Header Top logo

Closing Charms-7 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు

Closing Charms-7

పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-7

పుస్కున సస్తే  సావు దినాల కర్సు కోసం  మేం తిప్పల పడొద్దని ముందే మా అమ్మ జాగ్రత్త పడ్డది. ఆమే సావు బిడ్డలమైన మాకు భారం కావొద్దని లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసింది. ‘నేను సావంగనే, ఠంచనుగా అదే రోజు పైసలియ్యాలని ఏడుస్తూ, బ్యాంకు మేనేజర్ కు చెప్పింది. మిత్తికి ఇస్తే, జల్ది ఇయ్యరని, బ్యాంకుల పెడ్తున్న సర్ అంది. భూములు, జాగలు ఆస్తులైతే ఇయ్యకపోతి, మిగిలిన నా సావుకు కూడా అప్పులు చేపిస్తే ఎట్లా   అన్న మా అమ్మ పిట్టల సత్తమ్మ కత చెప్త వినుండ్రి.

pittala mummy

ఏజ్ ఎక్కువై గట్లనే చేస్తుందిలే అనుకునెటోల్లం

2014 లో  సుద్రాయించనట్టు చేసేది. పానం బాగ లేక సతాయించేది.  ఏజ్ ఎక్కువై గట్లనే చేస్తుందిలే అనుకునెటోల్లం. కాని అమ్మ లోపల ‘నేను సస్తే ఎట్ల’ అనే  టెన్షన్ ఎక్కువైంది.  కాని మాకు చెప్పకపోతుండే. నాయిన పిట్టల నర్సింహ, కరెంటు ఆఫీసులో లైన్ మెన్ గా గవర్నమెంట్ కొల్వు జేసి రిటైర్ అయిండు. రిటైర్ అయిన నెల లోపే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, ఉప్పల్ లోని డివిజన్ ఇంజనీర్ ఆఫీసుకు పోయిండు. ఆ ఆఫీసు ముందే రోడ్డు దాటుతుండగా, బైక్ కొట్టి పోయింది. పది రోజులు గాంధీ దావఖాన్ల చికిత్స పొందుతూ చనిపోయిండు. Closing Charms-7

pittala 7ammalu

చుట్టు పక్కలోళ్లకు మందు తాగి పిచ్చేది

దీంతో అమ్మకు నాయిన పెన్షన్ వస్తుంది. మా ఊర్లో గడ్డం శ్రీశైలం దగ్గర, రొండు లక్షల చిట్టి ఏసేది. మిగిలిన పైసలు చేతుల ఖర్చులకు ఉంచుకునేది. చిట్టి ఎత్తి, అమ్మ దగ్గర ఉన్న పైసలను కలిపి, రొండు లక్షలు చేసి, వాటిని  ఐదు భాగాలు చేసేది. నలుగురు కొడుకులకు నాలుగు బాగాల కింద, ఇరవై ఇరవై వేలు, ఇద్దరు బిడ్డలకు కలిపి ఒక భాగం కింద, చెరి పది వేలు పంచేది. ఇట్ల 2001 లో నాయిన చనిపోయిన కాడి నుంచి, ఐదు భాగాల పంపిణీ సాగుతుంది. ఉన్నదంత ఎప్పటికప్పుడు ఊడ్చి పెడ్తే ఎట్ల సత్తక్క.. ఏదన్న ఆపదకు నీ దగ్గర కూడా పైసలుండాలని, మా అరుగు మీద కుసునే అమ్మలక్కలు అనెటోల్లంట. అట్ల మాకిచ్చెది ఇయ్యంగ, కొంత దాసి పెట్టుకునేది. అందులో  వచ్చెటోల్లకు పొయేటోల్లకు గింతంత ‘మందు’ పోసి ఆమె గింత తాగేది.

చావు ఖర్చులకు బ్యాంక్ లో డిపాజిట్ మా నాయన కరెంటు డిపార్ట్మెంటుల పనిజేసేది కదా, కల్లు తాగకపొయ్యేది. మా నాయన బ్రాండీ మాత్రమే తెచ్చేది. అదే అమ్మ నాయన తాగుతుండే. ‘పేగులు ఖరాబు అయ్యినవి, మల్ల తాగితే సచ్చి పోతవు’  అని డాక్టర్లు చెప్పితేనే  మా నాయిన బ్రాండీ మానిండు. నిజానికి మా నాయిన కరెంట్ మాస్టర్. చనిపోవడానికి ఐదేండ్ల కిందనే తాగుడు మానేసిండు. కాని అమ్మ దగ్గర పైసల్ ఉండేవి కదా. క్వార్టర్ తెప్పించుకొని అప్పుడింత అప్పుడింత తాగేది. ఇంటికొచ్చిన సుట్టాలను ఆమెనే అర్సుకునేది. అట్లనే సాటుంగ సదురాల్చినోల్లకు సదురేది. మిగిలిన పైసలను లక్ష వరకు జమజేసింది.

