Death devoured by Sirivennela సిరివెన్నెలను కబళించిన మృత్యువు
Death devoured by Sirivennela నిన్న ఆట ఆగింది.. ఇవాళ పాట మూగబోయింది..!!
సిరివెన్నెలను కబళించిన మృత్యువు..!!
ఏదీ..? ఎక్కడికెళ్ళింది..? సరసస్వర సురఝరీగమనమౌ సామవేదగానం(పాట).?
సిరివెన్నెల కురిపించిన ‘సీతారామశాస్త్రి’ గారి సాహితీ ప్రసంగం…!!
“వైరాయణం” కవితా సంపుటి
జీవితంలో కొన్ని సందర్భాలను ఎప్పటికీ మరువలేము. అలాంటి ఓ సందర్భం..14.11.2020మధ్యాహ్నం జరిగిన మువ్వా శ్రీనివాసరావు గారి కవితా సంపుటి “వైరాయణం” కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం. (వెబినార్ ద్వారా) ఈ కవితా సంపుటిని ఆవిష్కరించారు. సీతారామశాస్త్రి గారు చేసిన ప్రసంగం సాహితీ వెన్నెలను కురిపించింది. నా మటుకు నేను ఆ సిరివెన్నెల లో తడిసి ముద్దై పోయాను.! సిరివెన్నెల ను గురించి కొత్తగా చెప్పటం..పాఠకలోకానికి పరిచయం చేయటం ఎంత వెర్రితనమో సీతారామశాస్త్రి గారి గురించి చెప్పడం.. ఆయన్ను కొత్తగాపరిచయం చేయడం కూడా అలాంటి వెర్రితనమే.చంద్రుడ్ని చూపించిచంద్రుడని చెప్పడం .. సూరీడ్ని చూపించి సూర్యుడని చెప్పడం లాంటి హాస్యాస్పద ప్రయత్నం అన్నమాట.!
ప్రసంగం గురించి మాట్లాడుకుందాం సరే.. సీతారామ శాస్త్రి గారి ప్రసంగం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం…!!వినయం వల్ల విద్య శోభిల్లుతుంది. అణకువ వల్ల మనిషి గొప్పదనం వెలుగులోకి వస్తుంది. ఎంతఎత్తుకు ఎదిగినా, ఒదిగి వుండే తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని ఆకాశమంత విశాలం చేస్తుంది. సీతారామ శాస్త్రిగారి ప్రసంగంలో ఎక్కడా భేషజం కానీ.. తాను గొప్ప కవి అన్న విషయాన్నిఎక్కడా ప్రదర్శించలేదు.. సరికదా.. తనకు ఇప్పటి కవిత్వంలోని ట్రెండ్స్ అంతగా తెలీదని ఎంతో వినయంగా చెప్పుకున్నారు. సీతారామ శాస్త్రి గారు కేవలం సినీ కవి గానే ప్రసిద్ధి చెందారు. ఆయన ఎప్పుడూ ఇప్పటి ట్రెండ్ లో కవిత్వం రాసినట్టు గానీ కవితా సంపుటాలు అఛ్చేసుకున్న దాఖలాలు గాని లేవు. ఈ మాత్రం కవిత్వం పుంఖాను పుంఖాలుగా రాయలేకా కాదు. లెక్కకు మించి కవితా సంపటాలు తేలేకా కాదు. ఆయన కవితా ప్రయాణం సినిమాపాటలతో ప్రారంభమై అదే దిశలో కొనసాగుతోంది. ఎందుకనుకున్నారో ఏమో గానీ ఆయన నేటి కవిత్వం జోలికి పోలేదు. ఆయన తలుచుకుంటే ఈమాత్రం కవిత్వం రాయలేరా? అంటే “ఎందుకు రాయలేరు ? అన్న సమాధానం వస్తుంది.
గొప్ప కవిత్వం రాయగలరు
ఈమాత్రం కవిత్వం ఏమిటీ? ఇంతకన్నా గొప్ప కవిత్వం రాయగలరు. అయినా తనుఈ కవిత్వానికి దూరంగా వున్నందువల్ల నేటి కవితా ధోరణులు గురించి తనకేమీ తెలీదని ఎంతోవినయంతో చెప్పారు. అయితే ఇప్పుడు వస్తున్న కవిత్వాన్ని చదువుతుంటానని అందులోని కొత్త ప్రయోగాలను మంచిని గమనిస్తుంటానని చెప్పడం ఆయన సంస్కారానికి కొలమానం. అలా చదివిన కవిత్వంలో తనకు బాగా నచ్చిన వాటిలో మువ్వా శ్రీనివాసరావు గారి వాక్యాంతం” ఒకటి అట. సీతారామ శాస్త్రి గారు తన ప్రసంగంలో ఓ రెండు కొత్త పదం ప్రయోగాలను ప్రస్తావించారు.
అందులో 1.వినువరి. 2.మూతి గోచీ
మనకు ‘చదువరి ‘ (పాఠకుడు) తెలుసు. మరి ఈ ” వినువరి ఎవరు..? అంటే వినేవాడు (శ్రోత)
వినువరి. అటతమాషాగా వుంది కదూ..!
రెండోది. మూతి గోచి
కరోనా కాలంలో ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు “మూతి గుడ్డ * మాస్క్ ను కట్టుకుంటాం. దాన్నే
“మూతి గోచీ * గా నామకరణం చేశారు శాస్త్రిగారు. ఇలాంటి కొత్త పదం ప్రయోగాలు ఆయన సినిమా పాటల్లో కోకొల్లలుగా కనబడతాయి. ఆయన రాసిన చాలా పాటలకు. కావ్య స్థాయి వుంది. ఒక్కసిరివెన్నెల సినిమా పాటలనే తీసుకుంటే.
ఆదిభిక్షువు వాడినేది అడిగేది..
బూడిదిచ్చేవాడినేమి కోరేది
ఏమి అడిగేదీ..ఏది కోరేదీ.!!
అంటూ నిందా స్తుతి లో రాసిన పాట ఒక్కటి చాలు. శాస్త్రిగారి అపారమైన ప్రతిభను కొలవడానికి ఇలాంటి గొప్ప పాటలు వందల కొద్దీ వున్నాయి. నిజానికి ఆయన నేటి కవిత్వంపై దృష్టి పెడితే మేం గొప్ప కవులమని భుజాలు తెరుచుకునే చాలామంది కవులు తేలిపోతారు.! వెలవెల బోతారనడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు.
మూగపోయిందంటే..నమ్మేదెలా?
సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల వెన్నెల స్పర్శఎలాంటిదో ఆయన కవిత్వం అలాంటిది. పాటల కవిగా ఆయన క్రమంగా ఎదగలేదు.! పుట్టుకతోనే. ఆయన పాట(సిరివెన్నెల) పరిమళించింది. కావ్యస్థాయిని అందుకుంది. ఆయన నిత్యం కవితావసంతుడు. గలగలపారే సెలయేటి పాట. మూగపోయిందంటే..నమ్మేదెలా?
నిన్న ఆట (డ్యాన్స్ .. శివశంకర్ మాస్టర్) ఇవాళ పాట మూగబోవడం మన దురదృష్టం. ఆ ఆటా పాటా లేని లోటు తీర్చేదెవరు..? అంతటి ఆటను,పాటను దరిచేర్చేవారెవరు?