Header Top logo

In some respects Gandhi – Lenin..! కొన్ని కోణాలలో గాంధీ … లెనిన్!

In some respects Gandhi – Lenin..!

కొన్ని కోణాలలో గాంధీ … లెనిన్!

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా గడగడలాడుతూ ఉన్న కాలంలో 103 ఏళ్ల క్రితం ‘ప్రపంచాన్ని కుదిపిన’ శ్రామికవర్గ మహా విప్లవ సారథి వి. ఐ. లెనిన్ 150వ జయంతి వచ్చింది. సరిగా నేటికి 6 నెలల క్రితం భారత జాతిపితగా ప్రసిద్ధుడైన మోహన దాస్ కరంచంద్ గాంధీ 150వ జయంతి కూడా రావటం మనందరం బాగా ఎరిగిన విషయం. గాంధీ కంటే లెనిన్ 6 నెలలు చిన్న వాడే అయినా, గాంధీ భారత దేశ రాజకీయాలలో చురుకైన పాత్ర ఆరంభించే నాటికే 1917 నవంబరు 7న రష్యా దేశం లో లెనిన్ నాయకత్వాన కార్మిక కర్షక విప్లవం విజయవంతమై0ది. అప్పటికి లెనిన్ వయసు 48 కి లోపే!

17 ఏళ్ళ వయసులోనే న్యాయశాస్త్ర0 చదువుతూ విద్యార్ఢి ఉద్యమ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నందుకు లెనిన్ కజన్ విశ్వవిద్యాలయం నుండే కాక ఆ పట్టణం నుండి కూడా సంవత్సరం పాటు బహిష్కరింపబడినాడు. అప్పటికే లెనిన్ మార్క్సిస్టు అధ్యయన రహస్య బృందంలో సభ్యుడైనాడు.
19 ఏళ్ల వయసులో న్యాయశాస్త్రంలో విద్యాభ్యాసానికి గాంధీ లండన్ బయల్దేరాడు. ఎలా0టి భావాలతో వెళ్ళాడో దాదాపు అలాగే భారతదేశానికి తిరిగి వచ్చాడు.
వారిరువురికి రెండు మూడు సామాన్య అంశాల పట్ల గల అవగాహనా వైరుధ్యాలకు పరిమితమై ఇప్పుడు మాట్లాడుకుందాం
.
దక్షిణాఫ్రికాకు న్యాయవాదిగా వెళ్ళిన గాంధీకి జీవితంలో ముఖ్యమైన భాగం అక్కడి బ్రిటిష్ వారి తెల్ల దొరతనపు దౌష్ట్యాలను ధిక్కరిస్తూ, భరిస్తూ , సహిస్తూ సాగింది. అప్పటికి దక్షిణాఫ్రికాలో డచ్ వలసవాదుల పెత్తనం కూడా కొంత ఉండేది. డచ్ వారితో బ్రిటీషు వారికి ఆధిపత్య0, పెత్తనం కొరకు పోటీగా జరిగిన యుద్ధంలో – దాన్ని బోయర్ యుద్ధం అంటారు – గాంధీ బ్రిటిష్ వారి పక్షానే ఉన్నారు. స్థానిక నల్లజాతుల వారయిన (నీగ్రో) జూలు తెగలపై తెల్లవారు సాగించిన అణచివేత యుద్ధాల సందర్భంలో కూడా ఈయన బ్రిటిషు వారి పక్షాన ఉన్నారు , ఆ క్రమంలో అహింసా సిద్ధాంతం పై నమ్మకం పెంచుకుంటూ రష్యన్ మహారచయిత టాల్ స్టాయ్ భావజాలం పట్ల ఆకర్షణకు గురయ్యాడు.

