Header Top logo

అడవిలో నక్సలైట్స్ మహిళా దినోత్సవం!

గుర్తుకొస్తున్నాయి…

అడవిలో మహిళా దినోత్సవం!

ఓ జర్నలిస్ట్ అనుభవం

ఆకులు రాలు కాలం. అడవంతా బట్టలు విప్పేసినట్టు అనిపించింది. అక్కడక్కడ మోదుగ పూలతో అడవి నుదుట తిలకం దిద్దినట్టుంది. ఎండలు ముదురుతున్నయి. కాలి బాట, ఎడ్ల బండ్ల బాటల మీదుగా అన్ని దారులు ఆ గుట్టవైపే. పుట్లకొద్ది జనం. వందలు, వేలు…

ముఖ్యంగా శ్రామిక మహిళలు కాలినడకన గుట్టలు ఎక్కుతున్నరు. వాళ్ళు నడుస్తున్న తొవ్వలోనే మా నడక సాగుతోంది. అప్పటికే గంట నడిచి ఉంటాం. ఎత్తైన గుట్ట మీద విశాలమైన స్థలం .చుట్టూరా ఎర్ర జెండాలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఒక వైపు సభా వేదిక , దాని పక్కనే ఎర్రని బట్ట చుట్టిన రెడీ మేడ్ స్థూపం. అక్కడికి వస్తున్న మహిళల్ని అలీవ్ గ్రీన్ దుస్తుల్లో ఉన్న సాయుధ నక్సల్స్ కూర్చుండ బెడుతున్నారు. మేము సభ స్థలికి చేరుకోగానే మహిళా దళ కమాండర్ గుర్తు పట్టి బిగించిన పిడికిలి పైకి ఎత్తి లాల్ సలాం అన్న అంటూ ఆప్యాయంగా పలకరించుంది.

ముందు రోజే మాకు లేఖ ద్వారా సమాచారం పంపడంతో వెళ్ళాం. (అప్పట్లో నక్సలైట్ల వార్తలు రాయడం, ఇంటర్వ్యూ చేయడం, కవరేజీ కి వెళ్ళడం గొప్పగా ఫీలయ్యేలవాళ్లం) సభా ప్రాంగణానికి వేలాది జనం చేరుకున్నారు.

అడవి లోపలి వైపు నుంచి మరో ఇరవై మంది వరకు ఆలివ్ గ్రీన్ దుస్తులు, ఆయుధాలు ధరించిన నక్సల్స్ వచ్చారు. వాళ్ళలో ఒకరు జిల్లా కార్యదర్శి. ఇద్దరు ముగ్గురు జిల్లా కమిటీ సభ్యులు, దళ కమాండర్లు ఉన్నారు. సభా ప్రాంగణానికి నలు వైపులా సెంట్రీలు కాపలా కాస్తున్నారు.  అందరూ స్థూపం దగ్గరకు చేరుకున్నారు. ఉద్యమంలో అసువులు బాసిన ఓ మహిళ నక్సలైట్ తల్లిచే స్తూపావిష్కరణ జరిగింది. స్థూపం వద్ద నక్సల్స్ అమరులను స్మరిస్తూ పాటలు పాడారు. వేలాది మంది జనం ఉన్నా ఆ ప్రాంతం అంతా నిశ్శబ్ధం ఆవరించింది.

ఆ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు తీసుకున్నాం.
సభ మొదలైంది. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు.

దోపిడీ, పీడన, అణచివేత లేని సమానత్వం కోసం తాము చేస్తున్న సాయుధ పోరాటం గురించి చెబుతున్నారు. మేం కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్న విషయాలను రాసుకోవడం నిమగ్నమైనం.
ఆకాశంలో సగం ఉద్యమాల్లో సగం అంటూ ఎంతో మంది మహిళలు సాయుధ పోరులో భాగమైన విషయాన్ని ప్రస్తావిస్తూ అమరులైన వారి పేర్లను తలచుకున్నారు.
మహిళలు ఇంటా బయట ఎదుర్కొంటున్న హింస గురించి మాట్లాడారు. మహిళలు అడుగడుగునా ఎన్నో రకాల అణచివేతకు గురవుతున్న విషయాలను వివరించారు.
ఒకరు మాట్లాడగానే ఒక పాట పాడుతూ జనాలను ఉత్సాహపరిచారు. మధ్యాహ్నం అయింది.
బోజనాలు రెడీ అయ్యాయి. టేకు ఆకులు చేతుల్లో పట్టుకుని
వరుస కట్టారు. వేలాది మందికి సరిపడా వంటలు చేశారు. నక్సలైట్లు కూడా జనంతో పాటే భోజనం కోసం వరుసకట్టారు. గంటలో భోజనాలు పూర్తయ్యాయి.
మళ్లీ మీటింగ్ షురూ అయ్యింది.

