February 7 Ramabai Jayanti ఫిబ్రవరి 7 రమాబాయి జయంతి
February 7 Ramabai Ambedkar Jayanti
ఫిబ్రవరి 7 రమాబాయి అంబేద్కర్ జయంతి
కొన్ని కోట్ల మంది అమ్మలకు
వరం లాంటి అమ్మ కావడం,
కొన్ని కోట్ల గుడిసెల్లో
దీపం అయ్యే మనిషి కోసం
చమురు లేని వత్తికావడం,
ముగ్గురమ్మల మూలపుటమ్మలు
బొమ్మలై పూజలందుకుంటారు కానీ
రక్త మాంసాలతో
మహోన్నత మానవీయ స్పర్శతో
అరుదైన ఆదర్శానికి
కర్తవ్య ఉపదేశం చేసే మహిమాన్విత అమ్మ కావడం,
నిరవధిక పస్తులను మాపే
గంజిబువ్వ
సోయి తప్పిన నోటికి
అద్భుత ఆకలిని పరిచయం చేసే పున్నీళ్ల బువ్వ.
గుడిసెలు కాలే ఎండల్లో
చిరునామా లేని కోట్లాది డస్సిపోయిన గుడిసెలకు
అక్కున చేర్చుకుని నీడనిచ్చే
మర్రి చెట్టు కొమ్మ లాంటి అమ్మ.
త్యాగాల తరువుల అమ్మ
ఊరే ఆత్మగౌరవ నీటి చలమల సెలయేరు వంటి అమ్మ.
అమ్మంటే
మాతా రమాబాయి అంబేద్కర్.
అమ్మలంటే
రమాబాయి అంబేద్కర్ అడుగుజాడలని వెతుక్కునేవాళ్ళు.
కొన్ని కోట్ల గుడిసెల్లో దీపమైన
బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గానికి సైదోడుగా నిలిచిన
మాతా రమాబాయి అంబేద్కర్ గుడిసెల గుండెల్లో ఎప్పుడూ కొలువై ఉంటారు.