1. మన ప్రస్తుత పరిశీలన అంశం ఒకటి ఇక్కడే ఉంది. ఎందుకంటే గాంధీ సమవయస్కుడైన లెనిన్ స్వయంగా రష్యా దేశస్థుడు. టాల్ స్టాయిని , ఆయన సాహిత్య కృషిని లెనిన్ ఎలా స్వీకరించాడు అన్నది ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం.
పురోగామి శక్తులు టాల్ స్టాయ్ సాహిత్యం నుండి స్వీకరించవలసినవీ, నిరాకరించవలసినవి … అంటూ లెనిన్ ఒక విశ్లేషణ చేశాడు. టాల్ స్టాయ్ సాహిత్యం రష్యన్ ప్రజాతంత్ర విప్లవానికి గల నేపధ్య జీవితానికి అద్దంపట్టే, ఆ కాలపు వాస్తవికతను సమాజం ముందు నిలబెట్టినట్లు లెనిన్ చెప్పాడు.
టాల్ స్టాయ్ రచనలు రైతుల సామూహిక ఉద్యమం యొక్క బలాన్ని బలహీనతలను శక్తిని పరిమితులను వ్యక్తం చేస్తాయి. రాజ్యం పట్ల పోలీసులతో పొత్తు గలిగి ఉండిన అధికారిక వ్యవస్థ పట్ల ఆయన ప్రగాఢమైన ఆవేశపూరితమైన, తరచూ నిర్ధాక్షణ్యంగా, నిశితమైన అసమ్మతి ఉంటుంది. శతాబ్దాల ఫ్యూడల్ దాస్యము, అధికారుల క్రూర పరిపాలన, దోపిడీ మత వ్యవస్థ యొక్క నటన వంచన టక్కులు ఎవరిలో ఆగ్రహాన్ని ద్వేషాన్ని గుట్టలుగా రాసి పోసినాయో, ఆ ఆదిమ కర్షక ప్రజాతంత్ర జనాల మనోస్థితులను ఆయన రచనలు తెలియజేస్తాయి. భూమి మీద సొంత ఆస్తి పట్ల రాజీలేని ఆయన వ్యతిరేకత … పాత మధ్య యుగ భూ యాజమాన్యం అనివార్యంగా అత్యంత నిర్దాక్షిణ్యంగా ధ్వంసం కావలసి ఉండిన కాలంలో రైతు జనాల మనస్తత్వాన్ని ఆయన సాహిత్యం తెలియజేస్తుంది ఒక్కమాటలో ఏ కాలం చెల్లిన ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాటి రష్యన్ ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం పోరాడి ఒక విప్లవాత్మక మార్పుకై తపన పడుతోందో ఆ దౌర్భాగ్య జీవితపు నికృష్ట స్థితిగతులను ప్రజలు అర్థం చేసుకునే విధంగా టాల్ స్టాయ్ సాహిత్యం విశదీకరించింది.
పై రష్యన్ జీవిత వాస్తవికతను ప్రతిబింబించే టాల్ స్టాయ్ సాహిత్యాన్ని , ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నవలలు కథలను గాని గాంధీ చదవలేదని చెప్పుకున్నాడు. అయితే గాంధీని ప్రభావితం కావించిన టాల్ స్టాయ్ పుస్తకం ఒకటి ఉంది. The Kingdom of God Is Within You
నీ లోనే ఉన్న దైవప్రపంచం అనే
ఆ పుస్తకం చదివిన వెంటనే గాంధీ టాల్ స్టాయ్ కి ఉత్తరం రాశాడు. వారి నడుమ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. దక్షిణాఫ్రికాలో తన నిర్వహణలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రానికి టాల్ స్టాయ్ పేరును కూడా గాంధీ పెట్టుకున్నాడు. ఆయనను అంతగా ప్రభావితం చేసిన ముఖ్యాంశాలు అందులో ఏమున్నాయి?
1. చెడు పట్ల మందకొడి ప్రతిఘటన . ( Passive Resistance To Evil. )
2. నిరాడంబర పేద సాధుజీవనం.
3. శాకాహార సేవనం.
4. సాత్వికమతం ఆధారిత జీవితాన్ని గడపటం.
రస్కిన్, థోరే లాంటి వారి ప్రభావం కూడా గాంధీ పై ఉండి నప్పటికీ టాల్ స్టాయ్ బోధనలలో ని Passive Resistance To Evil ప్రభావంతోనే అహింసా సిద్ధాంతాన్ని సత్యాగ్రహం మార్గాన్ని గాంధీ రూపొందించుకున్నాడు. వీటికి అవసరమైన మత ధార్మిక జీవనాన్ని ఎంచుకున్నాడు.
రష్యాలో విప్లవ శక్తులు ఊపందుకున్న తర్వాత వర్గస్వభావ రీత్యా టాల్ స్టాయ్ తన జీవిత చరమాంకంలో చర్చి శరణుజొచ్చి అన్యాయాలకూ, దురాగతాలకూ వ్యతిరేకంగా పోరాడటానికి బదులు చెడు పట్ల మందకొడి ప్రతిఘటన . ( Passive Resistance To Evil. ) సిధ్ధాంతాన్ని ప్రబోధించాడు.

