Header Top logo

Coffee with Vani Venkat Poetry కాఫీ విత్ వాణి వెంకట్ పొయెట్రీ

Coffee with Vani Venkat Poetry

కాఫీ విత్ వాణి వెంకట్ పొయెట్రీ

వాణమ్మ “నిశీథి” నావ వెలుగుతీరానికి చేరేనా?
కొరటమద్ది వాణి కవిత…”నిశీథి “ ..ఓ సమీక్ష .!!

చీకటంటే చాలా మందికి భయం.అంతావెలుగునే ప్రేమిస్తారు. చీకటిని ద్వేషిస్తారు. నిజానికి చీకటే లేకుంటే వెన్నెల్ని గుర్తు పట్టడం ఎలా? “తమసోమా జ్యోతిర్గమయ “అనడంలో అర్థం ‘తమస్సు నుండి జ్యోతి వైపుకు అనేగా.తమస్సే లేకుంటే జ్యోతికి గుర్తింపేది? “ చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమేఒక దీపావళి “ అన్నాడో సినీకవి.చీకటిని వెలుగు నుంచి వేరు చేసి చూస్తాం కానీ నిజానికి చీకటి వెలుగులో భాగమే.చీకటిని నిరాశకు సంకేతంగా వాడతారు మన… కవులు.నిరాశే లేకుంటే ఆశల వెలుగుఎక్కడి నుంచి వస్తుంది?

కొరటమద్ది వాణి (వాణి వెంకట్ ) నిశీథి (చీకటి ) శీర్షికతో రాసిన కవిత చీకటి విలువేమిటోతెలియజేస్తోంది.నిజానికి వాణమ్మకు చీకటంటేనే ఇష్టం.తన జీవితంలో జరిగిన ఓ దురదృష్ట సంఘటనతో ఆమె చీకటిని ప్రేమించడం మొదలు పెట్టింది.ఆ మాటకొస్తే చీకటిని ‘ దత్తత ‘తీసుకుందని చెప్పొచ్చు. ముందుగా వాణమ్మ కవితను చదవండి !! Coffee with Vani Venkat Poetry

*“నిశీథిని.” ‌ కొరటమద్ది వాణి

“ అంతా వెన్నెలైతే అమావాస్యను
ఎలా అంగీకరించాలి

రోజంతా పగలుగా మిగిలిపోతే
ఆహ్వానించాలి

వెలుగు వెలి వేసిందని నిందించ లేక
నిశీధి కూడా జ్ఞానం పంచే వేదికనుకుంటూ

మనసుతో ముచ్చటించడమూ
మౌనంతో చెలిమి
శూన్యం ఆవహించడము
అరుదైన తోడే అవుతున్నాయి

తలపుల వంతెన నిర్మించే
భావాలను మాలిమి చేసుకునే
అందమైన అతిశయం చీకటే

వెలుతురు ఉనికి చూపిస్తూ
నిశిలో శశికి బాటలు వేస్తూ
మిణుకుమనే ఆశకు ఆలంబనౌతూ
రేపటిని రమ్మని పిలిచే
ఈ చీకటీ ఒక నేస్తమే

అక్షర వర్ణాలద్దుకుంటూ
మనో ప్రపంచాన్ని చూపించే
ఈ చీకటితో కూడా చెలిమి
ఓదార్పవుతూనే వుంది

రాలే కన్నీళ్ళను దాచేస్తూ
దిగులుకు ధైర్యాన్నిస్తూ
వేకువ తోడుకు బాటలు వేస్తూ
కలలను కౌగించుకునే
నాంది చీకటిదే

చీకటి వెలుగుల కలయిక
మారే రోజుల మర్మము
కదలక తప్పని కాల గమనం

కొరటమద్ది వాణి !!

