Closing Charms-04 పిట్టల శ్రీశైలం ‘ముచుకుంద ముచ్చట్లు
Closing Charms-04
పిట్టల శ్రీశైలం ‘ముచుకుంద ముచ్చట్లు-04
పీర్ల పండుగకు మా ఊరు అంకుషాపూర్ కు పోతుంట. మా తమ్ముడి కొడుకు పేరు కన్నయ్య . పీర్లు నిలబెట్టిన నుంచి బాయిల పడేదాక , పీర్ల కొట్టం కాడనే ఉంటడు. దీంతో, మా పిల్లలు ‘తెలంగాణ కోకిల, మూసీ లను, కన్నయ్య ప్రతి యేట పిలుచుకుంటడు. అట్ల నేను మా కృష్ణవేణి కూడా పోతుంటం. ‘హస్సేన్ -ఉస్సేన్ ,అన్నదంమ్ములంటా’ అని , గ్యార యాదయ్య రాగం అందుకుంటుంటే ,అలావు కాడ నుండి జరగబుద్ది కాదు.
ఓసారి పీర్ల పోటోలు తీస్తూ తీస్తూ, పెద్ద పీరు ఎత్తుకు ఉన్న మనిషి దగ్గరకు పోయిన. ‘పిల్లలు కానోలకు, పానం బాగలేనోల్లకు’ ఏం చెప్పుతుండో విందామని ,దగ్గరిదాకా పోయిన. అంతే ! పెద్ద పీరు ఎత్తుకున్న బత్తుల రాజమహేందర్ గౌడ్ , గుండ్రంగా తిరుగుకుంటా ,కింద పడిపోతుంటే , పక్కనున్నోల్లు ‘సవారును’ పట్టుకొని, మూడు బిందెల నీళ్లు ‘సాక’ పోయించిండ్రు. అప్పుడు రాజు పైకి లేసి , సమస్యలతో వచ్చినోల్లకి ఓదార్పు మాటలు చెప్తుండు.
అప్పుడు నేను చెప్పు లేసుకొని ఉన్న. ‘అలావ’ దగ్గర పోటోలు తీస్తున్న.పెద్దపీరును ఎత్తుకున్న రాజు కింద పడ్డడు.. ఆయన కింద పడటానికీ,నా చెప్పులకు లింక్ ఉన్నదన్న సంగతి నాకు తెల్వదు. ఎవరో అన్నరు. నేను జల్ది బయటకు పోయి,చెప్పులిప్పేసి ,మల్ల పీర్ల దగ్గరికి పోయిన. పక్కనున్నోల్లు ‘తెల్వక చెప్పులు ఏసుకొచ్చిన, తప్పైందని ‘ చెప్పమన్నారు.చెంపలు వాయించుకొమ్మన్నరు!
కాని మనకి ఉర్దూ నహి హతా హై. కాబట్టి వాల్లు ఏదో చెప్పే లోపే , మొన్నటి దాక చిన్న పీరు ఎత్తుకునే ,నా క్లాస్ మెట్ పాండాల జంగయ్య ‘ఊదు’ పెట్టించుకోమన్నాడు. అంతే రాజు నన్ను పట్టుకుని , వాళ్లకు ఉర్దూలో ఏమెా చెప్పిండు. అంతే అందరు దూరంగా జరిగి , ఎవ్వర్ని దగ్గరకు రాకుండా చైన్ ఏపించిండు. అప్పటికే నా చెయ్యిని పట్టుకొని , ‘దట్టిని’ నా మీద కప్పి చెప్పమండు. నాకేమెా ఉర్దూ రాదాయెా. హిందీ రాకపోయే సరికి పక్కనోల్లు నమ్ముతలేరు.
‘నీకు రాక పోవుడేందని?’ అని ! ఇక సర్వర్,పాండాల జంగయ్య, కిచ్చిగారి కృష్ణ , ఇంకా కొంత మంది ట్రాన్స్ లేటర్లుగా పనిజేసుడు మెుదలు పెట్టిండ్రు, ‘ఏందుకు ఊరిని, మమ్ముల్ని ఇడిసి పెట్టి పోతున్నవ్? మేము లేమా నీకు? ఊర్ల ఎందుకు ఉంటలేవు, ఏడొద్దుల నాడు కూడా నీవు వచ్చినట్లే వచ్చి ఎల్లిపోయినవ్ ‘ అని అడిగిండు.
