Header Top logo

Mahaprasthana of Bapu dolls-3 బాపు బొమ్మల మహాప్రస్థానం-3

Mahaprasthana of Bapu dolls-3

బాపు బొమ్మల మహాప్రస్థానం-3

శ్రీశ్రీ అంటే.. రెండక్షరాలేనా?

అంతకు మించి. శ్రీశ్రీ మామూలు కవి కాదు….అంతకు మించి. ఆయన పేరు కొంచెం.. ఊరు ప్రపంచం..!! ఆయన ఒక్కడే. కానీ సమూహమై కలమెత్తాడు !! ఆయనది ఎమోషన్ కాదు. రెవల్యూషన్…!! శ్రీశ్రీ గారి గురించి ఎవరెన్ని మాటలు చెప్పినా.. నాకెందుకో ‘మహాప్రస్థానం’  యోగ్యతా పత్రంలో చలంగారు చెప్పిన మాటలే నిక్కచ్చిగా అనిపిస్తాయి. “రాత్రి చీకట్లో ,లోకంలో నిద్రలో భయంకర స్వప్నాలు కంటో,దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగత మిచ్చే వైతాళికుడు… శ్రీశ్రీ”.(చలం) అలాంటి శ్రీ శ్రీ గారి కవిత్వాన్ని అర్థం చేసుకొని, అందుకు తగ్గట్లు బొమ్మ వేయడం మంటే …చిన్న విషయం కాదు. ఏ మాత్రం కాస్త అటు ఇటు అయినా,బొమ్మ తేలిపోతుంది. చిత్రకారుడు నవ్వులపాలవుతాడు. అందుకే నేమో బాపు గారు హోమ్ వర్క్ బాగానే చేశారు. ఒకటికి పదిసార్లు శ్రీశ్రీ కవిత చదివి.. నోట్స్ రాసుకొని మరీ బొమ్మలేశారు. “ఆవతారం” అనే కవితా కూడా ఇందుకు మినహాయింపు కాదు.

ముందు ఈ కవిత చదవండి..ఆనక మాట్లాడుకుందాం!

“యముని మహిషపు లోహ ఘంటలు

మబ్బు చాటున ఖణేల్మన్నాయి !

నరకలోకపు జాగిలమ్ములు

గొలుసు త్రెంచుకు ఉరికిపడ్డాయి !

ఉదయ సూర్యుని సప్తహయములు

పరుగులెత్తే పెరుగు పెట్టేయి!

కనకదుర్గా చండసింహం

జూలు దులిపీ ఆవులించింది!

ఇంద్ర దేవుని మదుపు టేనుగు

ఘీంకరిస్తూ, సవాల్ చేసింది

నందికేశుడు రంకె వేస్తూ,

గంగడోలును కదిపి గెంతేడు

ఆదిసూకర వేద వేద్యుడు

ఘర్ఝురిస్తూ కోరసాచాడు

పుడమితల్లికి

పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి.”!!

శ్రీశ్రీ 14.4.1934.

