For survival in the burning ends .. మండె ఎండల్లో బతుకు కోసం..
For survival in the burning ends .. మండె ఎండల్లో బతుకు కోసం..
పక్కవూరికి పశువును కూడా వాహనంలో తీసుకెళ్లే ఈ రోజుల్లో, ఎర్రటి ఎండలో తారురోడ్డు వెంట జీవితాన్ని కాచి వడబోసిన ఓ జంట నడుచుకుంటూ వెళ్తోంది. అటువంటి మనుషుల్ని చూసి ఎన్నాళ్లయ్యిందో! ఎప్పుడో ఇటువంటి మనుషులు అవ్వచేతి ముద్ద తిని “నీబిడ్డలు చల్లగా వుండలమ్మా” అని దీవెనలిచ్చిన జ్ఞాపకం. బైక్ వేగం తగ్గించి మెల్లగా పోనిస్తూ వాళ్ళనే చూస్తున్నాను. ఆయనకు చూపు తగ్గినట్లుంది, ఆయమ్మ ముందు వెళ్తుంటే, చేతికర్ర సాయంతో ఆయన అనుసరిస్తున్నాడు. ఆయన భుజానికి ఓ బ్యాగు వేలాడుతోంది. ఆయమ్మ ఓ భుజానికి గుమ్మెత (ఓ వాయిద్య పరికరం) మరో భుజానికి చిన్న గుడ్డ సంచీ తగిలించుకోనుంది.
“ఏమయ్యోవ్! ఇదిగో అక్కడ నాలుగిండ్లు ఉన్నెట్టుండాయి, ఆడిగ్గూడా పొయి పోదాంపా” అందామె.
“అట్నెలే, కాళ్ళు లాగుతుండయ్, కాసేపుకుచ్చోని పోదాం” అన్నాడాయన. ఇద్దరూ రోడ్డుపక్కన మోరీపై కూర్చున్నారు. పెద్దబొట్టు, చేతినిండా గాజులతో అమ్మకు నిర్వచనంలా ఉందామె. బైక్ ఆపి
“అమ్మా! మిమ్మల్ని ఓ ఫొటో తీసుకోవచ్చా” అని అడిగాను.
“ఎందుకు నాయనా! అసలే కాలాలు బాగాలేవు’ అందామె అనుమానిస్తూ. For survival in the burning ends
“అమ్మా ! నాకూ పిల్లలున్నారు మీకు సెరుపు జేసే మనిషిని మాత్రం కాదు. మీలాంటి మనుషులు ఇప్పుడు కనపడ్డం లేదు. అందుకే అడిగినాలేమ్మా” అన్నాను నేను.
“నిజమే సావీ! మా కథలు యినేవాళ్ళుంటేనేగదా మేము కనపడేది. ఆరోజులు ఎప్పుడో పాయ. మాపిల్లోళ్లకు ఈ ఇద్య అబ్బనేలేదు. మాకు అన్నం బెట్టిన ఈ ఊర్లను ఓసారి సూసి పోదామని వచ్చినామ్ లే” అని నాతో చెప్పి, “పోనీలే అంతగా అడుగుతాండు, పోటా తీసుకోనీలే” అన్నాడు అమెనుద్దేశించి.
“అవునయ్యా! మీ పిల్లొళ్లకు కత చెప్పడం రాదు. మాపిల్లోళ్లకు కాడి దున్నడం చేతకాదు”. అన్నాను నేను. హాయిగా నవ్వారు యిద్దరూ. పక్కవూరికేకదా అని వట్టిజేబుతో వెళ్లిన నాకు, వాళ్లకు ఏమీ ఇవ్వలేనందుకు దుఃఖం మిగిలింది. ఫొటో తీసుకున్నందు నన్ను యాచించని వాళ్ళ అభిమానం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిద్ర పట్టడంలేదు. పొలంలో మంచెమీద అటూఇటూ దొర్లుతున్నాను అశాంతిగా…
వెంకట్ రెడ్డి గంట, రచయిత