నేనేమో మంగలోల్ల ఇల్లు కిరాయికి తీసుకొని ,ఊర్లకు వచ్చినప్పుడు ఉంటున్న అని చెప్తున్న. ‘కాదు ఈడనే ఉండాలే. మల్లొచ్చే ఏడాది ఏడవ రోజు ‘ప్యాతాలు’ ఇవ్వనీకి రావాలే ‘ అని చెప్తూ, ‘మనుసులో నీకేం కావాలో కోరుకో’ అన్నడు.మల్ల ఆయన వంగి పీరుని నా మీదకు వంచి , ఊదు పెట్టి , నోట్లో ఇంత ఏసి చాతిలింత పూసి.. నెమలీకల దండెంతో ఈపుల గుఫ్కు గుఫ్కున రెండు దెబ్బలు సరిసిండు. అంతే – మనం పక్కకు వచ్చిన వెంటనే , ‘ఇంత టైం ఎవ్వల కియ్యడు – మాకా చాన్స్ రాకపాయే – నీకేదో మంచి జరిగేదున్నట్లుంది. గందుకే పెద్ద సవ్వారి నీతో మాట్లాడింది’ అని , అక్కడున్నోల్లు అంటునే , నాకంటె ఎక్కువ మస్తు కుషి అయ్యిండ్రు. అంతే – ఇంటికి పోయిన వెంటనే , ‘చెప్పు లేసుకొని సవ్వారు కాడికి పోతే , పెద్ద సవ్వార్ కొట్టిండంటగా?’ అని కృష్ణవేణి దండకం అందుకుంది. ‘నన్ను నమ్మే దేవుడే లేడని’ ఫోజులు కొట్టే నేనేదో పీర్లకాడికి పోయి ఊదు పెట్టించుకున్న అని బిల్డప్ ఇస్దామనుకుంటే, మా అన్న కొడుకు శ్రీకాంత్ అక్కడేం జరిగిందో మెుత్తం సూడకుండనే తుస్సు మనిపించిండు. నిజంగా నేను ఊదు పెట్టుకున్నానంటే , కృష్ణవేణి నమ్మదంటే నమ్మదు కూడా. మనస్సులో మాత్రం ఏదో ఒక దానికి మెుక్కితే బాగుండనుకుంటది. ఇకపోతే, తెల్ల, లాల్చి, వంటి నిండా పూలు వేసుకున్న 35 ఏండ్ల గౌండ్లోల్ల అమ్మాయి బత్తుల జయశ్రీ గురించి చెప్పాలే. ఇంకా ఆ అమ్మాయి పెండ్లి చేసుకోలేదు. పీర్లు బాయిల పడనీకి పోతున్నయని , సూడనీకి వచ్చిన జనాన్ని నేను ఇంతకు ముందెప్పుడు సూడలే. రెండేళ్ల కింద జరిగిన ఆ ఘటన నుంచి నేనే ఇంకా తేరుకోలేదు. అయితే ఆ ఘటనకి నేను వ్యతిరేకం. కాబట్టి నా అభిప్రాయాలు వేరే గుంటవి. కాని నేను రాస్తే , వాటిని సమర్థించినట్లు అనుకుంటరని , ముందు ఓ మాట మీకు చెప్తున్న. మా ఊరు పీరుని పక్కనున్న ఏదులాబాద్ ఊరోళ్లు యాబ్బై ఏండ్ల కింద దొంగతనంగా ఎత్కపోయిండ్రని. ఆ పీరుని మల్ల మన ఊరుకు తేవాలని , జయశ్రీ అనే అమ్మాయి శిగం వచ్చినపుడు పట్టు పడుతుంది. ఆ పీరు సిగం వచ్చినపుడల్లా ఊగి చెప్తుండేది. అంతకు ముందు సర్పంచి ‘బద్దం అర్చన నర్సింహ రెడ్డి’ బిజెపి కి చెందిన వారు. ఆర్ ఎస్ ఎస్ ప్రభావం వారి మీద బలంగా ఉంది. కాబట్టి ఏదులాబాద్ నుంచి పీరును బలప్రయోగం చేసి తేలేక పోయారు. అయినా ఆ అమ్మాయి ప్రతిసారీ ‘శిగం ఊగుడు పీరును తెమ్మనమనుడు’ జరుగుతునే ఉంది. ఇక ఇప్పుడు కొమ్మిడి జలజ సర్పంచి అయ్యింది. సర్పంచి భర్త కొమ్మిడి సత్యనారాయణరెడ్డి మా ఊరి పెద్ద దొర. ఊరుకు మంచి జరగాలంటే , పీరును తేవాల్సిందేనని గ్రామ పెద్దలు తీర్మానించారు. కాని పీరును తెచ్చేంత సాహసం చేయలేదు. మద్యే మార్గంగా , పొలిమెర నుంచి పీర్ల కొట్టం దాక , 21 యాటలు కొయ్యాలని , శిగం వచ్చినపుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ప్రకారం యాటలను కొసుకుంట వచ్చిండ్రు. అది జరిగి రెండేళ్లు అయ్యింది. ట్విస్ట్ ఏందంటే ఆ పీరును ఇంకా మా ఊర్లో ఏదులాబాద్ పీరును నిలబెట్టలేదు. కాబట్టే ఊరుకు మంచి జరుగుత లేదన్న ప్రచారం మల్ల ఊపందుకుంది.
