Header Top logo

Closing charms-10 పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-10

Closing charms-10
పిట్టల శ్రీశైలం ముచుకుంద ముచ్చట్లు-10

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి అప్పుడే ఇరవై ఏళ్లు అయ్యింది. మొన్న పెద్ద జాతర జరుపుకుంది. నాకైతే ఇంత జల్ది ఇరవై ఏండ్లైందా అనిపిస్తున్నది. ఎందుకంటే 2001 లో టిఆర్ఎస్ పార్టీ పెట్టినంక నేను రాసింది యాది కొచ్చింది. నా దోస్తులు బండారి దేవేందర్ గౌడ్, పలికొండ కిరణ్ కుమార్ లు పట్టు వట్టి నా చేత కరపత్రం రాపించ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వొచ్చి ఏడేండ్లు దాటింది. కొట్లాడినోల్లు ఎక్కువ మంది బైట ఉండ్రు. చంద్రబాబు సంకల ఉండి ప్రత్యేక తెలంగాణా పోరాటకారులను ఉరికించి కొట్టినోల్లు చాలా మంది పాలకులైండ్రు. గంతే తేడా ! గది తేఢా!! ముచ్చటంతా పాతదే కానీ, కొట్లాట మల్ల తప్పేటట్టు ఉందో లేదో మీరే చెప్పుండ్రి. అప్పటి మా పోరలు నా చేత రాయించిన ఆ రాత ఇట్లున్నది. జర చదువుండ్రి.

Closing charms-10ఈ కరపత్రంకు ఇరువై ఏళ్లు

మూడు కోట్ల మంది ప్రజల గుండెల చప్పుడు. జై తెలంగాణ! మన ఊరు బాగుండాలని, గల్లి బాగుండాలని , గల్లి గల్లిలో తెలంగాణ లొల్లి పుట్టింది. ఈ లొల్లి హైదరాబాదు నుండి కరీంనగర్ దాక పాకింది. ఇది వరదాక పట్నంలోని పెద్ద తలకాయలే జుట్టు పీక్కుంటు సభలు, సదస్సులు పెట్టిండ్రు. ఇప్పుడెమో గా చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టడంతో లొల్లి జర పెద్ద గైందంటుండ్రు. గద్దె మీద కూసున్న చంద్రబాబు గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. అది తట్టుకోలేక ఢిల్లీ వాజుపాయి సర్కారుతో లోపాయికారి మంతనాలు జరిపి బిజెపి ఢిల్లీ నాయకులతో సపరేట్ తెలంగాణాకు నో చెప్పించిండు!

పొరగాండ్లం మర్లపడితే కింద పడ్తరు

ఇగో తాటాకు సప్పుల్లకు దడిసెటోల్లు ఈడలేరు. మీరు గిట్లనే మాకడ్డం పడితే ఇప్పటిదాకా సూస్తు ఊరుకున్నం గాని ఇప్పుడు గనక మా పొరగాండ్లం మర్లపడితే గద్దె మీది కేంచి మీరు కింద పడ్తరు. ఇగో మేమిప్పుడు ఢిల్లీలోని, హైదరాబాదులోని సర్కార్లకు వనుకు పుట్టిస్తం. పంచాయతీ, మండల ఎలచ్చన్లలో, తెలంగాణ తెస్తమనెటోల్లకే ఓట్లేస్తం. వాల్లనే గద్దే మీద కూసోపెడ్తం. తెలంగాణ ఒకే తొవ్వ కావాలనెటోల్లంతా, కొందరు తమ పార్టీలను వదలి, టిఆర్ఎస్ లోకి వస్తుండ్రు. ఇంకా రావాలే, ఢిల్లీ, పట్నం సర్కారును కూల్చాలే. తెలంగాణ తేవాలే. ఇదొక్కటే ఇప్పటికైతే ! మాకు ఉద్యోగాలు సద్యోగాలు లేవు. రేపు మా పొరగాండ్లైనా ఈ గడ్డ మీద బతికి బట్ట కట్టాలి. ఇప్పటి లాగ విశాలాంధ్ర గానే ఉండాలనే ఈ సర్కారోడు స్వర్ణాంధ్ర పేర కాష్టాల గడ్డగా మారుసుండ్రు. దీని కోసమన్న తెలంగాణా కావాలే. Closing charms-10

ఎవరు ఎట్ల బతుకుతుండ్రో సూద్దాం రండ్రి

దోస్తోఁ తెలంగాణ వట్టి పోయిందని, నీళ్లు లేవని, ఖనిజ సంపద లేదని పేపర్ల మీద రాస్తుండ్రు. గడ్డ మీద కూసుని కూని రాగాలు పలుకుతున్న వలస పాలకులారా ! మీ సోపతిగాల్ల తరుపున మాట్లాడుతున్నాం. ఎవరు ఎట్ల బతుకుతుండ్రో సూద్దాం రండ్రి. కృష్ణా, గోదావరి నీళ్లని గుట్టు చప్పుడు కాకుండా, తెల్లోని దగ్గర నుంచి అడ్డతోవలో కొండ్రిగాడిలా వచ్చిన మీరు మా నీళ్లను దోస్కపోతిరి. ఇదేమని అడగనీకి ఇప్పటిదాక మా నోర్లు నొక్కితిరి. ఇక్కడికి సర్కారు ఆఫీసులలో, కంపెనీలలో మీరేనైతిరి. ఎక్కడ నీళ్లుంటే అక్కడి నీళ్ల కిందకు మీరే వస్తిరి. ఇగ మేము ఒట్టి బోకపోతే ఏమైతం మరి?
ఇక ఊరుకునేది లేదు. ప్రజాస్వామ్య, ప్రజా, భౌగోళిక తెలంగాణలలో, ఏ తెలంగాణా వచ్చినా మాకు అభ్యంతరం లేదు.

మా ఊరును మేమే ఏలుకుంటాం..

మా నీళ్లని మేమే తెచ్చుకుంటాం. ఇంత జరిగినంక కూడా తేడాలొస్తే ప్రజా కవి కాళోజీ మాటల్లో చెప్పాలంటే..?

‘‘ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాణం తోనే పాతిపెడతాం.  ప్రాంతీయేతరులు దోపిడి చేస్తే ప్రాంతం విడిచేదాక తరుముతాం” వీరులారా.. మీ త్యాగాల బాటలో సాగుతామని శపథం చేస్తున్నాం. తెలంగాణ 374 మంది భూమి పుత్రులకు శనార్థులతో..

మీ ఘట్కేసర్ పోరలు, రంగారెడ్డి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం. Closing charms-10

అదీ అప్పట్లో నేను రాసిన కరపత్రం!
ఇప్పుడు మళ్లేది రాయాల్నో ?
మా పోరలతోని ఉన్నది నాకు ఘోస!

pittala sreesailam journalist

పిట్టల శ్రీశైలం
మూసి టివి, మూసి ఫైబర్ టబ్స్
995 999 6597

Leave A Reply

Your email address will not be published.

Breaking