Header Top logo

కరోనా సమయంలోనూ సంక్షేమ బాట ప్రజల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధం

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర నారాయణ,నారాయణపురం పంచాయతీలో రూ.18 కోట్లతో పనులు అనంతకు దీటుగా నాలుగు పంచాయతీల అభివృద్ధి

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి జిల్లాలో 4 వేల వరకు ప్రభుత్వ భవనాల నిర్మాణం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు స్పష్టీకరణ

అనంతపురం, మే 16 :

‘‘కరోనా సమయంలోనూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగడం లేదు.
ప్రజల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో కరోనా వంటి సంక్షోభంలోనూ ఇంటి వద్దకే పథకాలు తీసుకెళ్తున్నాం’’ అని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఆదివారం అనంతపురం నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం పంచాయతీలో రెండు గ్రామ సచివాలయాలు, జిల్లాలోనే మొదటి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే)ను కలెక్టర్‌ గంధం చంద్రుడుతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ.. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకుని రెండేళ్లవుతోందని, ప్రజలకు అవసరమైన పాలనను అందిస్తున్నామన్నారు. రాష్ట్రం అప్పులపాలైందని..అభివృద్ధి జరగడం లేదని చంద్రబాబు, టీడీపీ విమర్శించడం హాస్యాస్పదమన్నారు. నిత్యం జగన్‌పై బుదరజల్లడానికే చంద్రబాబు అండ్‌ కో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అసలు మీకు కళ్లున్నాయా? లేదా కళ్లు మూసుకుపోయాయా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచే అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరోవైపు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. మంచి మనసున్న వ్యక్తి సీఎంగా ఉండడం వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో నీరు–చెట్టు పేరుతో దోపిడీ జరిగిందన్నారు. సీఎం జగన్‌ స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తున్నారని తెలిపారు. నాడు–నేడు కింద వైద్యం, విద్యను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదని, ముఖ్యమంత్రిపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కరోనా విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో వైద్యం రంగం నిర్వీర్యం అయిందన్నారు.

అనంతకు దీటుగా పంచాయతీల అభివృద్ధి
అనంతపురం జిల్లా కేంద్రానికి దీటుగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీలను అభివృద్ధి చేస్తామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఒక్క నారాయణపురం పంచాయతీలోనే రూ.18.85 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. రూ.11 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీ, బీటీ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి పనులు ఏపీలో కొనసాగుతున్నాయని అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పంచాయతీలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. నారాయణపురం పంచాయతీలో మూడు సచివాలయాలు, మూడు హెల్త్‌ సెంటర్లు, ఒక ఆర్‌బీకేను నిర్మించినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

4 వేల వరకు భవనాల నిర్మాణం
జిల్లా వ్యాప్తంగా 4 వేలకు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్ల్‌ క్లినిక్‌లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్లుగా విద్య, వైద్య రంగాలతో పాటు ఇతర అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. నాడు–నేడు కింద పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. పౌరసేవలన్నీ సచివాలయాల్లోనే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అగ్రికల్చర్‌ జేడీ రామకృష్ణ, డీపీఓ పార్వతి, ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి, పంచాయతీ సెక్రటరీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking