Spider Theology సాలీడు ధర్మశాస్త్రం
గ్రహాంతర వాసి కథలు-2
Spider Theology
సాలీడు ధర్మశాస్త్రం
భూమి మీద తన కాళ్ల మీద తాను పక్కాగా నిలబడే ప్రాణుల్లో సాలీడు ఒకటి. ఎందుకంటే దానికి 8 కాళ్లు. దారపు పోగుల మీద నాట్యం చేస్తూ ఎటు వైపు వెళుతుందో దానికే తెలియదు. మన గమనాన్ని , లక్ష్యాన్ని అవతలి వాడు కనిపెట్టకపోతే అదే సగం విజయం. ఎటు పడితే అటు వెళ్లేవాళ్లకి ఉద్యోగాల అవసరం ఏంటో?
“ఉద్యోగం పురుష లక్షణమన్నారు కానీ, సాలీడు లక్షణమని అనలేదు” అన్నాను.
“తెలుసు. ఉద్యోగ లక్షణం బేసిక్‌గా కింది వారిని వేధించడం, పైవారితో భయంగా,వినయంగా ఉండడం. పని తెలియకపోయినా ఇది తెలిస్తే చాలు. చీపురుకి వినయంగా , పురుగులకి యముడిగా ఉండడం నాకు పుట్టుకతోనే తెలుసు. మీరు వలలు కనిపెట్టారు. నేను వలతోనే పుట్టాను. ఇంతకంటే అర్హతా?” ఇంతలో ఒక అమాయకపు పురుగు వల మీద తచ్చాడింది. సాలీడు ఓర కంటితో చూసి ముసిముసిగా నవ్వింది.
“మృత్యువుని ఆ దేవుడే రాసి పెడతాడు”
“రాయలేదు, మృత్యువుని నువ్వు నిర్మించావు”
“మృత్యువుని నిర్మించే వాళ్లే చరిత్ర. వాళ్లే రాసి పెట్టడం అనే పదాన్ని అడ్డం పెట్టి వేదాంత గ్రంథాలు రాస్తారు”
“నువ్వు పుస్తకాలు చదువుతావా?” ఆశ్చర్యంగా అడిగాను. చెదలు, సాలీళ్లు అందరి కంటే ఎక్కువ పుస్తకాలు చదువుతాయి. పురుగు వలలో అడుగు పెట్టింది. వల సామర్థ్యాన్ని పరీక్షించడానికి సాలీడు రెండుసార్లు గెంతింది. పురుగు బయట పడడానికి ప్రయత్నించే కొద్దీ అతుక్కుపోయింది. సాలీడు మాటల్లోని మర్మం అర్థమైంది. ఉద్యోగాలు కూడా ఇంతే. బయట పడాలనుకుంటూనే అయిపోతాం.
“అంతా దైవ నిర్ణయం. అహింసోపరమ ధర్మః” అంటూ ఏవో అర్థం కాని మాటలతో దైవ సంకీర్తన చేసింది. సాలీడు దేవుడు సాలీడు రూపంలోనే వుంటాడు. మెల్లిగా కదిలింది. వల ఊగింది. పురుగు గింజుకుంది. 8 కాళ్లతో నడిచేవాళ్లు మరింత వేగంగా గమ్యం చేరుతారు.
“మృత్యువు భయపడతగింది కాదు, నీ దేవుడు ఎప్పుడో మరణించాడు” పురుగుతో చెప్పింది. దీని దుంప తెగ, ఇది నీషేని కూడా చదివింది.
“పురుగు పురుగులా బతక్కూడదు. సూపర్ పురుగులా మారాలి”. నమిలి తినేసింది.
పటకారు లాంటి ముందరి కాళ్లతో మూతి తుడుచుకుని “నువ్వు సూపర్ పురుగైతే నిన్ను మించిన సూపర్ పురుగు నిన్ను తింటుంది. ఇది తెలియక హిట్లర్ ప్రపంచ యుద్ధం తెచ్చాడు” అది జ్ఞాని అని అర్థమైంది. జ్ఞాని ఎదుట ఎక్కువ మాట్లాడకూడదు. కోపం వస్తే తినేస్తారు.
“అహింసే జీవన మార్గం. మోక్ష హేతువు”. కాసేపు ధ్యానం చేసి పురుగుని అరిగించుకుంది.
