Header Top logo

Kojagari full moon is the day of special fortune కోజాగరి పౌర్ణమి


Kojagari full moon is the day of special fortune

విశేష భాగ్య దాయిని కోజాగరి పౌర్ణమి

అశ్వనీ నక్షత్రానికి చంద్రుడు మిక్కిలి దగ్గరగా ఉండే రోజు ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. లక్ష్మీ దేవికి, శ్రీరామునికి ప్రియమైనదై, ఆశ్వయుజ మాస వ్రతాలలో విశేష భాగ్యదాయిని అయిన కోజాగరీ వ్రతాన్ని దసరా తర్వాత వచ్చే పౌర్ణమినాడు జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

హిందువులు పూజించే స్త్రీ దేవతలలో లక్ష్మీదేవిని తొలుత పేర్కొంటారు. భారతీయులచే నిత్య పూజ లందుకునే లక్ష్మీదేవి పేరున ఒక వారము పిలుబడగా, ఏడాదికి ఒకసారి వచ్చే కోజాగరి పూర్ణిమ రోజున విష్ణుపత్నికి విశేష అర్చనలు చేయడం సనాతన ఆచారం. క్షీర సాగరంలో జన్మించిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భార్యగా స్వీకరించగా, విష్ణువును పురుషునిగా, లక్ష్మిని ప్రకృతిగా భావించి పూజిస్తారు.

ఆశ్వయుజ పూర్ణిమ నాడు లక్ష్మీదేవి భూమి అంతా కలయ తిరుగుతూ ప్రతి ఇంటి వద్ద నిలిచి, అర్ధరాత్రి ఎవరు మేలుకుని ఉన్నారని అడుగు తుందిట. ఎవరూ పలకక పోతే వెళ్ళి పోతుందని పురాణ కథనం. అందులకే రాత్రంతా జాగరణ చేస్తూ, క్షీరాభిజాత యైన లక్ష్మికి ప్రీతి పాత్రమైన పంచదార, ఏలక పొడి, కుంకుమ పువ్వు వేసి క్షీరాన్నం వండి, లక్ష్మీ దేవతకు వెన్నెలలో ఉంచి నివేదిస్తారు. ఇలా ఉంచడం వల్ల చంద్ర కిరణాల ద్వారా వచ్చిన అమృతం అందులో పడుతుందని విశ్వాసం.

ఆహ్వానించిన అతిథులకు బంధు మితృలకు పాలు పంచుతారు. ఇలా లక్ష్మీదే విని అర్చించి, జాగరణ చేస్తే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుతారని నమ్మకం. ఈ దినం నాడు చుట్టాలతో స్నేహితులతో రాత్రి యక్షక్రీడ ఆడుతూ, అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండడం పుణ్యప్రదమని శాస్త్ర వచనం. దీనిని భాగ్యవర్తకంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో విశేష పుణ్యాన్ని కలిగించే వ్రతం ఏదని వాలఖిల్య రుషిని, రుషులు ప్రశ్నించగా, “కోజాగరీ” వ్రతమని పేర్కొన్నట్లు కథనం. మగధ దేశ విప్రుడైన వలితుడు, భార్య చండిని సంపద కోసం పెట్టే బాధలు భరించ లేక, ఇల్లు వదిలి అడవి బాట పట్టాడు.

అలా వెళుతుండగా, నదీతీరాన రాత్రి ముగ్గురు నాగకన్యలు వచ్చి, లక్ష్మీ పూజ చేసి, యక్షక్రీడ ఆడేందుకు గాను నాలుగవ మనిషి కోసం వెతకగా, వలితుడు కన్పిస్తాడు. వారు ఆయ నను యక్షక్రీడకు రమ్మని పిలుస్తారు. దానివల్ల భాగ్యం కలుగలదని చెపుతారు. జూదం వ్యవసమని వలితుడు చెప్పగా, ఆనాడు యక్షక్రీడకు శాస్త్రీయమైన అనుమతి ఉందని, ఒప్పించి, ఆట ప్రారంభిస్తారు వలితుడు మూడు సార్లు ఓడి, ఉన్నదంతా పోగొట్టు కోగా, పంచె, కౌపీనం, యజ్ఞోపవీతం మాత్రమే మిగు లుతాయి.

అర్ధరాత్రి లక్ష్మీ నారాయణులు భూలోక సంచారం చేస్తూ, నిద్రపోకుండా ఉన్న పేద బ్రాహ్మ ణుని, నాగకన్యలను గాంచి, సదరు బ్రాహ్మణుని వివాహ మాడాలని వారికి చెపుతారు. తమతో జూదంలో గెలిస్తే, అట్లేయని వారు అంగీకరించగా, ఆ ద్విజుడు ద్విగుణీకృత ఉత్సాహ వంతుడై, విజయుడవుతాడు. వారిని గాంధర్వ వివాహమాడి, నాగకన్యలతో, భాగ్యవంతుడై ఇంటికి తరలగా, చండిని స్వాగతించగా, చీకుచింతా రహితులవుతారు. కోజాగిరి పూర్ణిమ నాడు ద్వార బంధాల ముంగిళ్ళలో గోడల మీద లక్ష్మీదేవి పాద చిహ్నాలు, వరి, శంఖాల, పైడికంటి పిట్టల, ఆకుల బొమ్మలను వేసే పద్ధతి మహారాష్ట్రలో ఉంది. అలంకృత గృహాలలో గవ్వలు లేదా పాచికలు ఆడుతూ మేలుకొని ఉండడం సర్వత్రా ఆచరణలో ఉంది. అలాగే తొలి చూలు బిడ్డకు తల్లి కొత్త బట్టలు వేసి, అక్షతలు చల్లి దీర్ఘాయురస్తు అని దీవించడం, దేవ వైద్యులైన అశ్వినీ దేవతల రక్షణలో తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చేసే పర్వం కొన్ని చోట్ల పాటిస్తారు.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking