జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా
15మందికి గాయాలు
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమం
వనపర్తి : ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు జాతీయ రహదారి-44 పక్కన అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసుల కథనం ప్రకారం.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి రాగానే అదుపు తప్పి జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో నర్సింహ (కేశంపేట), జయన్న (బద్వేల్), షబ్బీర్ అహ్మద్ (కర్నూల్), కృపానంద (హైదరాబాద్), శ్రీకాంత్‌చారి (హన్మకొండ), షకీల (రాయచోటి), అర్జున్ (కర్నూల్), ఉపేందర్ (జనగామ), శ్రీరామ్ (రాయచోటి), రఫీక్ (షాద్‌నగర్), సుమలత (ఆళ్లగడ్డ)లతో పాటు మరో నలుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 15 మంది గాయపడ్డారు.
వీరిలో తీవ్రంగా గాయపడిన నర్సింహ, షకీల, షబ్బీర్ అహ్మద్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తకోట ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి, సిబ్బంది క్షతగాత్రులను 108 వాహనంలో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులు ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.