Header Top logo

Introduction to the poet Devipriya కవి దేవిప్రియ పరిచయం

Introduction to the poet Devipriya

కవి దేవిప్రియ పరిచయం

Introduction to the poet Devipriya కవి దేవిప్రియ పరిచయం

అమ్మ చెట్టు. నీటిపుట్ట. తుపాను తుమ్మెద. చేపచిలుక ఎదురు చూస్తున్నాయి.
ఎగిరిపోయిన పిట్టా’ (దేవి ప్రియ) తిరిగి రా…!!

ఆత్మకథ రాయడానికైనా ఓ సారి వచ్చిపోవచ్చు కదా!..!!

పరిచయం అక్కరలేని కవి దేవిప్రియ. ఈయన అసలుపేరు షేక్ ఖాజాహుస్సేన్. 1951 ,ఆగస్టు 15 న గుంటూరులో
జననం. గుంటూరు జిల్లా తాడికొండ, వినుకొండ లో ప్రాథమిక విద్య. తాడికొండ, గుంటూరులో హైస్కూల్ విద్య,
గుంటూరులో మెట్రిక్యులేషన్. తెనాలిలో ప్రీ యూనివర్సిటీ కోర్స్. గుంటూరు ఏసి కళాశాలలో డిగ్రీ (బి.ఏ ) పూర్తి చేశారు. కథారచయితగా ప్రారంభమై కవిగామారి జర్నలిస్టుగా స్థిరపడిన దేవి ప్రియ.

Introduction to the poet Devipriya కవి దేవిప్రియ పరిచయం

కవిత్వం ప్రాణమైతే జర్నలిజం ఆయన ఊపిరి

కవి జర్నలిస్టు.. జర్నలిస్టు కవి. సినిమా, టివి మాద్యమాల్లో కూడాప్రవేశించి తనదైన ముద్రను వేశారు. దేవిప్రియ సాహితీ జీవితం బహుముఖీనంగా విస్తరించింది. కథ, నాటిక, రూపకం, కవిత్వంతో సినిమాల్లో పాటలు రాశారు. అలాగే సినిమాలకు,డాక్యుమెంటరీ, టివి లో వినూత్న కార్యక్ర మాలకు రచనలుచేశారు. జర్నలిస్టుగా ఆయన ఎక్కని ఎత్తుల్లేవు. తొక్కని పత్రికల గడపలేదు. ముఖ్యంగా చిన్న పత్రికలకు ఆపద్బాంధవుడిగా పేరుతెచ్చుకున్నారు. సొంతంగా పత్రిక పెట్టి చేతులు కాల్చుకున్నారు. కవిత్వం ప్రాణమైతే జర్నలిజం ఆయన ఊపిరి. దేవి ప్రియకు చిన్ననాటినుంచే పత్రికా పఠనం అలవడింది. సాహిత్యం, అథ్యయనం పట్ల ఆసక్తి అలవడింది. 1962లోనే కథలు రాయడం మొదలు పెట్టారు. అలాగే గేయాలు అల్లడం, డిటెక్టివ్ నవలలు, జానపద నవలల్ని రాయడం మొదలు పెట్టారు. సి.నారాయణరెడ్డి గారి ‘కర్పూర వసంత రాయలు ‘ప్రేరణతో “వనజారాయలు “ అనే పద్య కావ్య రచన చేశారు. చదువుకుంటూనే ‘ గుంటూరు న్యూస్ ’ ‘స్వతంత్ర సందేశ్,’ ‘తెలుగు సీమ ‘ వంటి స్థానిక పత్రికల్లో పనిచేశారు. ‘దిక్సూచి ‘ అనే లిఖిత పత్రికను కూడా నిర్వహించారు.

Introduction to the poet Devipriya కవి దేవిప్రియ పరిచయం

“కవిత్వం నన్ను పట్టుకుంది.
మిగిలినవి నన్ను కవిత్వంలా
పట్టుకోలేక పోయాయి ” !! 

అంటూ అవసరాల నిమిత్తమే తాను పత్రికల్లో పనిచేశానని చెప్పుకున్నారు. పత్రికల్లో ప్రతికూల వాతావరణంలో పని చేస్తూ కూడా అద్భుత మైన కవిత్వం రాశారు. ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, మనోరమ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, హైదరాబాద్ మిర్రర్, హెచ్.యం.టి.వి, 20 టివి ల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూనే ఎన్నోకవితా సంపుటాలు, గ్రంథాలు ఆవిష్కరించారు.

కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు

అద్భుత కవితా సంపుటాలు. అమ్మచెట్టు (1979) నీటిపుట్ట(1990), తుఫాను తుమ్మెద(1999), పిట్టకూడా ఎగిరిపోవలసిందే(2001), చేప చిలుక(2005), ఎందుకుంటుంది(2009), గాలి రంగు(2011) ఇలా ఎన్నోఅపూర్వ, అద్భుత కవితా సంపుటాలు వెలువరించారు. ‘గాలి రంగు’ కవితా సంపుటికి 2017 లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. దేవిప్రియగారు రాసిన “సమాజానంద స్వామి”(1977), “రన్నింగ్ కామెంటరీ” (మూడు సంపుటాలు) జర్నలిస్టుగా దేవిప్రియ సత్తా ఏమిటో నిరూపించిన రచనలు. ఆయనలో ఉన్న సున్నితహాస్యవ్యంగ్య, చమత్కార చతురతను పలు కోణాల్లో ఆవిష్కరించిన గ్రంథాలవి. ఇక దేవి ప్రియ గారు సినిమా రంగానికి కూడా తన సృజన పరిమళాలు అద్ది ఔరా అనిపించుకున్నారు. ‘దాసి’, ‘రంగుల కల’ లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు రాసి పలువురి ప్రశంసలందు కున్నారు. దేవి ప్రియ ఎంత ఎత్తుకెత్తుకెదిగినా అమ్మచెట్టు మూలాలను ఎప్పుడూ మరిచిపోలేదు..!! Introduction to the poet Devipriya

గాలి రంగు తెలిసిన
పైగంబర కవి “దేవిప్రియ ” !!

కవిగా కవిత్వం రాసినా,జర్నలిస్టుగా కలం పట్టినాదేవిప్రియది చెరగని ముద్ర.

‘అమ్మచెట్టు’ లాంటి కమ్మని కవిత్వం చెప్పాడు. అమ్మచెట్టు నీడలో సేదతీరాడు. ‘నీటిపుట్ట’గా మారాడు. కవితాంబుధి
లో మునిగి దాహం తీర్చుకున్నాడు. ‘గరీబు గీతాలు’ పాడాడు. నేతలు విస్మరించిన పేదోళ్ళకు ఊతగా మారాడు.
‘తుపాను తుమ్మెద’ ఝంకారంతో అస్తవ్యస్త వ్యవస్థ అవస్థల్ని కడిగి పారేశాడు. ‘పిట్ట కూడా ఎగిరిపోవల్సిందే’నంటూ తాత్విక మర్మాలను తవ్వి తీశాడు. ‘దమ్మపదం’ పదగామియై బుధ్ధ దేవుని బోధనల్ని వెన్నముద్దలు చేశాడు. ఏది చెప్పినా ‘వ్యంగ్యం’ మరవని సగటు కవి. సమర కవి. సరస కవి .దేవి ప్రియ.!!

ఇంతకూ దేవి ప్రియ కవిత్వంలో ఏముంది?

ఒక్కో చోట కాఠిన్యం, ఇంకో చోట గాంభీర్యం, మరొక చోట క్రోథం, వేరొక చోట కరుణ, అమాయకత్వం కలగలిసిన నవరసాల సమ్మేళనం దేవిప్రియ కవిత్వం. కల్పన మార్మికత, వాస్తవికతల సంగమమే దేవి ప్రియ కవిత్వం ! ఈ కవి పాడిన అమ్మపాట తెలుగు కవిత్వంలో తేనెల ఊట.

“నువు పాడుతుంటే , అమ్మా
అమ్మలందరూ ఒక సముద్రమై
మన ఇంటి ముందుకు
పొంగి పొరలు కుంటూ రావడం
నాకు అగుపించిందమ్మా!

అమ్మా, ఇప్పుడు
నీ పాట , నా చిటికిన వేలికి
నువ్వు చేయించిన నీలం రాయి ఉంగరంలా
తగులుతున్నదమ్మా!! “.

మరో చోట ఇలా అంటారు దేవిప్రియ

“ఎండ వెన్నెల్లో
రైతు కూలీ శరీరం
శ్రమ సంగీతం వినిపిస్తుంది “

కవిత్వం శ్రమైక జీవనుల ఆర్తి కావడం కంటే కావలసిందేముంటుంది? పైగంబర కవిగా కవిత్వాక్షరాలు దిద్దిన నాడే బూతుకు బారెడు దూరంలోవుంటానని ప్రతిజ్ఞ చేశాడు.అన్నట్టే సంస్కారవంతమైన కవిత్వం రాశాడు. మెత్తగా వుంటూనే సామాజిక అసమానతల్ని ప్రశ్నించే వాడు. అన్యాయాన్ని నిలదీసేటపుడు ఉగ్ర నరసింహావతారమే. కొత్త ఆయుధం కోసం పాతరాతిని అరగదీస్తున్న చప్పుళ్ళు విన్నాడు. ’సూర్యుడా? చంద్రుడా? ఏడిచారు.వాళ్ళు రూపాయి బిళ్ళకి బొమ్మా బొరుసంటూ’,అవహేళన చేసినా అందులో మార్మికతను కవిత్వం చేశాడు. చేపచిలకల్ని రంగుదారాల చినుకులతో సింగారంగా ఒడిసి పట్టుకున్నాడు. Introduction to the poet Devipriya

Introduction to the poet Devipriya కవి దేవిప్రియ పరిచయం

గాలి రంగు…!!

గాలికి కూడా రంగు వుంటుందా? వుంటుందంటున్నాడు దేవీప్రియ. కవి తలుచుకుంటే చూడనిదేముంటుంది? గాలినే కాదు ‘గాలి’ రంగునూచూశాడు. నిరుపేద భారతంలో గాలిరంగు ఎలా వుందో నిగ్గు తేల్చాడు. సంక్షుభిత భారతావనిని కళ్ళకు కట్టేట్లు కవిత్వం చేశాడు. గాలిరంగు కవితను మీరుకూడా చదవండి !!

“ప్రవక్తలు పారిపోతారు
స్వాప్నికులు సిలువలెక్కుతారు
నియంతలు త్యాగ పురుషుల వెనుక శరణు
తీసుకుంటారు
రక్త పిపాసులు చేతిలో వున్న పుష్ప గుఛ్ఛాలతో
తిరుగుతారు
జాతి ఆకాంక్ష ను కొందరు
సముద్రాలకావల మర్రి చెట్టు తొర్రలో దాచిపెడతారు

చాకిరి చెరువులలో
ఎర్ర తామరలు విప్పారుతూనే వుంటాయి
అభినవ అంబేత్కర్లు
చొక్కా మడత నలగకుండా
గాలిలో ఊరేగుతారు

పొలాల పురుగు మందు చావులూ
ఆదివాసీ తిరుగుబాట్రదారులూ
దగ్ధమవుతున్న అరణ్యాలూ
రగులుతున్న పర్వత శ్రేణులూ
నవభారత నిర్మాణ నినాదాల కంటికి కనిపించవు

వేదికలూ నివేదికల మధ్య
ప్రశ్నలూ జవాబుల మధ్య
నిరుపేద భారతం నలిగి
నరకం అనుభవిస్తూ వుంటుంది
రామ్ లీలా మైదానం ఒక్కటే
జాతీయ ప్రత్యక్ష ప్రసారాల ప్రాధాన్యత అవుతుంది
కాశ్మరం,కలహండీ
విదర్భ,తెలంగాణ,అరుణాచల్,అస్సామ్ అన్నీ
మన ఆలోచనల ఆవరణ బయటే తిరుగుతుంటాయి
నాగాల నాగరికత
ఆటవిక ఆయుధ ఉన్మాదంగా ప్రచారమవుతుంటుంది
నిస్సహాయంగా నువ్వూ నేనూ
నిస్సహాయంగా అతడూ ఆమేే
నిస్సహాయంగా నింగీ నేలా
గాలి రంగునైనా ఊహించగలను కానీ..,
రానున్న రేపటి రూపే చూపుకందడం లేదు” .!!

దేవిప్రియ

వర్తమాన సంక్షుభిత “ భారతం “ దృశ్యాన్ని ఇందులో చిత్రించాడు దేవీప్రియ. ఆధునిక భారత గగన సుఖ మందిరాల పునాదులలో మూలుగు తున్న చెమట చెలమల అలల ఘోషని ఇందులో ఎలుగెత్తి చాటాడు. దుర్మార్గులు, దుష్టులు రాజ్యాధికారంలో వుంటే సమాజహితాన్ని కోరే ప్రవక్తలు‌ సైతం పారిపోక తప్పని పరిస్థితి. 1500 సంవత్సరాల క్రితమే నాటి ఆటవిక సమాజాన్ని సన్మార్గంలో పెట్టేందుకు కృషిచేసిన ప్రవక్త మహమ్మద్ (స) కూడా తాను పుట్టిన మక్కాను వదిలి మదీనాకు పారిపోవాల్సివచ్చింది.

మక్కాలో ఆటవిక అధికారానికి కేంద్రమై..