కళ్లు తెరిచి సర్వేజనోః సుఖినోభవంతుః అని గొణుక్కుంది. Spider Theology
“ప్రపంచమంతా వలలే వుంటాయి. వలకి దొరక్కుండా జీవించడమే జీవితమైనా, జ్ఞానమైనా”. బ్రేవ్‌మనింది. ఎదుటి వాళ్లని ఆరగించి జీర్ణం చేసుకుంటున్నప్పుడు మనలో వేదాంతం,వైరాగ్యం పుడుతాయి.
“చెవులకి ఇంపైనదే వినాలి. కళ్లకి శుభమైనదే చూడాలి అని కైవల్యోపనిషత్‌లో చెప్పారు. ఏం తిని బతకాలో ఎవడూ చెప్పరు. ధర్మశాస్త్రాలన్నీ అధర్మం గురించే తప్ప ఆకలి గురించి మాట్లాడవు” అని నిట్టూర్చింది.
“శాస్త్రాలు చదువుకుని హింసకి పాల్పడుతున్నావా?” అడిగాను.
“హింసే అతి ముఖ్య శాస్త్రం. అదే పరిణామం, జీవన పరావర్తనం. బలహీనున్ని తినాలి. ఇది ప్రకృతి శాస్త్రం. ఎవరూ దాటలేరు. ఇంతకీ కథలో ఎక్కడున్నాం”
“ఇంకా మొదలే కాలేదు”
“చాలా కథలకి ప్రారంభమూ, ముగింపూ వుండదు. దీన్నే పాండిత్యం అంటారు” ఇంకో పురుగు వలకి ఆకర్షితురాలైంది.
సాలీడులో ఉత్సాహం పెరిగింది.
“కరుణ, దయ, జాలి ఇవి జీవన ధాతువులై అంతిమ లక్ష్యంగా ఉన్నప్పుడే బతుక్కి పరమార్థం. ఓం శాంతి శాంతి” అంది. దీంతో అపరిచితుడు సినిమా తీయొచ్చు.
“దయ అంటే మెల్లిగా నమిలి హింసించకుండా ఒకేసారి గుటుక్కున తినేయడం” అని పురుగు వైపు కదిలింది.
ఇంతలో మొన్న డెంటిస్ట్ దగ్గరికెళ్లి వచ్చిన కుక్క నేరుగా ఇంట్లో ప్రవేశించి డైనింగ్ టేబుల్ ఎక్కి కావాల్సినవి వడ్డించుకుని తినసాగింది.
“కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదా” అన్నాను.
“మనలో మనకేంటి భయ్యా” అని చికెన్ లెగ్‌ని కటకట కొరికింది. అది నన్ను కుక్కనుకుంటూ ఉందో, దాన్ని మనిషని అనుకుంటుందో అర్థం కాలేదు. సాలీడు ఇంకో పురుగుని తిని అక్కడే వుండిపోయింది.
“అల్ప ప్రాణులతో మాట్లాడకూడదు. చీపురు తిరిగేయాలి” సాలీడుని చూస్తూ కుక్క చెప్పింది. ప్లేట్‌లోకి అన్నం వడ్డించుకుంటూ
“నా వరకు నేను, సమానులతోనే మాట్లాడ్తాను” అంది. దీంట్లో వ్యంగ్యం ఏదైనా వుందా అని వెతికాను. సమానత్వం అనే పదం కుక్కలకే నచ్చడం లేదు. ఇది తెలియక మార్క్స్ పుస్తకాలు రాశాడు. లెనిన్ కలలు కన్నాడు.
“నీకు మార్క్స్, లెనిన్ తెలుసా?”
“వాళ్లెవరు భయ్యా, ఎప్పుడూ వినలేదే”
“పులిపిరి వెంకటేశ్ తెలుసా?”
“సందు చివర మటన్ కొట్టు ఓనర్. నేను కనపడితే రాయి విసురుతాడు”.
“రాయి విసిరే వాడు గుర్తుంటాడు. ప్రపంచాన్ని మార్చాలనుకున్న వాళ్లని మరిచిపోతారు. మనుషులంతా సమానం. అందరూ కడుపు నిండా అన్నం తినాలని మార్క్స్ , లెనిన్ కోరుకున్నారు” కుక్క పగలబడి పొర్లిపొర్లి నవ్వింది. Spider Theology
“ఆధిపత్యం, అహంభావం లేకుండా కుక్కలే బతకలేవు. కరిచేవాడే నాయకుడు. అందరూ సమానమే వినడానికి బాగుంది. మనం కొంచెం ఎక్కువ సమానం. ఇది ఇంకా బాగుంది కదా. నీకు తెలుసా ప్రతి కుక్కకి ఒక ఫిలాసఫీ వుంటుంది”
(Next డాగ్స్ ఫిలాసఫీ)