చావు ఫికరు పెట్టుకుంది

ఇక అప్పటి నుంచి షురువైంది. నెనెప్పుడు సస్తనో ? నా సావెట్ల జెస్తరో? ఇద్దరు కొడుకులు నా కన్నా ముందే పోయిండ్రాయె. ఉన్న ఇద్దరికి ఆడ పిల్లలాయె. అందులో ఒకడు చెట్లు గుట్టల పొంటి తిరుగుతడు. వాడు ఎప్పుడు పోతడో తెల్వదన్న ఫికర్ కూడా అమ్మకుండేది. ఎవరి గురించి అనుకుంటుర్రూ మూసీ టీవీ పిట్టల శ్రీశైలం. అదే నా గురించే మా అమ్మ ఫికర్. మా అన్న కూడా తాగుడు మానేసి, ఇంటి పట్టునే ఉంటుండు. అంతంత మందమే సంపాదన.  దీంతో మా అమ్మకు తన సావు ఎట్ల చేస్తరన్న బెంగ మాత్రం పోతలేదు. అప్పుడప్పుడు ‘కింద మీద’ జేస్తుండే. ఇక నేనే ఆమె మనస్సులో ఏముందో అర్థం చేసుకున్న. ‘లక్ష రూపాయలు ఎవరి కన్న మిత్తి కియ్యే. సావు అప్పుడు తెచ్చుకుంటం గదా’  అంటే ఇయ్యలే.  ‘వాల్లు అదనుకు ఇయ్యరూ బ్యాంకులనే పెట్టాలె’ అన్నది! Closing Charms-7

చావు ఖర్చులకు బ్యాంక్ లో పెట్టిన తల్లి

ఇక ఏం చేస్త ఘట్కేసర్ కు పోయి దోస్త్ సందుపట్ల జీవన్ రెడ్డిని తోడు తీసుకుని, కార్పోరేషన్ బ్యాంక్ లో 2014 లో లక్ష రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్ చేసినం. అప్పుడే ‘సస్తున్న సస్తున్న’ అన్న మా అమ్మ, బ్యాంకుల సావు ఖర్చు ఉందన్న ధీమాతో కావచ్చు. ఆరేండ్లు బతికింది.  2020 ఏప్రిల్ 3 న  మా నుంచి దూరమైంది. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే  డెత్ సర్టిఫికెట్  ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఇస్తే గాని  బ్యాంకు పైసల్ ఇవ్వరన్న సంగతి మర్చిపోయినం. ఆ పైసలతోనే సావు చెయ్యాలన్న మా అమ్మ కోరిక అప్పుడు నెరవేరలేదు. అమ్మ సావు మా అక్కలు చేసిండ్రు. మనుమరాల్లు గోరి కట్టిండ్రు. అయినా కూడా సావు నుంచి పదొద్దుల వరకు లక్షన్నర ఖర్చు అయ్యింది. తప్పదు గా మరి ఆ తతంగమంతా ఆడ ఇడ అప్పుజేసి నడిపినం.

ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ ఇచ్చి కార్పోరేషన్ బ్యాంకు డిపాజిట్ పైసలు ఇంకా SBI బ్యాంకు లో ఉన్న పెన్షన్ డబ్బులను తీయడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఆ పైసలు తీసుకోనికి ఆరు నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు మల్ల ఆరు నెలల మిత్తితో పాటు హాస్పిటల్ ఖర్చులు  దినాల వరకు తెచ్చిన అప్పులు కట్టినం. మిగిలిన లక్ష ఐదు వేలా రూపాయలను కూడా అమ్మ బతికున్నపుడు పంచినట్లుగనే ఐదు పాల్లేసినం. మాకు ఇరవై ఒక్క వెయ్యి చొప్పున  మా అక్కలకు పది వేల చొప్పున ఇద్దరికి పంచి ఇచ్చినం. Closing Charms-7

నేనూ ఉప్పర్ షెర్వాని, అందర్ పరేషాని 

ఇక మా అమ్మ బంగారం పట్ట గొలుసుల కత మల్లొక్కసారి చెప్త. మా అమ్మ తన సావు తనే చేసుకొని పోయింది. ఇంకా ఇట్ల బిడ్డలకు భారం కాకూడదని సావు ఖర్చులు దాసి పెట్టుకున్నోల్లు ఉన్నరా.. ? నేను మీకు కనపడేదంత, వొట్టి బిల్డప్ మాత్రమే.  ‘ఉప్పర్ షెర్వాని, అందర్ పరేషాని ‘ లెక్క గిట్లనే ఉంటది నా కత. లేని ఏతులు నాకెందుకూ. ఇక మీరెమన్న అనుకోండ్రి. లైకులు, షేర్లు చేయమని దేబురించవద్దని కొండవీటి సత్యవతి మేడం అంటుంది కాబట్టి అది మీ ఇష్టం. బతికున్నప్పుడు బుక్కెడు బువ్వ పెట్టక పోతిరి.. సచ్చిన తర్వాత సావు కూడా చెయ్యకపోతిరి అని అనెటోల్లు అనుండ్రి. ఇట్లా మీరేమనుకుంటుండ్రో కామెంట్స్ మాత్రం రాయాలే.

pittala sreesailam journalist

పిట్టల శ్రీశైలం

మూసి టివి, మూసి ఫైబర్ టబ్స్

సెల్ : 995 999 6597

Leave A Reply

Your email address will not be published.

Breaking