మక్కాలో ఆటవిక అధికారానికి కేంద్రమైన ఖురేషీల దౌష్ట్యాన్ని, క్రూరత్వాన్ని తట్టుకోలేక ప్రవక్త సైతం మదీనాకు వలస వెళ్ళారు. పాపుల్ని కాపాడేందుకుశాంతి మార్గాన్ని ప్రవచించిన దైవదూత క్రీస్తు సైతం ముష్కరుల క్రౌర్యానికి శిలువ ఎక్కాల్సివచ్చింది. గోముఖ వ్యాఘ్రాలైన నియంతలు త్యాగపురుషుల వెనుక శరణు పొందుతారు. ఇక రక్త పిపాసులైతే బయటచేతుల్లో పుష్పగుఛ్ఛాలతో తిరుగుతారు. లోపల మాత్రం చురకత్తులు దాచుకొని, సమయం కోసం ఎదురుచూస్తుంటారు. జాతి ఆకాంక్షను గిట్టని వారు కొందరు సముద్రాలకావల మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టారు.చాకిరేవు చెరువుల్లో సైతం ఎర్ర తామరలు విచ్చుకుంటూనే వుంటాయి. కానీ వాటి వల్ల పెద్దగా ఉపయోగం వుండదు. దీనజనోద్ధారణ పేరుతో చెలామణి అవుతోన్న అభినవ అంబేత్కర్లు చొక్కా మడత నలగకుండా గాల్లో షికార్లు చేస్తుంటారు.అంతా మోసం. జన వంచన. మురికి రాజకీయం. మనిషితనం, మనతనం కరువైన రోజులివి. Introduction to the poet Devipriya 

ఒక్క మాటలో చెప్పాలంటే
ఈ కల్లోల భారతంలో కలలు కూడా నిషేధమే !!

మట్టిని పిసికి, బంగారం పండించి మన కడుపులు నింపే రైతన్న సమస్యలతో ఓడిపోయి పురుగుమందు తాగి పొలంలోనే ప్రాణాలు విడుస్తాడు. అడవి బిడ్డల నోటికాడ కూడు తీసే రాజ్యం దుర్మార్గం మైనింగ్ పేరుతో గిరిజనుల ఉనికిని పాతరేసేస్తోంది. బతుకు కోసం తిరుగుబాటు చేసే ఆదివాసీల అడవులు తగలబడిపోతున్నాయి. హక్కుల,
ఉనికి కోసం చేసే పోరాటంతో పర్వత శ్రేణులు రగిలిపోతున్నాయి. నవభారతం నిర్మిస్తాం అంటూ నేతలు చేసే నినాదానాలు కనీసం కంటికి కూడా కనిపించడం లేదు. వేదికలు, నివేదికలు, ప్రశ్నలు జవాబుల మధ్య నిరుపేద భారతం నలిగి నరకం అనుభవిస్తూనే వుంది. దేశం సమస్యలతో, కులమతాల రుగ్మతలతో కుత కుత ఉడికిపోతుంటే కూలగొట్టిన బాబ్రీ మస్జీద్ స్థానంలో రామ్ మందిర నిర్మాణం చేపట్టాలని కర్ సేవకుల గోల, ఆందోళన. ప్రస్తుత పాలకులకు దేశంలో ఇదే జాతీయ సమస్య. ఇదొక్కటే ఎన్నికల్లో ఓట్లను రాల్చే ఛూ మంత్రం అయింది.
కాశ్మీరం మండిపోతోంది..

వేర్పాటు వాదంతో కాశ్మీరం మండిపోతోంది.

ఆకలితో కలహండి అట్టుడికిపోతోంది. వేర్పాటు వాదాలతో విదర్భ,  తెలంగాణ పోరుబాట పట్టాయి. అరుణాచల్, అస్సాం కల్లోల భారతానికి ఆనవాళ్ళుగా మారాయి. ఉనికి కోసం జరిపే నాగాల‌ పోరాటం ఆటవిక ఆయుధ ఉన్మాదంగా ప్రచారమవుతూ వుంది. చేసేది లేక ఇదంతా నిస్సహాయంగా చూస్తూ ‘నువ్వూ..నేను.’ అతడూ ..ఆమే ,’ నింగీ..నేలా ‘ ఒక్క మాటలో చెప్పాలంటే ’మనం దేశం ‘ ప్రకృతి..సుకృతి ‘ అంతా నిశ్చేష్టులం కావలసిందే. ‘కంటికి కనిపించని “గాలి రంగు “ నైనా ఊహించగలను కానీ రానున్న “రేపే“ (tomorrow/future) చూపుకందడం లేదంటున్నారు వర్తమాన భారతాన్ని దగ్గరగా చూసిన కవి దేవిప్రియ !!

కొత్త ప్రాజెక్టులు..!!