లోకమంతా వెన్నెలైతే మరి అమావాశ్యను ఏం చేయాలి? ఎలా అంగీకరించాలి?లోకంలో చీకటంటూ లేకపోతే వెలుగుకు అర్థం,పరమార్థం ఏముంటుంది? అసలు రోజు రోజంతా వెలుగే వుంటే అసలు పగలుకు గుర్తింపేం వుంటుంది.? Coffee with Vani Venkat Poetry

చీకటిని మనం అజ్ఞానమని,వెలుగును జ్ఞానమని‌ భావిస్తాం. చీకటి అజ్ఞానానికి,వెలుగు జ్ఞానానికి ప్రతీకలు. వెలుగు చీకటిని వెలివేస్తుంది.చీకటి తలదించుకొని‌వెళ్ళిపోతుంది. జ్ఞానంపంచడం వల్లే వెలుగుకు అంత గుర్తింపు,పేరు. అందుకే చీకటి కూడా జ్ఞానాన్ని పంచే ప్రమిదగా మారింది. వేదికయ్యింది.అది మనసుతో ముచ్చడించడం మొదలెట్టింది. మౌనంతో చెలిమి చేసింది.శూన్యం ఆవహించిన కాడ అరుదైన తోడుగా మారింది.

వెలుగు..! వెలుగు అంటూ జనం వెలుగు వెంబడే పడతారు కానీ, నిజానికి తలపుల వంతెననిర్మించే భావాల్నిమాలిమి (మచ్చిక ) చేసుకునే అందమైన అతిశయమే ఈ చీకటి.

వెలుతురుకు ఉనికికి కారణం చీకటి.నిశిలో (చీకటిలో ) శశి ( చంద్రుడు,వెన్నెల ) కి దారి చూపించేది ఈ చీకటే. నిరాశలో మినుకు మినుకు మనే ఆశకు ఆలంబనవుతూ, రేపటినిరా రమ్మని పిలిచే ఈ చీకటీ ఓ నేస్తం లాంటిదే.

అక్షర వర్ణాల్ని అద్దుకుంటూ రంగు మార్చుకుంటూ ,మనో ప్రపంచపు ద్వారాలు తెరుస్తోంది.మనసులో నిక్షిప్తమైన అశాంతికి వెలుగుల శాంతిని పంచుతోంది.అందుకే నేమో? ఈ చీకటితోచెలిమి చేస్తే..అది ఓదార్పు అవుతోంది. మనసుకు సాంత్వనం కలుగుతోంది.

కళ్ళనుంచి రాలే కన్నీళ్ళను కనబడకుండా దాచేస్తూ…
కుంగిపోతున్న దిగులుకు ధైర్యాన్నిస్తూ, వేకువకు
తోడుగా బాటలు వేస్తూ, కలల్ని కౌగిలించుకునేది ఈ చీకటే.

చీకటి వెలుగుల కలయిక అనివార్యం.మారుతున్న రోజుల మర్మం.కదలక తప్పని కాలగమనం. ఇదే ఈ చీకటి కొలమానం.అలంకారం.

వాణమ్మ కవిత్వం ఇంకా నిరాశ గుమ్మం దాటి బయటకు రావడం లేదు.’ నిశిలోనే శశిని ‘నిరాశలోనే ఆశను చూసుకునేమనస్తత్వం వాణమ్మది. గుండెల్లో గుచ్చుకున్న బాధ తాలూకు సింప్టమ్స్ ఇంకా తొలిగిపోలేదు.వేకువ వస్తుందని తెలియక కాదు. వేకువ ఎలాగూ వస్తుంది.కానీ చీకటిని తిట్టుకుంటూపొద్దుకోసం ఎదురు చూడటం వాణమ్మకు ఇష్టం వుండదు.చీకటితో చెలిమి చేసి,చీకటితోనే ఊరట పొందాలన్న లక్ష్యం ఆమెది. చీకటిలోనే ‘వెలుగుంది , అజ్ఞానంలోనే ‘జ్ఞానం ‘ వుందన్న నమ్మకం ఆమె జీవిత నౌకకు తెరచాపగా మారింది.ఈ నావ ఆశించిన గమ్యాన్ని చేరుతుందని ఆశిద్దాం.!! Coffee with Vani Venkat Poetry

ఎ.రజాహుస్సేన్..!!

Leave A Reply

Your email address will not be published.

Breaking