భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది. బుధవారం అర్ధరాత్రి 43 అడుగులకు వరద తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను విరమించారు. గురువారం ఉదయం 11 గంటలకు 45.8 అడుగులకు వరద ఉద్ధృతి చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి, కాళేశ్వరం, తాలిపేరు, పేరూరు వైపు నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో భద్రాచలం వద్ద ఈ రోజు రాత్రి 9గంటలకు 48 అడుగుల నీటి మట్టం చేరుకుంటుందని కేంద్ర జలవనరులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. నీటిమట్టం 48 అడుగులకు చేరితో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది.
పాల్వంచలోని నాగారం కిన్నెరసాని వంతెన వద్ద రహదారి ధ్వంసమైంది. దీంతో భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, వి.ఆర్.పురం, కుక్కునూరు మండలాలకు, ఖమ్మం, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కట్టువాగు, మొట్ల వాగు, కోడిపుంజుల వాగు పొంగి ప్రవహించడంతో మణుగూరు పట్టణాన్ని వరద ముంచెత్తింది. సుందరయ్యనగర్, కాళీమాత ఏరియా, ఆదర్శనగర్, గాంధీనగర్, మేదరబస్తీ కాలనీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి మోకాలిలోతు వరదనీరు చేరింది.