Poet Samrat Vardhanti on October 18- కవి సామ్రాట్ వర్ధంతి
Poet Samrat Vardhanti on October 18
“తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ”
అక్టోబర్ 18న కవి సామ్రాట్ వర్ధంతి
తెలుగువారికి తొలి జ్ఞానపీఠాన్ని అందించిన బహుముఖ ప్రజ్ఞులు కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ వారి ఏ రచన అయినా సరే భారతీయ ఆత్మను, జీవుని వేదనను ప్రతిబింబించేదే. ప్రతీ అక్షరంలోను అసాధారణ ఊహాశక్తిని, అద్భుత రచనాశైలిని నింపి పాఠకుల హృదయాలలోకి పరుగులెత్తించ గలిగిన శక్తి ఆయన సొంతం. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశ్వనాథ వారు స్పృశించని ప్రక్రియ లేదు. తన రచనల ద్వారా కులాతీత, మతాతీత విధానాలను ఎండగట్టారు. ఆధునిక తెలుగు రచయితల్లో ఆయన పేరు లేకుండా తెలుగు సాహిత్య చరిత్ర గురించి వివరించడం అసాధ్యం.
విశ్వనాథ 1895, సెప్టెంబరు 10న కృష్ణా జిల్లా నందమూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, మరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాథ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరాడు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు. తరువాతికాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించాడు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడ లో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. కాలేజి (1938-1959), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు.
1957 లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యుడుగానూ పని చేశాడు. మహాత్మా గాంధీ నడుపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులు కున్నాడు. 1916 లో “విశ్వేశ్వర శతకము” తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభ మైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆ సమయంలోనే “ఆంధ్ర పౌరుషము” రచించాడు. 1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చు కొన్నాడు. 1961 లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రాచార్యునిగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికే కేటాయించాడు. తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయ కావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శన గ్రంథాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు… తెలుగుభాషకు విశ్వనాథ ఎనలేని సేవలు అందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించాడు.
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి… ఆంధ్ర పౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనల లోనివి. విశ్వనాథ రచనలలో ఆయన పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన, వ్యక్తిత్వం అద్భుతంగా కనిపిస్తుంటాయి. తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని అంటుండే వాడు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడం లేదుగదా అన్నాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు “సహస్రఫణ్” పేరుతో హిందీ లోకి అనువదించాడు. భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూప బడ్డాయి.తమిళనాడులోని మదురై ప్రాంతం నేపధ్యంలో వచ్చిన నవల “ఏకవీర”ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు. విశ్వనాథ వ్యక్తిత్వం ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనం మీద అభిమానం కలిగింది. తన అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవాడు. ఈ కారణంగా విశ్వనాథను వ్యతిరేకించిన వారు చాలామంది ఉన్నారు.
ఛాందసుడు అనీ, “గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్” అనేవాడు అనీ (శ్రీశ్రీ విమర్శ) విమర్శించాడు. విశ్వనాథకు పాశ్చాత్య సాహిత్యం అంటే పడదని అనుకొంటారు. కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు. షేక్స్‌పియర్, మిల్టన్, షెల్లీ వంటి కవుల రచనలను ఆసాంతం పరిశీలించాడు. 1964లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ “కళాప్రపూర్ణ” తో సన్మానించింది. 1942లో గుడివాడ లో “గజారోహణం” సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది. 1962 లో “విశ్వనాథ మధ్యాక్కఱలు” రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది. 1970 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఆస్థాన కవి”గా గౌరవించింది.
1970 లో భారత ప్రభుత్వము “పద్మభూషణ పురస్కారం”తో గౌరవించింది. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి రచయిత. కొన్ని రచనలను రేడియో నాటికలుగా మలిచారు. ఆయన రచనలను ఇతర భాషల్లో కూడా అనువదించారు. విశ్వనాథ చేపట్టని ప్రక్రియ కాని, ప్రయోగం కానీ లేదు. నవల, కథ , నాటిక, పాట, ఏదైనా తగిన పరిష్కారాన్ని అందించే విధంగా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన పద్య రచన అపూర్వం. సంస్కృత నాటకాల్లో గుప్త పాశుపతం, అమృత శర్మిష తెలుగు నాటకాల్లో కనకరాజు, అనార్కలి ప్రసిద్ధమైనవి. ఆయన కొన్ని పత్రికలకు సంపాదకులుగా కూడా పని చేశాడు. కొంతకాలం ఆయన ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమికి ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు.
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనల లోనివి. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి. ఆయన చేసిన ”రామాయణ కల్పవృక్షము” అనే పుస్తక రచనకు గాను జ్ఞాన పీఠ అవార్డు అందు కున్నారు. కోల్‌కతా, ముంబయి ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు వంటి పట్టణాల్లో ఆయన పొందిన సత్కారాలు అపూర్వమైనవి. 1964లోఆంధ్ర విశ్వ కలా పరిషత్ విశ్వనాథను “కళా ప్రపూర్ణ” బిరుదుతో సత్కరించారు. భారత ప్రభుత్వం “పద్మభూషణ్” బిరుదుతో గౌరవించింది. ఇతర ప్రభావాలు, ప్రలోభాలు లేని విశ్వనాథ స్వాతంత్ర్య రచనా శైలిని స్పృశిస్తూ గురువు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తన శిష్యుని గురించి ఇలా అన్నాడు…”నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలందే మార్గమ్మును కాదు; మార్గమది యింకేదో యనంగా వలెన్ సామాన్యుండన రాదు వీని కవితా సమ్రాట్ వవుత మా హేతువై,యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్”.కవిగా పండితునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, విమర్శకుడుగా, గాయకుడిగా రాణించిన విశ్వనాథ 1976 అక్టోబరు 18న తనువు చాలించారు. ఆ అద్భుత ప్రతిభాశాలి నడిచిన సాహితీసేవా మార్గంలో నేటి యువత చిత్తశుద్ధితో అడుగులు వేయాలని ఆశిద్దాం. సూర్యుని కాంతి, చంద్రుని వెన్నెల, కృష్ణమ్మ పరవళ్ళు, గోదారి చల్లదనం ఉన్నంతవరకు తెలుగు సాహిత్య అభిమానుల గుండెల్లో విశ్వనాథ మరియు ఆయన రచనలు చిరస్మరణీయం.
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494