Header Top logo

Pittala Srisailam Closing Charms-05 ముచుకుంద ముచ్చట్లు

Pittala Srisailam Closing Charms-05

పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-05

కుక్కలతో నాకు సావొచ్చింది పో.. ఏం సేతు , నన్ను కిరాయి ఇంటిని కూడా ఖాళీ చేయించినయి. బ్రీడ్ కుక్కలను పైసల్ పెట్టి కొనేటంత స్థోమత లేదు. ఏదో బస్తీలో తిరిగే ఊరకుక్కలు, జంగిలీ అని కొందరు పిలిచే  కుక్కలను మంచిగ సూసుకుంట. అంతే.. ఇంకే ముంది , ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు తీరుగా , కార్పోరేట్ విద్యా సంస్థల ప్రకటనలు టీవీలలో, పేపర్లలో వచ్చి , మన మీద పడ్డట్టుగా ,పది దాకా కుక్కలు సంఖ్య పెరిగింది. నన్ను అమితంగా ఇష్టపడేవి.

దీంతో మా ఇంటి ముందు , పెద్దపెద్దోల్లకు కూడా లేనంత  హై సెక్యూరిటీ . చీమ చిట్కుమన్న సావ్దాన్, అటెన్షన్ చెపిస్తాయి.  మా గల్లిలోకి ఎవరైనా రావాలంటే ,వీటి పర్మీషన్ లేకుండా ,అడుగు కూడా పెట్టరాదు. అంత స్ట్రిక్ట్ పోలీసింగ్ మాదిరిగా ఉంటయి. ఎమనుకుంటుర్రు మీరూ..అవి ఆషామాషి కుక్కలనుకునేరు.  పవర్ ఫుల్ మరి. ఎంతంటే…’నన్ను కిరాయి ఇంటిని ఖాళీ చేయించాయి’ అంత పవర్ ఫుల్ , మా కుక్కలు.. ఒర్నీ! కుక్కలు ఇంటిని ఖాళీ చేయిస్తయా అనుకునేరూ! నిజం సుమా.. ఆ ముచ్చట చెప్త వినుండి. నేను ఉండే కాలనీలో ఇండ్లు కిరాయికి ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా , డాన్ లాగా ఫీల్ అయ్యే వారికి ,తాళాలు ఇవ్వాలి. కాని మా ఇంటి ఓనర్ మాత్రం ,వారి కన్నా రొండాకులు ఎక్కువ సదివిండు . కాదు కాదు. సంపాదించిండు. వారి పెత్తనం ఎందని , ఓనర్ స్వంతంగా ‘టు లెట్ బోర్డు’ పెడితే ,ముందుగా మాకు తెలిసిన వారు రెంటుకు తీసుకున్నరు. కాని వారు రాలేకపోయే సరికి,ఆ ఇంట్లోకి మేమొచ్చి ఉన్నం.

నాకు తెల్వకుంట కిరాయికి ఇస్తరా ? అని , మా వాడ డాన్ గుర్రు మీద ఉందట ! వారి గుర్రు సంగతి నాకు తెల్వదాయే.  నేనేమెఓ , నన్ను నచ్చి వచ్చిన కుక్కలకు , నాకున్న దాంట్లోంచి , గింత అన్నం పెడుతున్న. కుక్కలు మా ఇంటి కాడనే ఉంటున్నాయి. అవి ఊక ఉంటయా.. పిల్లలను కూడా చేసి పడేసినయి. ఆ పిల్లలు కూడా దర్జాగా రోడ్డు మీదనే పండేవి. ఎవరన్న వస్తే ‘కూంకూం’గా దాడి చేసేవి. కరవకపోయేవి కాని ,వారికి కరిచినంత పని అయ్యేది. దీంతో వారికి మంచి కారణం దొరికినట్లైంది. నన్నేట్లనన్న ఇల్లు ఖాళీ చేయించాలంటే , కుక్కల వంకనే బెటర్ అనుకున్నారు. వచ్చెటోన్ని పోయెాటోన్ని‌ ఏగేసేదీ. కాని డాన్ మాటలు పట్టించుకోకుండా , కుటుంబీకులు రోజు బిస్కెట్ వేసేవారు.

