Kuchimanchi Agraharam c/o కూచిమంచి అగ్రహారం కథలు
c / o Kuchimanchi Agraharam
c/o కూచిమంచి అగ్రహారం కథలు
ముక్కామల చక్రధర్. అతనో సీనియర్ జర్నలిస్ట్. కలం పడితే చాలు కష్టాలు అనుభవించే పేదల పక్షణ అక్షరాలు పరుగులు పెడుతాయి. పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ కానీ ఉద్యోగమంతా హైదరాబాద్ లోనే. ప్రేమతో పలుకరించే అతనిలో మరో మనిషి ఉన్నాడు. కళ్ల ముందు కనిపించే ఆంశాలపై కథలు కూడా రాస్తాడు. అందుకే అతని ముక్కామల చక్రధర్. అయినా.. ముక్కామల బుజ్జిగాడు అంటూ పిలిచే వారున్నారు. ‘c/o కూచిమంచి అగ్రహారం’ అనే శీర్శికతో ముక్కామల చక్రధర్ రాసిన కథల పుస్తకం ఉమ్మడి రాష్ట్రాలలో మంచి ఆధరణ పొందింది. చిన్న వ్యాఖ్యాలతో ముచ్చటిస్తున్నట్లుగా రాసిన కథలు చదువడం ప్రారంభిస్తే పూర్తి చేసేంత వరకు వదులరంటే నమ్మండి. ‘c/o కూచిమంచి అగ్రహారం’ పుస్తకం చదివిన రచయిత వాడ్రేపు చిన వీరభద్రుడు సమీక్షంచారు. అతను రాసిన లేఖ మీకోసం..
ముక్కామల చక్రధర్..
నీవు రాసిన పుస్తకం చదివితే కళ్ళ నుంచి నీళ్లు వస్తాయని తెలుసు గాని, మరీ ప్రతి పుటలోనూ గుండె పట్టేస్తుందని ఊహించలేకపోయాను.
ముక్కామల చక్రధర్ రాసిన c/o కూచిమంచి అగ్రహారం కథలు మామూలు రంగుల్తో రాసినవి కావు. వీటిని చిత్రించడానికి అవసరమైన మట్టి బాల్యంలో మటుకే దొరుకుతుంది. ఆ రంగుల్ని తన బాల్యకాలపు మంత్రనగరిలో అతడిన్నాళ్ళూ రహస్యంగా దాచుకున్నట్టున్నాడు. ఇప్పుడొక్కసారిగా వాటిని బయటికి తీసి మనల్ని ఆశ్చర్యముగ్ధుల్ని చేసేసాడు. Kuchimanchi Agraharam stories
‘నీ సంగతి వేరు, నువ్వు అప్ లాండ్ బ్రాహ్మిన్ వి’ అన్నాడు పి.ఎస్.వి.కె.ఎల్.ఎస్. రావు ఒకసారి నాతో, తూర్పుగోదావరి బ్రాహ్మణ జీవితాల గురించిన ఏదో మాటల్లో. నేను అప్ లాండ్ వాణ్ణి కూడా కాదు, ఏజెన్సీ వాణ్ణి. ఒక అగ్రహారం జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ పుస్తకంలో కథలు మా జిల్లా కథలే అయినప్పటికీ, నాకు తెలిసిన ప్రాంతానివి కావు. కాని, ఇందులో మనుషులు కొందరు, వసీరా, పెమ్మరాజు గోపాల కృష్ణ, టి.వి.ఎస్. రామన్ లాంటి వాళ్ళు, వ్యక్తిగతంగా నాకెంతో సన్నిహితులు. ఇక చాలామంది నాకు తెలియరుగాని, అట్లాంటి మనుషుల్నే నేను మా ఊళ్ళో నా బాల్యంలో కూడా చూసాను. కాబట్టి వాళ్ళనిట్టే పోల్చుకోగలిగాను.
అమరావతి కథల్లానూ, పసలపూడి కథల్లానూ ఇవి కూడా ఒక ప్రాంతానికి చెందిన కథలే గాని, వాటి పోలిక అంతవరకే. ఊహించని లోతు ఈ కథల్లో చాలాచోట్ల కనిపిస్తుంది. ఒకటి రెండు కథల్లో అయితే ఊబి కూడా ఉంది. మీరు అదాటున చదువుకుంటూ పోతే ఆ ఊబిలో దిగబడిపోయి ఎప్పటికీ పైకి రాలేని ప్రమాదం కూడా ఉంది. ఈ కథల అమరికలో ఒక శిల్పం ఉంది. ఇవి ఋతుపరిభ్రమణంలో వివిధ ఋతువుల్లో అగ్రహారం జీవితాన్ని వర్ణిస్తో, మధ్య మధ్యలో కొందరు కాలాతీత వ్యక్తుల గురించిన కథల్ని కూడా చెప్తాయి. బహుశా కాలాన్ని జయించిన ఆ వ్యక్తుల కథల వల్లనే ఈ పుస్తకానికొక నిండుతనం, గాంభీర్యం సమకూరాయనిపిస్తున్నది. Kuchimanchi Agraharam stories
ఉదాహరణకి వసీరా అని పిలవబడే వక్కలంక సీతారామారావు గురించిన కథనం దానికదే ఒక సెల్యులాయిడ్ చిత్రంలాగా ఉంది. ఆ కథ చివరి వాక్యాలు చూడండి’. వసీరా కొడుకు ఇచ్చిన డబ్బులు తీసుకున్నశనీశ్వరరావు వెళ్తూ వెళ్తూ ఇంటి ముఖద్వారం దగ్గరికి వచ్చి లోపల కూర్చున్న వసీరాతో ‘క్షమించండి. మిమ్మల్ని చాలా దూరం నుంచీ గతుకుల్లో పడేసి మరీ తీసుకువచ్చాను. మీరు ఏమనలేదు. పైగా నవ్వుతూ నేను సిగ్గుపడేలా చేసారు’ అన్నాడు. ‘అయ్యో తప్పండి, అలా అనకండి. మీరు నన్ను గతుకుల్లో తీసుకురాలేదు. గతుకుల్లోనూ గెలవడం నేర్పారు’ అని రెండు చేతుల్తో నమస్కారం చేసాడు.” ఆ శనీశ్వరరావు ఏమిటో అతడెందుకట్లా అన్నాడో మీకు తెలుసుకోవాలని అనిపిస్తున్నది కదా. కావాలనే నేను వివరంగా చెప్పలేదు. ఎందుకంటే మీరీ పుస్తకం తప్పకుండా చదువుతారు కాబట్టి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.