చనిపోవడానికి మూడు రోజుల ముందు దేవి ప్రియ గారు నాతో మాట్లాడారు.
“ఒక్కసారి ఇంటికి రా..రాజా !” అంటూ చాలా ప్రేమగా, ఆప్యాయంగా పిలిచారు. కరోనా రోజులవి. మా ఇల్లు చాలా దూరం. నేను వెళ్ళలేక పోయాను. మూడో రోజు దుర్వార్త విన్నాను. దేవిప్రియను కలవనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. నా జీవితం కాలంలో ఇది నిజంగా తప్పిదమే. కొరతే..! ఆరోజు నాతో చాలా సేపు మాట్లాడారు. మానవ సంబం వారు పలచబడి పోతున్నాయన్న ఆవేదన ఆయన గొంతులో వినిపించింది. “దేవి ప్రియ కలెక్టెడ్ పొయిట్రీ ” పేరుతో నా కవిత్వాన్ని మూడు సంపుటాలుగా తెస్తున్నాను. ఈ కరోనా వల్ల పని సగంలో ఆగింది. త్వరలోనే ఈ పని పూర్తవుతుంది. విజయవాడలో మిత్రులు చూసుకుంటున్నారు ….”!! అని చెప్పారు.

” ఆత్మకథ ” ఎప్పుడు..?

ఇంతకూ మీ ” ఆత్మకథ ” ఎప్పుడు? అని అడిగాను. “రాయాలి రజా..! ఈ కలెక్టెడ్ పొయిట్రీ పని పూర్తయ్యాక మొదలు పెడతాను. దూరంగా ఎక్కడికైనావెళ్ళి కూర్చుంటే కానీ కాదు. తొందరలోనే ఈ పని కూడా పూర్తిచేస్తాను.” అన్నారు. అన్నమాట నిలుపుకోకుండానే అందర్నీ వొదిలేసి తన అర్థాంగి ‘ రాజీ ‘ దగ్గరకు వెళ్ళి పోయారు. బతుకంటే అన్నింటా రాజీ పడటం.కానీ ” రాజీ ” లేని జీవితంతో రాజీ పడలేక పోతున్నా రాజా.! అంటూ నాతో చాలా సార్లు చెప్పారు.
“రాజీ ” లేని జీవితం ఆయనకు నరకంతో సమానంగా వుంటోందని ఆయన కాళ్ళు చెమర్చుకున్న సందర్భాలెన్నో.

“నేను లేని నిన్ను పలుమార్లు
ఊహించి చింతనలో మునిగాను కానీ,
నువ్వు లేని నన్ను ఎప్పుడూ
ఏ క్షణంలోనూ ఊహించి లేకపోయాను “!!

అంటూ దేవి ప్రియ ” రాజీ ‘ లేని లోకంలో “ఒంటరి తనపు వల”లో చిక్కుకొని విలవిల్లాడి పోయేవారు.

“పిట్ట మాత్రమే కాదు…
ఉరకలెత్తే వాగు కూడా
చిక్కుకుంది బోయవాడి వలలో
ఎంత తన్నుకు లాడినా
ఎంత విల విలలాడినా
ఎంత దీనంగా తడి చూపులు
చూసినా నువ్వు..
నాకు ఇది రంపపు కోత
గాడాంధకారపు
ఇనుపదారాలలో
చిక్కుబడిపోయి
ఒక చుక్క కాంతికోసం
దిక్కులన్నీ తడుముకుంటున్న నేను “!

ఎవరికైనా అర్థాంగి వియోగ బాధ రంపపు కోతే.ఇనుప దారాలలో చిక్కుబడిపోవడమే. బోయవాడి వలలో చిక్కింది పిట్ట మాత్రమే కాదు..ఉరకలెత్తే వాగుకూడా అనడంలోనే దేవిప్రియ మానసిక బాధ విరాట్ స్వరూపం
నా కళ్ళముందు ఇంకా మెదులుతూనే వుంది…!!

నోట్…!! ఈరోజు 21 నవంబర్ 2021…” దేవీప్రియ సమగ్ర సాహిత్యం ” (దేవీ ప్రియ కలెక్టెడ్ పొయెట్రీతో సహా) ఆవిష్కరణ.,!!

*సమయం…సా.6.00 గం.లకు. *స్థలం.. కవిరాజు పార్కు, తెనాలి .

*అందరూ ఆహ్వానితులే…..!!

abdul Rajahussen writer

ఎ..రజాహుస్సేన్, రచయిత
నంది వెలుగు..!!

(*చిత్రం.. మొహమ్మద్ గౌస్, హైదరాబాద్.)

Leave A Reply

Your email address will not be published.

Breaking