Header Top logo

In memory of our peddabapu మా పెద్దబాపు గడ్డం మల్లయ్య యాదిలో

In memory of our peddabapu

మా పెద్దబాపు గడ్డం మల్లయ్య యాదిలో…

2009… ‘వార్త’ పేపర్ల జర్నలిస్టుగా పన్జేస్తున్న. రోజు రాత్రి పదకొండయ్యేది ఇంటికి వొయ్యేసరికి. మా ఇంటికాన్నే బుక్కెడంత బువ్వ తిని పెద్దమ్మొళ్లింటికాడ పండుకునుడు బుద్ధి తెలిసిన కాన్నుంచి నాకలవాటు. పెద్దమ్మొళ్ల ఇంటికాన్నే పండుకునుడెందుకంటే..? మా ఇల్లు ఇరుకుటం ఉండటం ఒక్క కారణమైతే.. పెద్దమ్మొళ్ల ఇల్లు లంకంత ఉండటం ఇంకో కారణం.

ఆ లంకంత కొంపల ఇద్దరే పెద్ద మనుషులుండటం నన్ను బాధవెట్టేది. పెద్దమ్మొళ్ల ఇల్లు మా ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటది. సుట్టూ ఇండ్లుండయి, ఒంటరిళ్లు. ఎదురంగనే స్మశానం. మా ఇంటికాడంటే సుట్టూ ఇండ్లు, సుట్టూ మావోళ్లే ఉంటరు. వాళ్లింటి కాడ ఎవ్వలుండరు కావట్టి రాత్రిపూట పెద్దమ్మ, పెద్దబాపుకేమన్నయితెట్ల? అని నాడే ఆలోచన చేసేటోన్ని. అందుకే ఏ నాత్రయినా వాళ్లింటికి వొయ్యే పండుకునేది. నేను వొయ్యేదాన్క వాళ్లుగూడ నిద్రవోకపొయ్యేది. నా నడక సప్పుడిని నేన్‌ వొయ్యేసరికి తలుపు దీస్తుండె పెద్దబాపు.

ఎంత తిప్పలవడ్డడో దినాం జెప్పేది

ఇంతకీ పెద్దబాపు పేరు చెప్పలేదు గదా..? గడ్డం మల్లయ్య, సన్నాఫ్‌: పెద్దెంకయ్య (మా తాత). మా అయ్యలల్ల అందరికన్న పెద్ద మా మల్లయ్య పెద్దబాపు. నేనే నాత్రి వొయ్నా… ఆ అద్దనాత్రి గూడ ‘తిన్నావురా…’ అనడిగేది. పుసుక్కున తినలేదంటే పాపమే.. ‘పోరనికి ఇంత అన్నం పెట్టుపొమ్మని’ నిద్రవొయ్న పెద్దమ్మను లేపేది. ఆయ్నకు నేనంటే అంతగనమిట్టం. ఎంతైనా ఒక్కరక్తం గదా..? ఆ నిద్రమబ్బుల గూడ నేన్‌ తినేదాన్క ఆయనకు దోసిన ముచ్చట జెప్పేది. సిన్నప్పుడు ఎంత కట్టవడ్డడో, తిండికి ఎంత తిప్పలవడ్డడో దినాం జెప్పేది. నేన్‌ తప్పుదొవ్వ వట్టద్దు, మంచిగుద్యోగం జేస్కోవాలెనని ఆయన తపన. నాగ్గూడ ఆయ్న ముచ్చటంటే పానం.

ఏడ్సుకుంటా చెప్పింది పెద్దమ్మ

ఓ రోజు గిట్లనే ఆఫీసులకెళ్లి వొయ్యేసరికి లేటయింది. పోవుడే లేటంటే అద్దరాత్రిల టీవీ సూసుడలవాటుండేదప్పట్ల.. టీవీ సూసి, సూసి అటే నిద్రవొయ్యేది. టీవీ అట్లనే మొత్తుకునేది తెల్లారేదాన్క. తెల్లారి పెద్దమ్మతోనో బాగోతం. ‘టీవీ బంజేయకుంట వంటె కరెంటు బిల్లు మీ అయ్య కడ్తార్ర’ అని కారడ్డమాడేది. ‘ఆ.. వాని దగ్గర కుచ్చులూగులాడుతున్నయి, వాడొచ్చి కడ్తడాగు’ అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటా దగ్గేది. పెద్దబాపు బాగ నవ్వితే సాలు ఆటోమ్యాటిక్‌గా దగ్గొచ్చేది. (ఆ దగ్గు గంభీరంగుంటుండె) రోజట్లెక్క పెద్దమ్మ తిట్ల పురాణంతోని లేపుతున్నదనుకొని తిరంగ మెల్లగ లేస్తున్నా… ‘ఓ పోడా.. పెద్దబాపు ఎటో సేత్తండురా.. కాల్చెయ్యిలు అంకర వోతున్నయి, మూతి ముడుసుకపోతున్నదిరా’ అని ఏడ్సుకుంటా చెప్పింది పెద్దమ్మ.

