Header Top logo

Maha Navami is the main festival of Sharanavaratra మహా నవమి

Maha Navami is the main festival of Sharanavaratra

శరన్నవరాత్రులలో ప్రధానమైనది మహా నవమి

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ”మహర్నవమి” అంటారు. ”దుర్గాష్టమి”, ”విజయదశమి” లాగే ”మహర్నవమి” కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహర్నవమి నాడు అమ్మవారిని ”అపరాజిత”గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు.

శరన్నవdurgadeviరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహా నవమి. చివరి మూడు రోజులైనా అమ్మవారిని పూజించాలని దేవీ భాగవతంలో పేర్కొన బడింది. జగజ్జనని ఆరాధన తొమ్మిది రోజులు చేయడం శ్రేష్టం కాగా,  చేయలేని వారు సప్తమి నుండి మూడు రోజులు త్రిరాత్ర వ్రతమని పూజలు చేస్తారు. అది కూడా  కుదరని పక్షంలో  మహా నవమి రోజైనా తప్పక అమ్మవారిని పూజించాలి. దసరా పూజలకు ఇదే ప్రధానం. విజయ దశమి పూజ అనేది పున: పూజ, ఉద్వాసన మాత్రమే అని నిర్ణయ సింధువులో స్పష్టంగా తెలియ జేయబడినది. కాశ్ మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ”కన్యా పూజ” నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపు కుంటారు.ఇతర రాష్ట్రాల్లో దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ చేయగా కేరళ రాష్ట్రంలో మాత్రం మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. క్షత్రియులు, కార్మికులు, వాహనదారులు, కులవృత్తులవారు ఆయుధపూజను నిర్వహిస్తారు. నవరాత్రులు ముఖ్యంగా మహర్నవమి సందర్భంగా మైసూరు మహారాజా ప్యాలెస్ ను మహాద్భుతంగా అలంకరిస్తారు. అమ్మవారి దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ మహర్నవమి రోజున దేవీ ఆలయాలు భక్తులరద్దీతో కిక్కిరిసి ఉంటాయి. విజయవాడ, కలకత్త, ఉజ్జయిని తదితర ప్రాంతాల్లో ఉన్న కనకదుర్గ ఆలయాలకు దేశం నలుమూలల నుండీ లక్షలాదిమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

సింహవాహనారూఢై, ఉగ్రరూపంతో, అష్టభుజాలతో పాశం, అంకుశం, త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చే మహాశక్తిని పూజిస్తే శత్రుభయం ఉండదని విశ్వాసం. అన్ని అవతారాలలోనూ ఆది పరాశక్తి దుష్ట రాక్షసులను సంహరించింది ఆశ్వయుజ శుద్ధ నవమి నాడే. భగీరథుడు గంగను భువి నుంచి దివికి తెచ్చింది కూడా ఈనాడే. ఈ రోజు మరొక విశేషం ఆయుధ పూజ. దుర్గాష్టమి, విజయదశమి లాగే ‘మహర్నవమి’ కూడా అమ్మవారికి విశేషమైన రోజు మహిషాసుర మర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. అమ్మ దుర్గాదేవి అనేకావతారాల్లో అపరాజితాదేవి దుర్మార్గులను ఓడించి సన్మార్గులకు సుఖజీవనాన్ని అందించే అవతారం అపరాజిత – అంటే ఏవరి చేతా ఓడించబడనిది అని అర్థం. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే… అంటూ అమ్మలగన్న అమ్మ మూల పుటమ్మ ను ఆరాధించిన వారికి, మహర్నమి నాడు అమ్మను స్తుతించినవారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది, అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది, సకలసంపదల నిస్తుంది.

Ramakistaiah sangabhatla1

రామ కిష్టయ్య సంగన భట్ల

సెల్: 9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking