RK Narayanan is the author who told the world. ఆర్.కె.నారాయణన్
RK Narayanan is the author who told the world
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన రచయిత ఆర్. కె. నారాయణన్
అక్టోబర్ 10న మాల్గుడి పట్టణ సృష్టికర్త జన్మదినం
సాహిత్యం ద్వారా భారత దేశాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో నారాయణ్ ఒకడు. భారత దేశ ఆంగ్ల తొలి తర సాహిత్య రంగానికి చెందిన ముగ్గురు గొప్ప ఇంగ్లీషు రచయిత లలో ఆయన ఒకడు. ముల్క్ రాజ్ ఆనంద్, మరియు రాజారావులు మిగిలిన ఇద్దరు. గురువు, మిత్రుడైన గ్రహం గ్రీన్ సహాయంతో నారాయణ్ వెలుగులోకి వచ్చాడు. ఆయన రాసిన మొదటి నాలుగు పుస్తకాలను ప్రచురించ డానికి ప్రచురణ కర్తలను ఒప్పించడంలో గ్రహం గ్రీన్ ముఖ్యపాత్ర పోషించాడు. ఆయన మొదటి రచన “డెవెలప్మెంట్ అఫ్ మారిటైం లాస్ అఫ్ 17త్ సెంచురీ ఇంగ్లాండ్” అనే పుస్తక పరిచయం. 1951 సంవత్సరపు అత్యుత్తమ అసలైన నవలగా పేరొందిన “ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్”, “సాహిత్య అకాడెమీ పురస్కారం” గెలిచిన “ది గైడ్” నారాయణ్ రాసిన ఇతర నవల లలో కొన్ని. ది గైడ్ నవల హిందీ, ఇంగ్లీషులలో సినిమాగా తీయబడింది.
ఆర్.కే. నారాయణ్‌గా పిలువబడే రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి ( 1906 అక్టోబరు 10 – 2001 మే 13)న ఆర్.కే. నారాయణ్ మద్రాస్ (ప్రస్తుత చెన్నై) లో జన్మించాడు. ఆయన తండ్రి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. నారాయణ్ అదే పాఠశాలలో కొన్నాళ్ళు చదివాడు. ఉద్యోగరీత్యా తండ్రి తరచూ బదిలీ అవుతూ ఉండడంతో, నారాయణ్ తన బాల్యంలో కొన్నాళ్ళు అమ్మమ్మ పార్వతి వద్ద పెరిగాడు. అమ్మమ్మ పార్వతి… నారాయణ్‌కు గణితం, పురాణాలు, భారతీయ శాస్త్రీయ సంగీతం, సంస్కృతం నేర్పించింది. ఆయన తమ్ముడు ఆర్.కె.లక్ష్మణ్ ప్రకారం, కుటుంబ సభ్యులు అందరు సాధారణంగా ఇంగ్లీషు లోనే సంభాషించే వారు. నారాయణ్, ఆయన తోబుట్టువులు ఏదైనా వ్యాకరణ తప్పులు చేస్తే, కుటుంబ సభ్యులు సహించేవారు కాదు. ఆయన ఒక గొప్ప భారతీయ రచయిత. ఇతడు “మాల్గుడి” అనే ఒక కాల్పనిక పట్టణాన్ని సృష్టించి దానిలోని ప్రజలు, వారి వ్యవ హారాల గురించి ధారావాహిక నవలలు, కథలు వ్రాసాడు.
మాల్గుడి, నారాయణ్ సృష్టించిన ఒక కాల్పనిక, పాక్షిక నగర వాతావరణం కలిగిన దక్షిణ భారత పట్టణం. ఆయన ఈ పట్టణాన్ని సెప్టెంబరు 1930న విజయ దశమి నాడు సృష్టించాడు. మొదట ఆయన మదిలో ఒక రైల్వే స్టేషను మెదిలి, తరువాత నెమ్మదిగా మాల్గుడి అనే పేరు తట్టినట్లు ఇతడు చెప్పుకున్నాడు. రామాయణ కాలం నుండి ఉన్న నిష్కళంకమైన చరిత్ర గల పట్టణంగా మాల్గుడి సృష్టించ బడింది. శ్రీరామచంద్రుడు ఈ పట్టణం మీదుగా వెళ్ళినట్లు వ్రాయబడింది; బుద్ధుడు కూడా మార్గ మధ్యంలో ఈ పట్టణాన్ని సందర్శించినట్లు వ్రాయబడింది. నారాయణ్ ఈ పట్టణానికి కచ్చితమైన భౌగోళిక హద్దులు ఎప్పుడూ పెట్టలేదు. కథలో వచ్చే సంఘటనలకు అనుగుణంగా ఊరి రూపురేఖలు తరచూ మార్చి, భవిష్యత్తు కథలకు రంగం సిద్దం చేసేవాడు. నారాయణ్ రాసిన కథలలో అనేకం మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణం భూమికగా జరుగు తాయి. మొదటి సారిగా కాల్పనిక పట్టణం… స్వామి అండ్ ఫ్రెండ్స్ నవలలో పరిచయం చేయబడింది.