In memory of our peddabapu మా పెద్దబాపు గడ్డం మల్లయ్య యాదిలో

కేసీఆర్ ‘దీక్షా దివస్‌’కు బయల్దేరిండు

వరండాల పండుకున్న నేను జెప్పన వొయ్యి వంకరవోతున్న పెద్దబాపు చెయ్యినందుకున్న. అరిచేతులు రాసుకుంటా.. ‘పెద్దబాపు ఏమైందే… ఓ పెద్ద బాపు ఏమైందే…’ అంటే.. ‘ఏం గాలేదురా… చెయ్యిలన్ని తిమ్మిరి వట్టినట్టయితున్నయిరా…’ అంటండు గని మాట నత్తి వోతున్నది. ఏదో జరుగుతుందని నాకర్థమైంది. ఇగ లాభం లేదు.. ఆల్ష్యం చెయ్యొద్దని మెల్లగ ‘బండి మీద కూసుంటవానే పెద్దబాపు’ అనడిగిన. ‘ఆ కూసుంటరా’ అన్నడు. బండి చాల్జేసిన. బండెన్క ఆయ్నను కూసోవెట్టుకొని కన్నారం దావఖానకు బైలెల్లిన. ఆ రోజు ఐతారం.. 2009, నవంబర్‌ 29… తెలంగాణ రాష్ర్టాన్ని తీస్కచ్చేందుకు ‘దీక్షా దివస్‌’కు బయల్దేరిండు అప్పటి ఉద్యమ రథ సారథి, ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌. అల్గునూర్‌ కాడ అరెస్టయిండని తెలిసింది. అక్కణ్నుంచి మెల్లగా మూడ్నాలుగు కిలోమీటర్ల దాకా ట్రాఫిక్‌ జామైంది. ఎదురంగ అచ్చేటాయ్నను ‘బండాపి బండివోతదానే అన్న’ అనడిగిన… ‘ఎహే ఏడవోతదే పోద్‌, పోద్‌. నేనే ఎన్కకొచ్చిన.. దబ్బన పోయేవ్‌ మజ్జల్నే ఇరుక్కపోతవ్‌’ అన్నడు.

నా బొత్తను వట్టుకొమ్మన్న

బండి సదాశివపల్లి కాన్నే వాగ్గడ్డకు మల్పిన. ఎదురంగ అచ్చేటాయ్నె.. ‘ఎహె ఈనంగల బండి ఏడెల్తదే’ అని భయవెట్టిండు. ఎటైతటాయె… ఇయ్యాళ్ల పెద్దబాపును వాగు దాటిచ్చినోన్నే గావాలె అని బండి ఎక్స్‌లేటర్‌ను గట్టిగ గుంజిన. ‘ఓ పిల్లగా ఎన్క కూసుననాయ్నెయి చెప్పులూసిపోతున్నయి…’ అని పక్కపొంటి వొయ్యే బండి మీదాయ్నె మొత్తుకుంటనే ఉన్నడు. బండాపి జూసిన. ఆయ్న చెప్పినట్టే ఒక కాలికి చెప్పు లేదు. ఇంకో కాలుకు జర్రయితే చెప్పూసిపొయ్యేది. ‘పెద్దబాపు చెప్పువోయింది గూడ తెలుస్తలేదానె…’ అనడిగితే ‘ఏమోరా, నేను చెప్పున్నదనుకుంటున్నరా’ అన్నడు. నీ చెప్పుకినా వారెత్తు పీక్తే పీకనియి అని రెండు చెయ్యిలతోని నా బొత్తను వట్టుకొమ్మన్న. మెల్లగా వొయ్యేసరికి వాగు రానే అచ్చే. వాగుల నీళ్లు నడుంబడా వార్తున్నయి. ఇప్పుడా వాగు మీన్నుంచే కేబుల్‌ బ్రిడ్జి వడ్తున్నది. వాగిటు కొస్సకు బండాపిన. ఎట్ల దాటుదామా అని ప్లాన్జేస్తున్న.