” కుక్కలు కరిస్తే ఎట్లా? కుక్కల మీద అంతగనం ప్రేమ ఉంటే ఇంట్ల కట్టేసుకోవాలే, కాని బజార్ల ఇడుస్తరా..  గాయిదోల్లు,  లేబర్ గాల్లు కూడా ఆఫీసర్ల కాలనీలో ఉండెవట్టే ” అంటూ రోజూ ఇదే కొల్లపురం భాగోతం!pittala Dogs

నాకు నేనే ఏదో రిలాక్స్ రిలాక్స్ అంటూ సర్ది   చెప్పుకుంటున్న. నాకు శిగం వస్తే ఇక అంతే. కాబట్టి ఊరుకునేది. ఇట్ల సాగుతున్న టైంలో , కొన్ని కుక్కలు రాత్రి దాకా మంచి గుండి , పొద్దున లేసే సరికి చచ్చిపోయి పడేవి. పండుకున్నవి పండుకున్నట్లే కనిపించేవి. కాని వాటికి ఏమయ్యేదో,ఒక్కటొక్కటి చనిపోతునే ఉండేవి. వాటిని ఎవరు ఏం చేసిండ్రో అర్థం కాకపొయేది.

ఎం చేస్దాం ? మనకు సొంత ఇల్లు లేకపాయెా.. లోపల లోపల తిట్టుకుంట , వాటిని తీసుకుపోయి ‘ఆయిలుగుట్ట’ కాడ బొంద పెట్టెటోన్ని. సందట్లో సడేమియా లాగా , ఇంట్లోంచి పెద్ద రాగం వినిపించేది. ఏందంటే? “స్వంత ఇల్లుంటే బాగుండు. మనం కూడా రుబాబుగా   ఉండెటోల్లం కదా, తక్కువ కులపోల్లమని మాటలు పడవడ్తిమి” అని మా కృష్ణవేణి తన ‘స్వంత ఇంటి కలను’ ఇట్లా ముందట పెట్టేది. కుక్కలు సచ్చుడు , నేను తీసుకపోయి బొంద పెట్టుడు రొటీన్ గా మారేది. అప్పుడే ఓ ఒంటరి మహిళమ్మ‌ , రాజు అని ముద్దుగా పిలిచుకునే కుక్కని సాదుకునేది. ఆ రాజుతో పాటు ,ఆవిడ మా వీధిలో కిరాయికి దిగింది. రాజు అంటే నిజంగా ఎన్కటి రాజులాగా కనిపించేది.

కుక్కలకు మనమంటే దిల్ కదా. రాజు కూడా మన వాసన తొందరగా పసిగట్టింది .అంతే ఆ కుక్క కూడా ,మా ఇంటి ముందే తిష్ట వేసింది. అప్పటికే చనిపోయినవి పోంగ , రెండే కుక్కలు మిగిలినవి. రాజుతో కలిపి మూడైనవి.ఇక మా గల్లీలో. రాజే టైగర్ ఐంది. వచ్చేటోల్లను పోయేటోల్లను మా ఇంటి దిక్కు సూస్తే వణుకు పుట్టేలా చేసేవి! నన్ను ఇళ్లు ఖాళీ చేయించాలనుకునేటోల్లకు మరింత సులువైంది. రెండున్నర వేల కిరాయి ఉన్న ఇంటిని , ఓనర్ పై వత్తిడి చేసి నాలుగు వేలకు పెంచేలా చేశారు. అయినా , మల్ల ఇంకో ఇల్లు ఏడ సూసుకోవాలని ఉన్న. ఏడనన్న 5శాతం , లేదా 10 పది శాతం పెంచుతరు కాని 60 శాతం పెంచినా భరించినా. అట్లా మూడేండ్లు గడిసిపోయింది. ఇప్పుడు తప్పేటట్టు లేదూ. రాజోచ్చింది గదా , సూస్తుండగనే ఊకుంటదా.. మల్ల ఐదు పిల్లలైనవి.  ‘బుజులు బుజులు’ పిల్లలను జుస్తె , మాకెమో పానం లెషోచ్చెది. కాని లోపల భయం ఉండేది. మేం భయపడ్డటుగానే , అవి కూడా టైగర్ లాగా ఫీలవడం మెుదలెట్టినవి.

