I kiss the sun పొద్దుని ముద్దెట్టుకుంటాను
I kiss the sun
పొద్దుని ముద్దెట్టుకుంటాను
రావడానికీ
పోవడానికీ మధ్య
పిడికెడు మన్ను మాత్రేమే మిగిల్చుకోలేను.
చిటికెడు నవ్వునీ
గోరువెచ్చని పుస్తకాన్నీ
అక్షరాల గంధక ధూళినీ
కొంచెం కొంచెం దాచుకుంటా
కాలం దాటిల్లి పోతాను.
ఐనా
మనం
ఓ జీవితకాలం
ఒకరికొకరం ఇచ్చుకోడానికి
పెదాల మధ్య తేనెని ఉంచగల
నవ్వు తప్ప
ఇంకేదో
అగోచర మధుర పాదరసం ఉందని అనుకోను.
లిప్త కాలపు జీవితంలో
నైదిబ్బ మీద కొత్తకొత్తగా వెలిగే
గోంగూర పువ్వు నవ్వులోనో
ఒరిగిన పందిరి మీద సుదూరప్రేమగా పాకిన
బీరపువ్వు సౌందర్యంలోనో
మగ్నం కావడం కంటే
మరోటి
మన మాటల్లోనుంచి కోరుకోలేని ఆశక్తత ఒకటి
నాకు మరణ ధూళిని బతుక్కి అంటించింది.
ప్రియసఖుల పల్లవ పదాలు
ఏరుకోడానికి భూమ్మీదకి వచ్చిన బేహారిని.
మలుపుల వీధుల్లో దోగాడే
తలపుల త్రోవలో తచ్చాడే తడి గీతాల తాపసిని.
నన్ను చూసి తొలగిపోవు
పెదాల నవ్వుల ఛాయని చిత్రికల కొరకై
అలసి అన్వేషించే తుంటరి సాహసికుడ్ని.
మాట్లాడమని
నీకు చెప్పడానికి
ప్రతి సమాధానపు పెదాలు లేని చిట్లిన దేహపు పెళుసు బారిన వాక్యాలు
నిషేధించిన అనాగరిక వ్యాకరణాన్ని నేను.
వేకువనే
నడుం ఒంగిన చంద్రబింబపు
విలాప వాక్యం తాగిన వాడ్ని.
తొలి ఉదయాల
సూర్యోదయపు నారింజ రంగు నవ్వుతో
నువ్వుంటావనే ఆశ కూడా లేదు.
ఇప్పుడిక
ఈ మట్టి మీద మధురోహల నవ్వులూ,
జ్ఞాపకాల పూలతలూ
అనిచ్చిత అభినివేశ గీతాల పల్లవులు.
వాటిని వెతుక్కుంటూ
పొద్దులోకి నడుస్తాను.
పొలమారిన గతాలేవీ తోడురానప్పుడు
ఒంటరిగానే
పొద్దుని ముద్దెట్టు కుంటాను.