దవాఖాన్ల గూడ ఒక్క డాక్టర్‌ లేడు

మా సీదరన్న (పెద్దబాపు కొడుకు)కు అప్పటికే ముచ్చట ఎరుకైంది. వాగటొడ్డుకు ఆయ్నచ్చి నిలవడ్డడు. వాగు ఇటొడ్డుకు నేను. అక్కన్నే బండి వారేసి అన్న, నేను ఇద్దరం గల్సి పెద్దబాపును అమాంతం లావట్టుకొని వాగు దాటిచ్చినం. అటుదిక్కున్న బండి మజ్జన పెద్దబాపును కూసోవెట్టినం. ఆ రోజు ఐతారం. శనారం అచ్చిందంటే సాలు పట్నం బోవుడు, ఎంజాయ్‌ చేసుడు, సోమారం ఏం ఎరుకలేనట్టు మళ్లచ్చి దవాఖాన్ల కూసునుడు మా కన్నారం డాక్టర్లకలవాటు. కన్నారంల ఉన్న దవాఖాన్లన్ని తిరిగినం బండి మీద. ఒక్క దవాఖాన్ల గూడ ఒక్క డాక్టర్‌ లేడు. ఆఖరికి కన్నారంల కొత్తగా వడ్డ అపోలో రిచ్‌ దవాఖాన్లకు తోల్కపోయినం.

నేన్సచ్చిన ఈ దవాకాండ్ల ఉండరా..

పోవుడుతోనే శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాల లెక్కనే ఆ వైర్లు, ఈ వైర్లు బట్టలిప్పి తొడిగేసరికి పానం ఎల్కపోయింది. ఏమన్నయితదా ఏందనే అనుమానమొచ్చింది. పెరాల్సిస్‌ సిన్నగచ్చింది వాస్తవమే అయినా అక్కడి డాక్టర్లు జేసిన యాక్టింగ్‌ మాత్రం కోట్ల బడ్జెట్‌తో తీసే సినిమా లెవెల్లో ఉంది. రోగికి నచ్చిన డాక్టర్‌ దగ్గరికి వోతే రోగం జల్ది తగ్గుతదనే సామెత నిజమే. నాతోని పెద్దబాపు ‘నేన్సచ్చిన మంచిదే గనీ, సతీష్‌గా నేను ఇన్లుండరా’ అన్నడు. లచ్మినారయణ డాక్టరంటే పెద్దబాపుకు నమ్మకం. రెండ్రోజులు బల్మీట్టికి ఆ దవాఖాన్ల ఉంచి సోమారం నాడు లచ్మినారాయణ దవాఖానకు అంబులెన్స్‌ల తోల్కపోయినం. పెద్దబాపు పక్కపొంటి నేనే గూసున్న. ఓ దిక్కు ఇంకా మాటంకరవోతున్నది.. మజ్జన విల్సి ‘అరేయ్‌ సతీషు… కేసీఆర్‌ను అరెస్టు చేసిర్రట గదరా.. దవాఖాన్ల అందరనుకుంటాంటె ఇనవడ్డదిరా.. ఈ ఆంధ్రానా కొడుకులు తెలంగాణియ్యనియ్యర్రా…’ అన్నడు. సల్లగున్న పెయ్యి ఒక్కసారి వేడెక్కింది. రోమాలు నిక్కవొడిసినయి. In memory of our peddabapu

తెలంగానోణ్ని సిన్నసూపు సూసేటోళ్లు

‘అరేయ్‌ నేను 1942ల వుట్టిన, 1965ల సర్వేయర్‌ రెవెన్యూ డిపార్టుమెంటుల నౌకరొచ్చింది. నౌకరొచ్చినంక రెండేండ్లకు మీ పెద్దమ్మను జేస్కున్న. పెండ్లయ్యిన కొత్తల్నే కర్నూలుకు కొట్టిర్రా ఇక్కడి పెద్దసార్లు. ఛల్‌ నేన్‌ ఆ ఆంధ్రకు వోనంటే వోనన్నా.. వోకుంటే నౌకరికి రాజీనామా ఇయ్యిమన్నరు. కట్టపడి సంపాయించిన నౌకరి గదరా బిడ్డా ఇడువబుద్ది గాలె. అవ్వా, నాయిన, ఏడుగురన్నదమ్ములు, ఒక సెల్లెనిడిసివెట్టి, పెద్దమ్మను వట్టుకొని కర్నూల్ల కాలువెట్టిన్రా… అక్కడ తెలంగానోణ్ని సిన్నసూపు సూసేటోళ్లు.

In memory of our peddabapu మా పెద్దబాపు గడ్డం మల్లయ్య యాదిలో

తెలంగాణ ఉద్యమంలో నేను సైతం..

ఛల్‌ గీ ఆంధ్రోనితోని మనకు పొత్తేందని 1969ల మా తెలంగాణ మాగ్గావాలెనని తెలంగాణ ఉద్యమం షురూవైందిరా.. ఆ ఉద్యమంల నేన్గూడ రాళ్లెత్తిన.. పోలీసోళ్లతోని దెబ్బలు దిన్న.. అప్పుడు ఉద్యమం రెండేండ్ల దాకా నడిసింది. ఇగ తెలంగాణొస్తదనుకునే మోపున అణగదొక్కిర్రురా బిడ్డా.. మన తెలంగాణ నాయకులే ఆంధ్రోని మోజేతు నీళ్లు తాగిర్రురా’ అని రోజు నాత్రిళ్ల పెద్దబాపు చెప్పే తెలంగాణ ముచ్చట్లు గుర్తుకొచ్చినయి.