సరిగా అవే రోజులలో భారత దేశంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం ఊపందుకుంది. యువకులు తిరుగుబాట్లు చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీపై అతివాదుల పట్టు పెరిగింది. క్రూర నిర్బంధ చట్టాలు ఆంక్షలు
నిషేధాలుతో భారత జాతీయోద్యమంపై క్రూర అణచివేత సాగుతోంది. బాలగంగాధరతిలక్ అరెస్టుకు నిరసనగా బొంబాయిలో కార్మికులు అపూర్వమైన సమ్మె చేశారు. దానిని భారత కార్మిక వర్గం రాజకీయ రంగ ప్రవేశం చేయటంగా లెనిన్ అభివర్ణించాడు. అప్పటికే రష్యాదేశంలో 1905 … 07 లలో విప్లవం ఒక రిహార్సల్ లాగ జరిగింది. ఓటమి పొందిన సైన్యాలు ఎక్కువ నేర్చుకుంటాయి అని భావించిన లెనిన్ ఆ విప్లవం నుండి గుణపాఠాలు తీసి దృఢమైన కార్మిక … కర్షక ఐక్యత అవసరమని ప్రబోధిస్తున్నాడు. టాల్ స్టాయ్ సాహిత్యంలో ఎంత వాస్తవిక జీవన సంఘర్షణ ప్రతిబింబించినా, దాని నుండి బయటపడటానికి బడుగు జీవులు సాగించే ప్రతిఘటనా పోరాటాన్ని గానీ దాని ఆవశ్యకతను గానీ ఆయన గ్రహించలేక పోయాడు. టాల్ స్టాయ్ ని జీవనోపాధ్యా యుడుగా ప్రకటిస్తున్న వారంతా ప్రగతి నిరోధకులే! మితవాదులు బుద్ధిపూర్వకంగా టాల్ స్టాయ్ లోని విప్లవ వ్యతిరేక అంశం నుండి వీరు లబ్ది పొంద గొరుతున్నారు అని లెనిన్ విస్పష్టంగా 1908లోనే విశ్లేషించి చెప్పాడు. టాల్ స్టాయ్ బోధించిన సృజనాత్మక సాహిత్యేతర సామాజిక సందేశాల గురించి లెనిన్ చెప్పిన విషయాలలోని ఈ సారాంశమే గాంధీకి కూడా చక్కగా అన్వయం అవుతుంది.

2. మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా గాంధీ లెనిన్ లు తీసుకున్న వైఖరులు, ప్రజలకు ఆ సమయంలో అందించిన మార్గదర్శకత్వము పరిశీలించితే వారిరువురి ఆచరణలలోని తేడాలు కూడా విస్పష్టంగా అర్థం అవుతాయి.
మొదటి ప్రపంచ యుద్ధం 1914 – 18 నడుమ ప్రపంచ పెత్తనానికై అభివృద్ధి చెందిన దేశాల రెండు కూటముల నడుమ సాగిoది. ఇంగ్లాండు, ఫ్రాన్సు , జారిస్టు రష్యా, ఇటలీ, ఆలస్యంగా అమెరికా — ఒక కూటమి దేశాలు కాగా, జర్మనీ, ఒట్టోమన్ సామ్రాజ్యపు టర్కీ, ఆస్ట్రియా — హంగరీ లు మరొక కూటమిగా రూపొంది సాగించిన ప్రపంచ మహాయుద్ధంలో కోటి మంది పైగా తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. రెండు కోట్ల మంది వికలాంగులయ్యారు. 50 లక్షల మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. కోటి మంది బాల బాలికలు తల్లి తండ్రులను కోల్పోయారు. ప్రపంచాన్ని పునర్విభజన చేసుకోవటానికి జరిగిన సామ్రాజ్యవాద యుద్ధం ఇది. ఇలాంటి ఒక ప్రపంచ యుద్ధాన్ని 1907 లోనే ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం పసిగట్టి ప్రజలను ఆయా దేశాలలో అప్పటికే ఏర్పడి ఉన్న కమ్యూనిస్టు పార్టీలను కార్మిక వర్గాన్ని హెచ్చరించారు. లెనిన్ కూడా ప్రతినిధిగా పాల్గొన్న 1907 నాటి రెండవ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ స్టుట్ గార్ట్ మహాసభ నుండి 1910లో జరిగిన కోపెన్హాగన్ సభ, ఆ తర్వాత 1912లో జరిగిన బాస్లే సభలలో రానున్న ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని గురించి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం లోతైన చర్చలు జరిపి తీర్మానం రూపంలో ముఖ్యమైన నిర్ణయాలు చేసింది. వాస్తవంగా యుద్ధం మొదలవగానే కమ్యూనిస్టు ఉద్యమం లోని రకరకాల అవకాశ వాదులు ( ఆస్ట్రియా మినహాయింపు) మాతృ భూమి రక్షణ పేరిట తమ తమ దేశాల పాలకవర్గాల యుద్ధోన్మాదానికి
అండదండలనిస్తే, లెనిన్ నాయకత్వానగల రష్యన్ బోల్షివిక్ పార్టీ అంతర్యుద్ధానికై పిలుపునిచ్చి కార్మికులను, రైతులను, సైనికులను సమీకరించి మొదట జారు ప్రభువుల రాజ్యాన్ని తరువాత బూర్జువా కెరన్స్కీ ప్రభుత్వాన్ని విప్లవం ద్వారా ఓడించి ప్రపంచ శాంతికి ప్రత్యక్షంగా తోడ్పడ్డాడు.
మొదటి ప్రపంచ యుద్ధంలో గాంధీ నిర్వహించిన పాత్రను భారత పాలకవర్గాలు వారి చరిత్ర కారులు సాధ్యమైనంత దాచటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అడుగడుగునా ఆయన బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు ఎనలేని సేవచేసి పెట్టినట్లు నేటి తరాలకు తెలియకుండా ఉంచేందుకోసం!!
మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కాగానే గాంధీ దక్షిణాఫ్రికా నుండి లండన్ చేరాడు.
ఈ ఆపద సమయంలో మీ రాజభక్తిని ప్రదర్శించండి అని అక్కడున్న భారతీయ యువతకు విజ్ఞప్తి చేశాడు. యుద్ధం నిమిత్తం తమ సేవలను బ్రిటిష్ అధికారులకు అంకితం చేయడానికి సిద్ధమంటూ తన, ఇతర భారతీయుల సంతకాలతో ఒక లేఖను భారత మంత్రికి పంపించారు.