ఈ ప్రచారానికి, నాకూ ఏమీ సంబంధం లేదుల్ల!
ఇక తుర్కోల్ల తరపున జమాల్ కుటుంబం, పీర్ల పండుగ చేస్తుంది. కాని వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో సవ్వార్ ఎత్తుకునే కులాల వాళ్లే ముందు పడి చేస్తున్నారు. కాని ఈసారి దినాలను పీర్ల కొట్టం కాడ చెయ్యక , ‘లోతుకుంట’ దగ్గరి దర్గాలో చేసిండ్రు. దీంతో కొందరు తుర్కోల్లు నారాజ్ అయ్యిండ్రు. ఆ దర్గా యాజమాని చనిపోక ముందు, చాలా ఏండ్లు ,పీర్ల పండుగ వారే దగ్గరుండి చేసేది. కాని ఎందుకో ఏమెా ,ఇప్పుడు వారు పీర్ల కొట్టం దిక్కు కూడా సూస్తలేరు. అసువంటపుడు దర్గా కాడికి పోవడాన్ని , కొంతమంది తుర్కోల్లు గులుగుకున్నరంట. కాని వారికి పీర్ల పండుగ చేసేంత స్థోమత లేక మిన్నకుండి పోయిండ్రంట.
మా ఊర్లో పీర్ల పండగ అంటేనే ‘సూదరోల్ల’ దనేంత అయ్యింది. తుర్కోల్ల ఇండ్లు పది ఇరవై ఉన్నా కూడా ,తుర్క దేవుడు పూనేది మెుత్తం కింది కులాలోలకు. కాబట్టి , వచ్చిన జనంలో వారి బంధు మిత్రులు ఎక్కువగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ,ఈసారి ఎప్పుడు లేనంత, దాదాపు 25 ఏండ్ల లోపు పిల్లలు కూడా కనిపించారు. ఆర్టికల్ 370 రద్దు అయినప్పుడు ,కాశ్మీర్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా, అట్లనే అఫ్గనిస్తాన్ ని హస్తగతం చేసుకున్మ తాలిబన్ల సూసి సంబరపడి వాట్సప్ లో , షేర్ల మీద షేర్లు జేసిన కొందరు యువకులు కూడా మెున్న పీర్ల పండుగ నాడు కనిపించిండ్రు.చిత్రం! ఎప్పుడు అడిగినట్లే ,మొన్న పీర్ల పండుగకు పోయినపుడు మీరెందుకు పీర్ల కొట్టం కాడికి వచ్చిండ్రని , కట్టర్ బిజెపి లీడర్ పిట్టల రాజు ముదిరాజ్ ని అడిగిన. ఇరవై ఏండ్ల సంది అంకుషాపూర్ లో ఎక్కువ సార్లు బిజెపి పార్టీ బలపర్చిన సర్పంచి, ఎంపిటిసి లను గెలుచుకుంటుంది. కాని పీర్ల కొట్టం కాడికి వచ్చుడు ఆపలేకపోయింది. అంతెందుకు , నేనే వస్తున్ననని చెప్పిండు. అంటే మెుత్తానికి ‘ తుర్కోల్లకు కింది కులాలకు అవినాభావ సంబంధం ఉందని పిస్తుంది. అందరూ అనే హిందూ ముస్లింల ఐక్యతకు , దర్పణం మెుహర్రం కాదనిపిస్తుంది. పీర్ల పండుగ ముస్లింలకు సంతాప దినమైతే , కింది కులాలు పది రోజులు నిష్టగా ఉంటూ , పదొద్దులకు చాలా ఇండ్లకు సున్నాలేసుకొని పీర్లకు ప్యాతాలిచ్చి ,పండుగలా చేసుకుంటుండ్రు.
అంతెందుకు ? మా మేన మామలు కూడా పీర్ల పండుగపుడు గొల్లేషం వేసేది. మా మామ ‘గేటు నర్సింహ’ తనతో పాటు చిన్నపుడు , నా పెద్ద బిడ్డ తెలంగాణ కోకిల కు కూడా , గోషి గొంగడి కట్టించి తిప్పిండు. కాని కొమట్లు, బాపనోల్లు అటు దిక్కు కూడా సూడరు. సదివినోల్లు సూసినోల్లు,కింద లైక్ కొట్టాలె! నా ఈపు మీద కాదు! ఏమైనా అనెటోల్లు కామెంట్ చెయ్యిండ్రి. ఇంకొంత మంది నాలాగే ఫీలైతే , షేర్ చేసుడు మానొద్దు.
ఉంటా మరి.
పిట్టల శ్రీశైలం, జర్నలిస్ట్
మూసీ టివి- మూసీ ఫైబర్ టబ్స్ సెల్: 99599 96597