Life on Konagoti (poetry) కొనగోటిపై జీవితం (కవిత్వం)
Life on Konagoti (poetry)
కొనగోటిపై జీవితం (కవిత్వం)
మండు వేసవి ఎడారి ఇసుకలో
వాన చినుకులా వుంది జీవితం
ఎక్కడా తడిలేదు సడిలేదు
జీవితం ఎండిన మానైపోయింది.
వర్తమానం గారడీ వాడి ఒంటితీగ
ఎంత మీటినా పలుకని ఏక్ తార
భవిష్యత్తు కృష్ణబిలమై లోతెంతో
తెలియని మిలియన్ డాలర్ ప్రశ్నైంది?
కాస్తో కూస్తో గతకాలమే మేలని పిస్తోంది
అప్పుడప్పుడైనా నలుగురితో భేటీలు
కుదిరితే కప్పు కాఫీ నాలుగు మాటలు
బతుకంటే ఇప్పుడు నిప్పుల కుంపటి
మనిషంటే ఇప్పుడు అంటరాని వాడు
మనిషికి మనిషికీ మధ్య ఎడం ఎడం
అడుగు అడుక్కి మధ్య అనుమానం
ఇప్పుడు కలలు కూడా కరోనా బాధితులే
కలలకు కూడా మూతిగోచీలు, శానిటైజర్లు
ఇప్పుడు ఎవరి జీవితమైనా కొనగోటిపైనే
బతుకు దారిలో అన్నీ ముళ్ళ కంపలే..!!