలు పూజించే ఆచారం ఉంది. తొమ్మిది రోజులు పూజించడానికి వీలు కాకుంటే మహా నవమి అని, సరస్వతి పూజా దినం అని ఆయుధ పూజ దినమని, మరునాడు విజయ దశమి జరుపుకోవడం సంప్రదాయ సిద్ధంగా వస్తున్నది.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల, రచయిత  సెల్:   9440595494

 

Leave A Reply

Your email address will not be published.

Breaking