గ్రామాల్లో భూస్వాములు, దొరలు ఏ రకంగా మహిళల మీద దాష్టికాలు చేశారు.. వారిని ఏరకంగా శిక్షించాము అన్నదానిపై నక్సలైట్ నేతలు వివరించారు. చదువుకోవడానికి వెళ్ళిన అమ్మాయిలను ఆకతాయిలు వేధిస్తుంటే వారిని ధండించిన విషయాలను చెప్పారు. మహిళలు సమానత్వం కోసం పోరాడాలని నక్సల్ నేతలు పిలుపునిచ్చారు.

అంతలోనే అలజడి మొదలైంది.

సభా ప్రాంగణానికి కొద్ది దూరంలో చెట్టుపై సెంట్రీ డ్యూటీ చేస్తున్న ఓ నక్సలైట్ చెట్టు కొమ్మ విరిగి కిందపడ్డాడు. వెంటనే సపర్యలు చేశారు. కానీ చేయి విరిగింది. పోలీసులు వచ్చారేమో నని జనం ఆందోళనకు గురయ్యారు. విషయం వేదిక వద్దకు చేరగానే జరిగిన సంఘటన గురించి మైకులో వివరించారు. గాయపడ్డ నక్సలైట్ ను ఆస్పత్రికి తరలించారు..మీటింగ్ మరో గంటపాటు కొనసాగింది. జననాట్య మండలి పాటలతో ప్రాంగణం దద్దరిల్లింది.

చివరకు..
కలుద్దాం ! మళ్లీ మళ్లీ కలుద్దాం!! అంటూ నక్సల్స్ జనానికి సెల్యూట్ చేస్తూ సభస్థలిని వదిలి అడవి లోపలికి వెళ్ళిపోయారు. జనం జరిగిన మీటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఇంటి దారి పట్టారు.
మీటింగ్ అయిపోయి ఎవరి దారిలో వారు వెళ్ళారు.

మాకు టెన్షన్ మొదలైంది. కామా రెడ్డి చేరుకోవాలి. ఫోటోలు ప్రింట్ చేయించాలి. వార్త ఇవ్వాలి. చీకటి పడే సరికి ఎలాగోలా కామారెడ్డి కి చేరుకున్నాం. ఫోటో లాబ్ కు వెళ్లి అర్జెంట్ గా ప్రింట్ లు వేసి ఇమ్మని చెప్పి ఆఫీసుకు చేరాము. డెస్క్ కు ఫోన్ చేసి మీటింగ్ విషయం చెప్పి స్పేస్ కోసం అలెర్ట్ చేశాం. చాయ్ తాగి వార్త కంపోస్ మొదలు పెట్టాను. దాదాపు రెండు గంటలు కష్టపడి మెయిన్ కి ఒక వార్త, జిల్లాకు వార్త ఇచ్చి డెస్క్ కు పంపాను. లాబ్ కు వెళ్లి ఫోటోలు తీసుకుని వచ్చి వాటిని పంపించేశాను.

అప్పటికే రాత్రి 9 దాటింది. కడుపు నకనకలాడితోంది . ఇంటికి చేరేదాక ఆకలితో ఆగే పరిస్థితి లేదు. హోటల్ కు వెళ్లి ఆర్డర్ చేసి ఏదో ఒకటి తిని రాత్రి 11 గంటలకి ఇంటికి చేరుకున్నాం.

అప్పట్లో పని ఉన్నా లేకున్నా రోజు ఇంటికి పదకొండు దాటిన తరువాతే చేరేది. చాలా సార్లు డేట్ కూడా మారేది.
నాలుగున్నర గంటలకే మెలకువ వచ్చింది. పేపర్ చూడాలంటే ఇప్పటిలాగా స్మార్ట్ ఫోన్ లు లేవు. గబగబా ముఖం కడుక్కుని చౌరస్త చేరుకున్న. అప్పుడే బస్సు లో పేపర్ పార్సిల్ వచ్చింది. నన్ను చూసి ఏజెంట్ ఎంది సార్ పొద్దున్నే ఎటైనా వూరు వెళుతున్నారా అని పలకరించాడు..లేదని సమాధానం ఇచ్చి ఓ పేపర్ తీసుకున్న.

మెయిన్ లో ముందు చెక్ చేశా. వార్త మొదటి పేజీలో బాటం వచ్చింది. ఎక్కడ లేని ఆనందం. జిల్లా పేజీ తీసి చూస్తే బ్యానర్ హాఫ్ పేజీ ఫోటోలతో కుమ్మేశారు. ఫుల్ హ్యాపీ. అన్ని పేపర్లు ఒక్కడే ఏజెంట్. పోటీ పేపర్ అడిగి తీసుకుని చూస్తే అందులో ఆ వార్తకు పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు. ‘ ఈరోజే నాదే ‘అన్న గర్వం తో కూడిన దర్పం వచ్చేసింది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్లీ రొటీన్ డ్యూటీ !

వేణుగోపాల్ చారి
సీనియర్ జర్నలిస్ట్
కామారెడ్డి జిల్లా
(నేడు మహిళా దినోత్సవం)

ఫైల్ ఫోటోలు

Leave A Reply

Your email address will not be published.

Breaking