Judge Leela Seth Jayanti on October 20 లీలా సేథ్ జయంతి
High Court Judge Leela Seth Jayanti on October 20
స్వయంకృషితో ప్రధాన న్యాయమూర్తి అయిన లీలా సేథ్
అక్టోబర్ 20న లీలా సేథ్ జయంతి
అఖండ భారతావనిలో సహస్రాబ్దుల కాల గమనంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు గురవుతూ వచ్చింది. భర్తను ఎన్నుకొనే హక్కుని మహిళలు కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపు తున్నాయి. పతంజలి, కాత్యాయనుడు వంటి వారి రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకునే వారని తెలుస్తోంది. క్రమానుగతంగా, మధ్యయుగ సమాజంలో మహిళల స్థాయి దిగజారింది. కొన్ని వర్గాలలో సతీ సహగమనం, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాల నిషేధం వంటివి భారత దేశంలోని కొన్ని వర్గాల సామాజిక జీవనంలో భాగమయ్యాయి.
ఆధునిక భారతంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘ సంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు. సతీ సహగమనం, జౌహర్, దేవదాసి వంటి ఆచారాలు సంఘ సంస్కర్తల కృషి వల్ల నిషేధించ బడ్డాయి. భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ. ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్ మొదలైన మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. స్వాతంత్ర్య పోరాటం నుండి అనేక సామాజిక సంస్కర్తలతో , సమాన హక్కులు మరియు మహిళా సాధికారతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది.
ఇక ఆధునిక భారత దేశంలో, స్త్రీలు ముందడుగు వేసి ఉన్నత పదవులు నిర్వహించారు. స్వాతంత్య్ర సిద్ధి అనంతరం మహిళలు ముఖ్య పదవులను అలంకరించారు. దేశ ప్రథమ పౌరురాలుగా, ప్రధానిగా, గవర్నరుగా సీఎం లుగా, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా, న్యాయ మూర్తులుగా, వివిధ పదవులలో మహిళలు రాణించే అవకాశం వచ్చింది. వస్తున్నది. అలాంటి ఉన్నత పదవులు అలంకరించిన వారిలో సమర్థతతో పైకి వచ్చిన మహిళ లీలా సేథ్. లీలా సేథ్ (20 అక్టోబరు 1930 – 5 మే 2017) ఢిల్లీ హైకోర్టు కు మొదటి మహిళా న్యాయమూర్తి. 1991 ఆగస్టు 5న రాష్ట్ర హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టారు.
లీలా సేథ్ లక్నోలో 1930లో జన్మించారు. అస్సాం రైల్ లింక్ ప్రాజెక్టులో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె వివాహం ప్రేమ్‌నాథ్ సేథ్తో జరిగిన క్రమంలో భర్తతో లండన్ వెళ్ళారు. 1958లో లండన్ బార్ పరీక్షల్లో టాప్‌గా నిలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆ పరీక్షకు కొన్ని రోజుల ముందే మగబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో బిడ్డను ఎత్తుకుని ఉన్న లీలా సేథ్ ఫోటోను ‘మదర్-ఇన్-లా’ అనే క్యాప్షన్‌తో లండన్ పత్రిక ప్రచురించడం జరిగింది. అదే ఏడాది ఐఎఎస్ అధికారిగా ఎంపికయ్యారు. కాని ఆమెకు న్యాయవాది వృత్తిపట్ల అభిమానంతో ఆ వృత్తిని చేపట్టారు. 1959వ సంవత్సరంలో కొల్‌కతా హైకోర్టులో న్యాయ వాదిగా, తర్వాత సుప్రీంకోర్టులో పేరు నమోదు చేసుకున్నారు.
పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా తొలుత ప్రాక్టీస్ చేసి, పదేళ్లు ఉన్నారు. తర్వాత. కోల్ కతా లో కొంత కాలం ఉన్నాక ఢిల్లీ వెళ్లి అక్కడ ఐదేళ్లు ముఖ్యమైన పలు విభాగాల్లో పనిచేశారు. తరువాత ఢిల్లీ హైకోర్టుకు 1978లో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టుల్లో తొలి మహిళా ప్రధాన న్యాయ మూర్తిగా గుర్తింపు దక్కించు కున్నారు. ఆగస్టు 5, 1991న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. ఏడాది తర్వాత పదవీ విరమణ చేశారు. తరువాత కూడా ‘లా కమిషన్ ఆఫ్ ఇండియా’లో 2000 సంవత్సరం వరకూ పని చేశారు. అప్పుడే హిందూ వారసత్వ చట్టంలో కొన్ని సవరణలు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కూతుళ్లకు కూడా సమానహక్కు ఉంటుందని తీసుకొచ్చిన సవరణలో ఆమె పాత్ర గణనీయ మైనది.
డిసెంబర్ 2012లో జరిగిన నిర్భయ ఘటన తరువాత నాటి కేంద్ర యుపిఎ ప్రభుత్వం జస్టిస్ జె ఎస్ వర్మతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అందులో లీలాసేథ్ కూడా సభ్యురాలు. కమిటీ ఏర్పడిన నెల రోజులకే అంటే జనవరి 23, 2013న ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించింది. అనారోగ్యంతో బాధపడుతూ లీలా సేథ్ 5, 2017 న తన 86వ యేట నోయిడాలోని తన నివాసంలో మరణించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494