పాలితుల తిరుగుబాటు

పాలకులకు వ్యతిరేకంగా పాలితులు చేసిన తిరుగుబాటును ఇందులో చూడొచ్చు.ఈ కవిత నిండా పౌరాణిక ప్రతీకలే. ఇలా పౌరాణిక ‘ప్రతీకల్ని’ వాడటం ఆధునిక కవిత్వంలో  ఓ  నూతన శకానికి ప్రారంభించగా చెప్పుకోవచ్చు. ”  యముని మహిషపు లోహ ఘంటలు,నరకలోకపు జాగిలమ్ములు,ఉదయ సూర్యుని సప్తహయములు,కనకదుర్గా చండసింహం,ఇంద్ర దేవుని మదుపు టేనుగు,నందికేశుడి రంకె,ఆదిసూకర వేద వేద్యుడు,..తమ తమ స్వభావలక్షణాలను ప్రదర్శించిన తర్వాత, ఉత్పాతం జరిగి పుడమి తల్లికి  పురుటి నొప్పులు  కొత్త సృష్టినిస్ఫురింపించాయట ప్రళయం తర్వాత జరిగే సృష్టికిదిశ్రీశ్రీ ఊహాత్మక భావన. ఈ తిరుగుబాటు కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారు శ్రీశ్రీ కనకదుర్గ  ఎక్కేవాహనం సింహంష ఆమెపై తిరుగుబాటు చేసింది. ఇక ఇంద్రుడెక్కే ఐరావతం ఆయనకే సవాలు విసిరింది.ఇలాగే సూర్యదేవుని ఏడు గుర్రాలు, శివుడి నందికేశుడు,కూడా తమ యజమానులపై తిరుగుబాటు చేయడం ఇందులో చెప్పారు శ్రీశ్రీ.ఇవన్నీ తిరుగుబాటుకు సూచనలు.మన బానిస వ్యవస్థలో కూడా ఇలాంటి తిరుగుబాటే రావాలన్నది శ్రీశ్రీ వుద్దేశం. అలా జరిగిన నాడే విప్లవం సాధ్యమన్నది కవి భావన. పాత వ్యవస్థ శిథిలమై కొత్త వ్యవస్థ ఆవిర్భవించాలన్నది. కవి ఆశయం.పాత వ్యవస్థ అంతరిస్తేనే… కొత్త వ్యవస్థ రావాలన్నదే ఈ కవిత పిండితార్థం.

బాపు బొమ్మ…!!

ఈ కవితకు బొమ్మ వేసే ముందు అలవాటు ప్రకారంగానే హోమ్ వర్క్ చేశారు. నోట్సు రాసుకున్నారు. “కాళ్ళకు, చేతులకు కట్టిన తాళ్ళు  తెంపుకుని  తనపై Ride చేస్తున్న ధనవంతుణ్ణి పడతోయడం” అని రాసుకున్నారు. అలాగే రెండు స్ఫూర్తిదాయక చిత్రాన్ని వేశారు.

‘బ్నిం’ వివరణ..!!

బడుగు రైతు బలిసిన రౌతుని తెంచుకొని కిందకు పడవెయ్యడం.. దాన్ని అద్భుతమైన కాంబినేషన్ తో వేశారు బాపు. ఈ బొమ్మ బాగా కుదిరిందని బాపు భావించారు. గూటాల కృష్ణమూర్తి గారికి కూడా ఈ బొమ్మనచ్చి, మెచ్చుకొని మరీ తన పుస్తకంలో ప్రచురించారు. ఈ బొమ్మ తరహాలోనే ఇదే భావంతో 2011 లో శ్రీ శ్రీ సాహిత్యాగానికి వారు ప్రచురించిన విశేష సంచికకు ముఖచిత్రంగా వేశారు.(రెండో బొమ్మ అదే) తమ వాహనాలుగా మూగజీవుల్ని వాడుకోవడం ఏడేడు లోకాలు పాలకులకి వాడుకే. ఇప్పుడా వాహనాలు ఎదురు తిరిగాయి.మహిషం యముడి అదలింపుకి అడ్డంగా తలూపింది.నరకంలో చీల్చి చెండాడాల్సిన డిపార్ట్మెంట్ కుక్కలు బానిస సంకెళ్ళు తెంచుకు ఉరకలెత్తాయి. అలాగే సూర్యుని  ఏడు గుర్రాలు .. దుర్గమ్మ  సింహం ..కళ్ళాలు తెంచుకొని కళ్ళెర్ర చేశాయి.ఇంద్రుడి మదపుటేనుగు, శివుని నంది కూడా నిరసన గళం ఎత్తాయి.సరిగా..అప్పుడే ‘నరవాహనం’ కూడా సంకెళ్ళు తెంచుకొని పరపీడకులని పడేసింది. “పుడమి తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టినిస్ఫురింపించాయి.బాపు చిత్ర సరస్వతికి కొత్త స్ఫూర్తి కలిగించింది. అంటున్నారు…’బ్నిం’.!!

Happiness in contentment "తృప్తిలోనే ఆనందం…!!

ఎ.రజాహుస్సేన్

హైదరాబాద్..!!

Leave A Reply

Your email address will not be published.

Breaking