1914 – 15 – 16 లలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు మద్రాసు బొంబాయి ఉత్తర ప్రదేశ్ గవర్నర్లు స్వయంగా హాజరై, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యుద్ధ ప్రయత్నాలకు తగినంత రాజకీయ సహకారాన్ని పొందారు. సరిగ్గా అదే కాలంలో గదర్ వీరులు భారతదేశంలో సైనిక తిరుగుబాటుని తెచ్చి బ్రిటిష్ వారిని తరిమి వేయాలనే ప్రయత్నం నిజాయితీగా చేశారు. అది విఫలం కాగా దారుణమైన చిత్రహింసలకు ఉరితీతలకు, నిర్బంధాలకు గురైనారు. ఐరోపా గడ్డ మీద , ఆఫ్రికా , పశ్చీమ ఆసియా దేశాలలో జరిగిన ఆ యుద్ధంలో బ్రిటిష్ వారి తరఫున పోరాడేందుకు సుమారు 13 -14 లక్షలమంది భారతీయ సైనికులు నిర్బంధంగా తరలించబడ్డారు. వారిలో సుమారు 75 వేలనుండి లక్ష మంది దాకా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో లక్షల మంది క్షతగాత్రులయ్యారు. మొదటి ప్రపంచ యుధ్ధంలో బ్రిటీషువారి గెలుపుకి భారతీయ సైన్యాలు నిర్ణాయక ప్రభావం చూపాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కోసం తమ ప్రాణాలను అర్పించటానికి గాను జరిగిన ఈ బలిపశువుల సమీకరణ, యుధ్ధానికి ముందు సంవత్సరానికి *15000 మంది మాత్రమే వుంటే యుధ్ధకాలంలో 1917లో 1,21,000 కాగా మరుసటి ఏడు అది 3,00,000 లకు పెరిగింది. స్వయంగా గాంధీ గారు సైనిక సమీకరణలో పాల్గొన్నారు. మొదటి ప్రపంచ యుధ్ధం ప్రారంభమయినప్పుడు కూడా ఒక అంబులేన్స్ దళాన్ని సమకూర్చేను. దాని కోసం పడిన శ్రమ ఫలితంగా ఫ్లూరసీ వ్యాధి తీవ్రంగా పట్టుకుంది. యుధ్ధం సందర్భంలో ఢిల్లీలో జరిగిన మహాసభలో నేను లార్డ్ ఛెమ్స్ ఫర్డ్ కు యిచ్చిన వాగ్దానం ప్రకారం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ , సైనికులను చేర్చేందుకు ఖేడా జిల్లాలో తిరుగుతూ , ఆ దీర్ఝ ప్రయాణాలలో రక్త గ్రహిణి తెచ్చుకుని చచ్చి బతికేను.
అలా సైనిక సమీకరణలో పాల్గొనే సందర్భంగా – మీరు అహింసావాదులై హింసాత్మక యుద్ధానికి సహకరించటం ఏమిటి? అని ప్రశ్నించిన వారికి ఆయన యిచ్చిన జవాబులిలా వుండేవి.
ఇతరులు తమ పిరికితనం బలహినతలవల్ల అహింసను ఆశ్రయిస్తున్నారు. అలాంటివారు తమకర్తవ్యం నుండి తప్పించు కోవడానికి పవిత్రమైన అహింసా సిధ్ధాంతాన్ని ఒక సాకుగా ఉపయోగించకూడదు.
బ్రిటీషు సామ్రాజ్యం మనలను శతృదాడులనుండి కాపాడే ప్రయత్నం చేస్తోంది. మరి సామ్రాజ్య పరిరక్షణ కోసం ఇలాంటి క్లిష్ట సమయంలో మన చివరి రక్తపు బొట్టు సైతం ధార పోయటానికి సంకోచించకుండా ఉండటమే నేటి మన కర్తవ్యం కావలసి ఉంది. అన్నాడు గాంధీ.
అయితే బాలగంగాధర తిలక్ యుధ్ధంలో సాయపడటానికి యుధ్ధానంతరం స్వరాజ్యం యిస్తామనే హామీని యివ్వాలని
షరతు పెట్టాడు . దానిపై గాంధీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తూ ఈ విషయంలో నాకు తిలక్ కు చిన్న అభిప్రాయ భేదం ఉంది. తిలక్ వంటి వ్యక్తి సైన్యం రిక్రూట్మెంట్ బాధ్యత చేపడితే ప్రభుత్వానికి మనం అందించే సహాయం వల్ల మన ఎడల విశ్వాసం జనిస్తుంది. మనం కూడా ఇప్పటి కంటే అధిక శక్తి సంపన్నుల మవుతామనీ , అలా ఆయన కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందనీ ఆయనతో నేనన్నాను.
మొదటి ప్రపంచ యుద్ధం కాలంలోనే లెనిన్ సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అనే ప్రపంచ ప్రామాణికమైన విశ్లేషణాత్మక గ్రంథం రాశాడు. సామ్రాజ్యవాద స్థాయికి చేరిన పెట్టుబడిదారీ విధానం వెనుకబడిన దేశాలలో తన దోపిడీ ఎన్ని రూపాలలో విస్తరించుకుంటూ పోతుందో, పెట్టుబడిదారీ విధానం యొక్క బలము బలహీనత సామ్రాజ్యవాద రూపంలో ఎలా కేంద్రీకరించబడి ఉంటుందో లెనిన్ చెప్పాడు. సామ్రాజ్యవాదం యొక్క బలహీనమైన స్థావరాలపై ప్రజా విప్లవం ద్వారా దాడులు చేసి దాని ఆయువుపట్టులను తెగ నరకాలని లెనిన్ బోధిస్తే , సరిగా తద్విరుద్ధంగా గాంధీ, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని దాన అత్యంత బలహీన కాలంలో సంరక్షించే కర్తవ్యం చేపట్టాడు.

