అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన సీఎం జగన్
- హోం శాఖకు లేఖ పంపిన రాష్ట్ర డీజీపీ కార్యాలయం
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు సవాలుగా తీసుకున్నారు. అయినా కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లలోను, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది.
అంతేకాక కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించడమైనది. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం హోం శాఖకు లేఖ పంపింది. ఇందుకు సంబంధించి రేపు (శుక్రవారం) జీవో వెలువడనుంది.