ఇక అప్పటిదాకా కిరాయి పెంచితే సాలనుకునే మా ఓనర్ కు ‘మేమే ఇంట్లో కొస్తున్నం , ఖాళీ చెయ్యి ‘ అనేంత వొత్తిడి తెచ్చిండ్రు డాన్ పార్టోళ్లు.పురాతన గుళ్లు గోపురాలంటే ,చాలా ఇష్టం మా ఓనర్ కు. అట్ల వారికి మా కాలనీలో మూడు ఇండ్లున్నయ్. ఆయనేమెఓ పట్నంల ఉంటడు. డాన్ పార్టోళ్లు , మా ఇంటి ఓనర్ పై పెడుతున్న ప్రెషర్ ,తిరిగి నా మీదకే వస్తది కదా. ఎంతైనా స్వంత ఇల్లు లేకపోవడం మాలాంటోల్లకు ఇబ్బందే. ఊకే ఈ ‘నస’ ఎందుకని , ఖాళీ చేసి , పక్క గల్లిలో ఇల్లు చూసుకుని , పోయి , నేల దాటింది. కాని ‘చెట్లు చెదారం పెట్టి , ఇల్లు కరాబు చేసినవ్’ అని ,నేను ఇచ్చిన అడ్వాన్స్ ఇంకా వాపస్ ఇయ్యలేదు.ఇస్తనైతే ఇస్తనన్నడు. చూడాలే. ఇవ్వక పోతే సూడూ, నాకు మంత్రాలొస్తయని ,ఓ డాగ్ ఏసిన!

ఇక ఈడికొచ్చినాకా, మేము ప్రశాంతంగా ఉందామంటే కుక్కలు‌ ఊరుకుంటయా. మేం చీకట్ల ఇల్లు మారినా కూడా , ఫాలోమంటూ రాజు తన సైన్యం ఎనిమిది మందితో కలిసి కొత్తింటి కాడా తిష్ట వేసింది. ఎంత ఎల్లగొట్టినా పొయినట్టే పోతున్నవి. మల్ల వస్తున్నవి. మా కొత్త కిరాయి ఇంటి పక్కన , ఇండ్లల్లో మాంచి బ్రీడు కుక్కలను సాదుతున్నరు. ఒక రాత్రి పూట ,  రాజు వాల్ల గోడలెక్కుతందని కొత్త పంచాయితి వచ్చి పడ్డది. వాల్లవి బ్రీడు డాగ్స్ ఆయే. ఇవ్వోమో ఊరు కుక్కలాయే. ఊకుంటరా , కోపంతో రాళ్ల తో కొడుతుండ్రు. ‘రాజును’  కొట్టినట్టే కొడుతుండు. కని అవి గనుమల్ల ఉన్న నాకు తగులుతున్నవి. రాజు చేయరాని పని చేసిండేమో‌ అనుకొని ఉండాలే. వారు గొడవ పడ్తే , మనకు ఒకటే ముక్క వచ్చే ఇంగ్లీషు పదం యూస్ లెస్ ఫెలో అన్న. అంత కొపమొచ్చే పని , వారి ఇంటి గోడ దూకి చేసుండొచ్చు గదా, ఊకుండాలే నేను. అట్ల అనడం తప్పు నాదే. అట్లనే ఇంకా రెండు కుటుంబాల వారు కూడా “మీరన్న ఉండాలే.. కుక్కలన్న ఉండాలే ” అన్నరూ. ఏంది? అవి నా కుక్కలా.. కాదు కదా ! ఊరు కుక్కలు.. వాటిని మీరు ఏమన్న చేసుకోండి అన్న! అంటున్న కాని , మనస్సు ప్రశాంతంగా ఉండనిస్తలేదూ. అక్కడ ఉంటే కుక్కల బాధనే. ఇట్లనే ఇక్కడ కూడా తప్పక పోయే సరికి, బేచాన్ బేచాన్ అయ్యేది. మల్ల అరిగి పోయిన రికార్డు ‘ స్వంత ఇంటి కళ’ ముందుకొచ్చేది.నా చెవుల తుప్పు ఒదిలేది!

కుక్కలను తీస్కపొమ్మని, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అన్నా చేయమని , మున్సిపాలిటీ వాల్లని అడిగిన.  ” తీసుకపోతే ఉత్తి పుణ్యానికి సంపుతరన్న. వద్దు. గిట్లనే సూసుకో” అని, సఫాయి వాళ్లు చెప్పిండ్రు. కాని , పుర పాలక మండలి నుంచి నో రెస్పాన్స్..