3. ఇక సైద్ధాంతికంగా ప్రాపంచిక చింతన సామాజిక అవగాహనల పరంగా చూస్తే లెనిన్, నాటికీ నేటికీ ప్రపంచ రాజకీయ మేధా సంపన్నులులో ఒకనిగా భాసిస్తూ ఉంటాడు. అదే గాంధీ ఒక సామాన్య తార్కికవాదిగా కనిపిస్తాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాల యెడ ఒక భయస్తునిలా కనిపిస్తాడు. మతంపట్ల గతంపట్ల భక్తి ప్రపత్తులతో గాంధీ మిగిలిపోతాడు. . యధాతధ వాదానికి అనగా విప్లవాత్మక మార్పులు లేకుండా చిట్టి పొట్టి సంస్కరణలకు గాంధీ ప్రతీకగా నిలబడ్డాడు.
నిజానికి ప్రతి చారిత్రక కాలంలోనూ చిట్టి పొట్టి సంస్కరణలు సంభవిస్తూనే వచ్చాయి. అవన్నీ ప్రజల తిరుగుబాట్లలో నుండి పొందిన అనుభవాలకు లభించిన చిరుపంటలే ! తొలి మలి ఫలితాలే!!. అవన్నీ ఒక తరహా వ్యక్తిగత ఆస్తుల సమాజానికి బదులు మరొక తరహా వ్యక్తిగత ఆస్తుల సమాజం ఆవిర్భవించడానికి లేక కొనసాగటానికి దోహదపడ్డాయి. కానీ మార్క్సిజం అలాంటిది కాదు. సమాజంలో మౌలిక మార్పులు వచ్చి శ్రమ దోపిడీ పునాదులపై కొనసాగుతున్న వ్యవస్థను విప్లవాత్మకంగా కూలదోయాలని బోధించిన సిద్ధాంతం. దానిని వెనుకబడిన దేశాలలో తిష్టవేసిన
సామ్రాజ్యవాదపు పునాదులను మొదలుకంటా తెగ నరకడానికి వలస, అర్ధ వలస దేశాలలో జరుగవలసిన జాతుల విముక్తి పోరాటాలకు సైద్ధాంతిక ఆచరణాత్మక అన్వయాన్ని ఇచ్చినవాడు లెనిన్. సామ్రాజ్యవాదంతో విప్లవాత్మక తెగతెంపులు లేకుండా ఒక రాజీతో కానీ, లేక వారి దళారీల పెట్టుబడితో సర్దుబాటు చేసుకునే విధంగానూ పీడిత ప్రజల పోరాటాలను నీరు కార్చుకుంటూ పక్కదారి పట్టిస్తూ పాత వ్యవస్థనే కొత్త రూపాలలో బతకనిస్తూ, దోపిడీ అసమానతల వ్యవస్థను మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కొనసాగడానికి తాత్విక రాజకీయ పునాదులు నిర్మించి వెళ్ళినవాడు గాంధీ.
లెనినిజాన్ని అర్థం చేసుకోని వారు, దానిని పల్చన చేయాలని ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించేవారు ఉన్నారు. వారికి గాంధీయిజం ఒక అవకాశవాద ఆయుధం.

– దివికుమార్, రచయిత

సోషల్ మీడియా నుంచి సేకరణ

Leave A Reply

Your email address will not be published.

Breaking