In memory of our peddabapu మా పెద్దబాపు గడ్డం మల్లయ్య యాదిలో

తెలంగాణలో లొల్లి నడుస్తోంది..

ఆ అంబులెన్సుల గూడ తెలంగాణ ముచ్చటదీసి ‘నాడే అస్తదనుకున్న తెలంగాణ ఇంకా రాకపాయె.. ఇప్పుడు కేసీఆర్‌ కొట్లాడితే గూడ అరెస్టులు జేయవట్టిరి’ అని మస్తు బాధవడ్డడు. లచ్మినారాయణ దవాఖాన్ల ఏడ్రోజులున్న పెద్దబాపు కరెస్టు 2009, డిసెంబర్‌ 9న మంచిగై డిశ్చార్జయిండు. ఇంటికివొయ్యేసరికి నాత్రి పదయ్యింది. అప్పటికి తెలంగాణ మొత్తం లొల్లి లొల్లి నడుస్తున్నది. యువకులు తెలంగాణ కోసం సచ్చిపోతర్రు. కేసీఆర్‌ దీక్ష మీదనే ఉన్నడు. నిమ్మరసం తాగుమని ఎంత బతిమిలాడినా సుక్క మింగుతలేడు. ఇగ కాంగ్రెస్‌కు తెలంగాణ ఇచ్చుడే తప్ప వేరే దారి లేదు.

In memory of our peddabapu మా పెద్దబాపు గడ్డం మల్లయ్య యాదిలో

ఆంధ్రోళ్ల రాజీనామాతో మళ్లీ..

డిశ్చార్జి అయి ఇంటికి వోయినంక గూడ పెద్దబాపు ‘అరేయ్‌ సతీషు టీవీ వెట్టురా తెలంగాణ ముచ్చటేమైందో తెలుస్తద’న్నడు. కరెస్టు నాత్రి 11 పదకొండు దాటింది. పదకొండుంబావుకల్లా ఎర్రశాల్వ గప్పుకొని ప్రెస్‌మీట్‌ వెట్టిండు సిదంబరం సార్‌. ‘తెలంగాణ ఇచ్చేటందుకు మేం సిద్ధమైనం. మీరు దీక్ష విరమించాలె కేసీఆర్‌ గారు’ అని ఇట్ల ప్రకటన చేసిండో లేదో… అటు పెద్దబాపు, ఇటు నా సంబురానికి పట్టపగ్గాల్లెవ్వు. ఇద్దరం గల్సి స్వీట్లు వంచుకున్నం. పాపం ఆయ్న సంతోషం ఒక్కరోజు గూడ ఉండలె. తెల్లారి ఆంధ్రోళ్లందరూ రాజీనామా చేసేసరికి ఇచ్చిన తెలంగాణ ఎన్కకువోయింది. పెద్దబాపుకే కాదు, తెలంగాణోళ్లందరికి నోటికాడి బుక్క జారినంత పనయ్యింది. అయినగూడ ‘ఇగ తెలంగాణను ఆపుడు ఎవ్వనితరం గాదురా.., ఏదో రోజు కేసీఆర్‌ తెలంగాణ తెస్తడని నాతో నమ్మకంగన్నడు. ఆయ్న నమ్మకం నిజమైంది. ఆయ్న గన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల నెరవేరింది. 2014 జూన్‌ 2న తెలంగాణొచ్చింది. In memory of our peddabapu

In memory of our peddabapu మా పెద్దబాపు గడ్డం మల్లయ్య యాదిలో

పెద్దబాపు కాలం జేసిండు..

ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్ననంటే.. 2009 నుంచి 2020 దాన్క మంచిగనే బతికిండు. ఇదే ఏడాది కరెస్టు జనవరి 20 తారీఖున తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం మల్లయ్య పెద్దబాపు కాలంజేసిండు. మా గడ్డం ఖాన్‌దాన్‌ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇయ్యాల్ల మల్లయ్య పెద్దబాపుది ఏడాది మాషికం. మనిషి వోయిన, మనిషితో ఉన్న జ్ఞాపకాలను మర్శిపోం గదా.. అందుకే ఆయ్న పంచిన జ్ఞాపకాల్లో పెద్దబాపును యాజ్జేసుకుంటున్న.

అమర్ హై మల్లయ్య పెద్దబాపు.. అమర్ హై.. అమర్ హై..

gaddam satheesh journalist

గడ్డం సతీష్‌, సీనియర్ జర్నలిస్ట్
99590 59041

Leave A Reply

Your email address will not be published.

Breaking