Death note మృత్యులేఖ
Death note
మృత్యులేఖ
యుద్దం
ముగిసిన పొద్దున్నే
శాంతికపోతాలు ఆకాశంలోకి ఎగిరిపోతాయి
ఇరు దేశాల నాయకులు
గుండె గుండె అన్చుకొని చేతులు కలుపుకుంటారు.
కానీ…?
సైనికుడి తలను ఒడిలో పెట్టుకొని
దుఃఖాన్ని ధారపోస్తున్న తల్లి వలపోత
ఏ అధ్యక్షుడికి పట్టదు.
ఓ పసిబిడ్డ మాత్రం
చనిపోయిన అమ్మ చనుబాలను తాగే ప్రయత్నంలో రక్తం పీల్చుతూ మరణిస్తుంది.
నల్గురి కొడుకులను కోల్పోయిన
నాన్న దేహాం మాత్రం ఊరౌతల మర్రిచెట్టుకు
వేలాడుతుంటది.
కుటుంబాలకు కుటుంబాలే వల్లకాడైపోతే
బంధువుల ఇండ్లల్లో
చిత్రపటాలకు పూలదండలే కరువున ధీనత్వం కనిపిస్తుంటది.
ప్రియుడి రాకకోసం ఎదురుచూస్తున్న ప్రేయసి చేదువార్తవిని
తాము రాసుకున్న లేఖలను చితిమంటలపై కాలబెడుతుంటది.
కల్లమంత పుట్టెడు ధాన్యాన్ని కలగన్న రైతు
తన పంట మైదానమంత బూడిదైతే
బువ్వకోసం అర్రులుసాచే కఠిన దృశ్యాలెన్నో సాజీవంగా కనవడుతాయి.
ఎన్నో కలలు మట్టిల కల్సిపోతాయి..!
మరెన్నో ఆశలు ఆశయాలు
బాంబుల దాడిలో భస్మమైపోతాయి
ఎందరో ప్రజల మరణవార్త మాత్రం
ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది..?
యుద్దం జరిగిన దేశ చరిత్ర మాత్రం
ఈ భూమి ఉన్నంత వరకు ఊపిరితో ఉంటుంది.
యుద్దం
ఎప్పటికైనా ముగిసిపోతుంది కానీ
జనాల వేదనొక్కటే శాశ్వతంగా ఉండిపోతుంది.