డా. జేమ్స్ ఎం. ఫెన్నేలీ, నారాయణ్ రాసిన అనేక పుస్తకాలు, కథల ఆధారంగా మాల్గుడి రేఖాచిత్రాన్ని రూపొందించాడు. భారత దేశములో మారుతున్న రాజకీయ పరిణామాల బట్టి మాల్గుడి కూడా మారుతూ వచ్చింది. ఆయన కథలు సామాజిక సంబంధాలని ఎత్తి చూపి, రోజూవారి జరిగే యథార్థ సంఘటనల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తాయి. 1980లలో, భారత దేశంలో జాతీయ వాదం గట్టిగా పెరుగుతున్న సమయంలో, పట్టణాలకు, ప్రాంతాలకు బ్రిటిష్ పేర్లని మార్చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి.
కొంత కాలం తరువాత నారాయణ్‌కు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో గుర్తింపు లభించింది. “మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెస్” ఆయన పుస్తకాలను ప్రచురించడం ప్రారంబించింది. మొదటిసారి అమెరికా దేశానికి “రాక్ ఫెల్లెర్ ఫౌండేషన్ వారి ఫెలోషిప్” మీద వెళ్ళాడు. అక్కడ మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ వంటి అనేక విశ్వ విద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. ఈ తరుణంలో జాన్ అప్డైక్ ఆయన రచనను గమనించి, “చార్లెస్ డికెన్స్”తో పోల్చాడు.
అనేక నవలలు, వ్యాసాలు, చిన్న కథలు రాసిన నారాయణ్, భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా పేరొందాడు. శశి ధరూర్, శశి దేశ్‌పాండే, వి.ఎస్. నయపాల్, వ్యాట్ మేసన్, శ్రీనివాస అయ్యంగార్, విలియం వాల్ష్, అనితా దేశాయ్ వంటి దేశ విదేశాల విమర్శకులు నారాయణ్ రచనలపై విశ్లేషణలు చేశారు. అరవై ఏళ్ళకు పైగా రచనలు చేసిన నారాయణ్‌కు అనేక పురస్కారాలు, గౌరవాలు అందాయి. భారత దేశపు రెండవ అత్యుత్తమ పౌర పురస్కారమైన “పద్మ విభూషణ్” పురస్కారాన్ని ఆయన అందుకున్నాడు. పెద్దల సభ ఐన “రాజ్యసభకు నామినేట్” చేయబడ్డాడు.
ఆయనకు లభించిన మొదటి పెద్ద గుర్తింపు, “ది గైడ్” నవలకు 1958లో బహూకరించ బడిన “కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు” లభించింది. 1980లో రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ వారు “ఎ.సి.బెన్సన్ మెడల్” బహూకరించారు. ఆయన ఆ సొసైటిలో ఒక సభ్యుడు.1982లో ఇతడిని అమెరికన్ అకాడమీ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ వారు గౌరవ సభ్యుడుగా ఎన్నుకున్నారు. ఆయన పేరు పలుమార్లు సాహిత్యంలో “నోబెల్ బహుమతి”కి పరిశీలించ బడింది, కాని ఆ పురస్కారం ఇతనికి దక్కలేదు. యూనివెర్సిటీ అఫ్ లీడ్స్ (1967), మైసూరు విశ్వ విద్యాలయం (1976), ఢిల్లీ విశ్వ విద్యాలయం (1973) మొదలైన విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించాయి. సాహిత్య రంగానికి చేసిన సేవకు గుర్తింపుగా నారాయణ్ భారత “రాజ్య సభ”కు ఆరు సంవత్సరాల కాలానికి నియమితు డైనాడు.ఆయన మరణించడానికి ఒక సంవత్సరం ముందు, 2000లో భారత దేశపు రెండవ అతి గొప్ప పౌరపురస్కారం “పద్మ విభూషణ్” ఆయనను వరించింది. మైసూరులో ఆయన నివసించిన గృహాన్ని 2016లో ఇతని గౌరవ సూచకంగా ఒక మ్యూజియంగా మార్చారు.
రామ కిష్టయ్య సంగన భట్ల
రచయిత సెల్: 9440595494