ఈ దశాబ్దకాలంలో నేను ఇటువంటి కథ చదవలేదు. సుబ్బరామన్ తాడికొండలో నాకు జూనియర్. బాలమేధావి. ఒక నల్లటికోటు వేసుకుని మా స్కూల్లో స్టేజి మీద అతడు అక్కినేని నాగేశ్వర్రావు పాటలకి చేసిన డాన్సు ఇప్పటికీ నా కళ్ళముందు చెరిగిపోకుండానే ఉంది. ఆ తర్వాత ఎప్పుడో మళ్ళా రాజమండ్రిలో నా దగ్గరికి వచ్చాడు. తన కవిత్వం వినిపించాడు. అది వింటే అతడా ముందురోజే లాటిన్ అమెరికన్ కవులకు తన కవితలు వినిపించి వచ్చినట్టుంది. అతడికి చెప్పలేదుగాని, నేను చాలా సిగ్గుపడ్డాను. అప్పటి నా కవిత్వంలో అటువంటి లోతుగాని, గాఢత గాని లేదని నాకు తెలిసిపోతూనే ఉంది. అటువంటి సుబ్బరామన్, ఒక వజ్రం లాంటి యువకుడు అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు. ఎందుకు కనబడకుండాపోయేడో తెలియాలంటే చక్రధర్ ని చదవక తప్పదు.
ఈ కథలు రాస్తూ ఉండగా చక్రధర్ చేయి తిరగడం కాదు, మెలికలు పడిపోయిందని కూడా అర్థమవుతుంది. ఎటువంటి వాక్యనిర్మాణం! ఎటువంటి కథాకథనం! ఇతడు ఈ కథల్ని ఒక హాండ్ కామ్ తో రాసాడని చెప్పదగ్గ కొన్ని వాక్యాలు చూడండి. ‘మా నాన్న డిగ్రీ కుర్రాళ్ళకి నాన్ డిటైల్ పాఠ్యాంశాలుగా ఉన్న షేక్ స్పియర్ హేమ్లెట్, మేక్ బెత్ నాటకాలను అర్థాలు, సిలబస్ లతో సహా బోధిస్తుంటే చివరాఖరి బెంచీ మీద షేక్ స్పియర్ కూర్చుని శ్రద్ధగా వింటున్నట్టుండేది.’Kuchimanchi Agraharam stories
(సుగుణ) ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల గులాబీ రేకల గుట్ట. కళ్ళు చారెడున్నర. మంచినీళ్ళు తాగుతుంటే గోదారి ఏ పాయ నుంచి వచ్చిన నీళ్ళు గొంతులోకి దిగుతున్నాయో తెలిసిపోద్ది. వెన్నెల వెనక అమావాస్య తెరతెరలుగా ఉన్నట్టు భ్రమించే జుట్టు. అలాంటి నల్లటి జుట్టుకి ఉరేసుకుని చచ్చిపోతే అందమైన ఆత్మహత్య అవుతుంది. నవ్వితే బుగ్గలు సొట్టలు పడవు. హాయిగా పెదాలు రెండూ సాయంసంధ్యలొ కొబ్బరాకుల మధ్య కమలాపండురంగులో విచ్చుకుంటున్న సూర్యుడిలా ఉంటాయి. కొన్ని సార్లు హాండ్ కామ్ తో కాదు, హార్ట్ కామ్ తో తీసాడా అనిపించే దృశ్యాలు. ‘వసీరా నవ్వాడు. చిరునవ్వు నవ్వాడు. పగలబడి నవ్వాడు. కన్యాశుల్కం నాటకంలో పెళ్ళికి లొట్టిపిట్టలు తీసుకుని రండంటూ ఉత్తరం వచ్చినప్పుడు మధురవాణి నవ్వినట్టుగా నవ్వాడు.’ ఒక్కొక్కప్పుడు మనకు తెలిసిన సాహిత్యమే ఉన్నట్టుండి మరీ సుసంపన్నమైపోతుంది. ఇదిగో c/o కూచిమంచి అగ్రహారం వచ్చిన తరువాత మన కథాసాహిత్యం లాగా.
వాడ్రేవు చిన వీరభద్రుడి, రచయిత