చేసేది లేక , ఔటర్ రింగ్ రోడ్డు మీద , ఓ కాలేజీ దగ్గరికి ఆటో కట్టుకొని పోయి , మూడింటిని వదిలి పెట్టి వచ్చిన.అక్కడ అయితే కాలేజ్ హాస్టల్ ఉంటుంది. వాళ్లు పారేసిన తిండి దొరుకుతుంది.తిని, వాటి బ్రతుకు అవి బ్రతుకుతాయి. వాటిని తీస్కపోనికి గొలుసులు కొనుకొచ్చిన.  అవేమెా కొత్తగా మా మెడలకు మంచిగ గొలుసు లేస్తుండని మీది మీదికి వచ్చి సంబరపడి ఏపించుకున్నవి. కాని వాటిని దూరంగా పంపిస్తున్నామని అవి కలలో కూడా అనుకోకుండొచ్చు. అవ్వి ఆటో దిగుతుంటే , నా కండ్లల్ల నిండుగా నీళ్లు నిండినవి. ఏం చెయ్యాలే మరి తప్పలేదూ. తల్లి, చిన్న పిల్లలను పంపబుద్ది కాలే. ఏమైతే అది కాని అనుకొని , ఇక మిగిలి ఉన్న తల్లి ఐదు పిల్లలని సూసుకుంట ఉంటున్న. కాని ఎవరేం చేసిండ్రో ఏమెా , నాలుగు పిల్లలు కూడా అనుమానాస్పదంగా  చనిపోయాయి. తల్లి ఒక ఆడ పిల్ల మిగిలింది. నాకు సరిగ్గా నిద్ర పడ్తలేదు. కలలో కూడా కుక్కలే అచ్చేవి. పొద్దు పొద్దున లేవగానే వాటి మెుకం చూస్త. తలుపు తీస్తుంటనే అవ్వి మీదికొస్తవి. అమ్మయ్యా.. ఇవ్వాళ బతికున్నాయి అనుకుంటాం..నాది మా కృష్ణవేణి ది కూడా , రోజూ ఇదే కుక్కల తండ్లాట. ఏంది ఈ గోస మాకు అని , మా ఊరికి పోయినప్పుడు అన్న. ఏముంది మీ నాయన సాలు పడ్డది నీకు‌ అని మా ఇంటి పక్క నుండే రాములవ్వ అన్నది. అప్పుడు గుర్తు కొచ్చింది. మా నాయనకు జీతాలు పడ్డ రోజు ,బిర్గ మందేసి ఇంటికొస్తే గిస్తే , బయటనే పండేటోడు. కుక్కలు చుట్టు ముట్టు పండుకునేవి. మా అమ్మని నాయిన జోబుల చెయ్యి పెట్టనిచ్చేవి కావు. అంత ప్రొటెక్షన్ మరి. నాయిన జోబుల , ఆ నెల జీతం ఉంటది మరి!నాయన కరెంటు డిపార్ట్మెంట్ ఉద్యోగం చేసేది.

ఇండ్లల్ల కుక్కలను పెంచుకునెటోల్లు – అట్లనే ఊరు కుక్కలను మురిపెంగా సూసెటోల్లు కామెంట్ చెయ్యండి.  పిడికెడు అన్నం పెట్టితే విశ్వాసం గా ఉండే కుక్కల గోస నలుగురికి తెలిసేలా షేర్ చేస్తే , ఊరు కుక్కల ఉసురు తీసెటోల్లు తగ్గుతరేమో సూద్దాం. సూసినట్లు మాత్రం లైక్ కొట్టుడు మర్వవొద్దు. ఉరు కుక్కలకే గిట్లుంటే యెట్ల మరి అనేటోల్లు మాత్రం దయచేసి నన్ను వదిలేయండి. ఉంటా మరి.

pittala sreesailam journalist

పిట్టల శ్రీశైలం, జర్నలిస్ట్

మూసీ టివి- మూసీ ఫైబర్ టబ్స్ సెల్: 99599 96597

Leave A Reply

Your email address will not be published.

Breaking