Header Top logo

లక్షణాలుండవ్.. కానీ కరోనా పాజిటివ్: ఏపీలో పలు జిల్లాల్లో విచిత్ర పరిస్థితులు!

  • అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో అత్యధికశాతం మందికి లక్షణాలు నిల్
  • ఇలాంటి వారిని 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్న అధికారులు
  • వారికి మళ్లీ పరీక్ష అవసరం లేదని స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితులున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక శాతం మందికి కరోనా లక్షణాలు లేనప్పటికీ పరీక్షల్లో మాత్రం పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. సీరో సర్వైలెన్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇలా నమోదవుతున్న కేసులు ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది.

అనంతపురం జిల్లాలో 99.5 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, నెల్లూరు జిల్లాలో 96.1 శాతం మందికి ఎటువంటి లక్షణాల్లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలోని అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఇక్కడ 22.3 శాతం మందికి వారికి తెలియకుండానే వైరస్ వచ్చి వెళ్లిపోయింది.

లక్షణాలు లేకున్నా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని 10 రోజులపాటు హోం క్వారంటైన్‌లో కానీ, ఐసోలేషన్ కేంద్రాల్లో కానీ ఉంచుతున్నట్టు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న పది రోజుల్లో ఏవైనా లక్షణాలు కనిపిస్తే మందులు ఇస్తామని, లేదంటే బలమైన ఆహారం తీసుకుంటే సరిపోతుందని అన్నారు. వీరికి మళ్లీ కొవిడ్ టెస్టు అవసరం లేదని, 11వ రోజు నుంచి వీరు బయటకు కూడా వెళ్లొచ్చని వివరించారు. వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించదని స్పష్టం చేశారు.
Tags: Andhra Pradesh, Anantapur District, Krishna District, Corona Virus, coronavirus symptom

Leave A Reply

Your email address will not be published.

Breaking