comedian Brahmanandam సినీ ఆర్టిస్ట్ బ్రహ్మనందంలో మరో కోణం
పరిచయం
Another angle on comedian Brahmanandam
హాస్య నటుడు బ్రహ్మనందంలో మరో కోణం
నవ్వుకు కూడా నవ్వు తెప్పించగల హాస్య బ్రహ్మ..!!
అరగుండు కాస్తా..(హాస్య) గండరగండడయ్యాడు…!!
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు!!
తెలుగు సినిమా హాస్యాన్ని ప్రపంచానికి రుచి చూపించాడు….
నవ్వించడమే కాదు…బ్రహ్మానందానికి యేడ్పించ డమూ తెలుసు…!!
‘రేలంగి తన దుస్తులు మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ వెండి తెరమీదికొచ్చాడు..!!
*ఆయన ‘నటుడే’ కాదు… చిత్రకారుడు కూడా !!
*వెరసి…..’ బ్రహ్మీ ‘ ది ఆర్టిస్ట్..!!
బెస్ట్ ఆర్టిస్ట్ కూడా..
నవ్వుకు కూడా నవ్వు తెప్పించగల హాస్య బ్రహ్మ ఆసలు పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ముద్దు పేరు బ్రహ్మీ. అదేదో సినిమాలో ‘బ్రహ్మీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.‘ అన్నారు గానీ, నిజానికి ” బ్రహ్మీ ..ది ఆర్టిస్ట్”.(చిత్రకారుడు) అని ఆచరణలో రుజువు చేసుకున్నారు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు,ఉత్తమ హాస్యనటుడిగా రాష్ట్రప్రభుత్వ నంది పురస్కారాలు, ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ (Filmfare) అవార్డులు గెలుచుకున్నారు..!
దూరదర్శన్ లో ‘పకపకలు’
అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తూనే,మిమిక్రీ కళను ఔపోసన పట్టారు. నిజజీవితంలోని వ్యక్తులను అనుకరిస్తూ నవ్వించే వారు. 1985లో దూరదర్శన్ లో వచ్చిన ‘పకపకలు’ కార్యక్రమనిర్వహణ కర్తగా పరిచయమయ్యారు. దీనికి మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప, ఇతర ఛానెళ్ళేవీ లేని ఆ రోజుల్లోనే ఆయన ఎక్కడికి వెళ్ళినా…”అరే.. బ్రహ్మానందం”రా అంటూ ఇట్టే గుర్తు పట్టేసేవారు.
మొదటి సినీమా ‘శ్రీ తాతావతారం’
బ్రహ్మానందాన్ని మొట్టమొదటి సినిమా…వేజెళ్ళ సత్యనారాయణ “శ్రీ తాతావతారం”. అయితే విడుదలైన తొలిచిత్రం మాత్రం జంధ్యాల ” అహ నాపెళ్ళంట”…!! మొట్టమొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్టయ్యింది. “పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా పోతావ్‌రా రేయ్… నాశనమై పోతావ్…” అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోతానే గొణుక్కుంటూ, ఆక్రోశాన్ని దిగమింగుకొనే ‘అహ! నా పెళ్ళంట’ లోని’అరగుండు’పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది.ఈ చిత్రంలో కోట, బ్రహ్మానందం కాంబినేషన్ నభూతో న భవిష్యత్..అన్నట్లుగా వుండటం కూడా బ్రహ్మానందంకు కలిసొచ్చింది. ఇక అక్కడ్నుంచి వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు బ్రహ్మానందానికి. ఆ తర్వాత “పసివాడి ప్రాణం”లో ఓ చిన్న పాత్ర వేసిన బ్రహ్మానందం. వరుసపెట్టి యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
అవార్డులు… రివార్డులు…!!
బ్రహ్మానందం అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నాడు. హస్యనటులైన రేలంగి, రాజబాబు,సుత్తి వీరభద్రరావు చలం, అల్లు రామలింగయ్య పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందంను వరించి వచ్చాయి. ఐదు సార్లు కళాసాగర్ పురస్కారాలు,తొమ్మిది సార్లు వంశీ బర్కిలీ పురస్కారాలు,పది మార్లు సినీగోయర్స్ రస్కారాలు,ఎనిమిది సార్లు భరత ముని పురస్కారాలు ఫిలింఫేర్,రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం,ఆటా (అమెరికా), సింగపూర్, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలను అందుకున్నాడు. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి ఘనంగా సత్కరించారు. పద్మవూహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది. సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌వారు స్వర్ణ హస్తకంకణాన్ని తొడిగారు. ఇక బ్రహ్మానందంకు జరిగిన చిన్నా, చితకా సన్మాలు అన్నీ ఇన్నీ కావు.
లాక్ డౌన్ లో చిత్రకళ (Art)
కరోనా లాక్డౌన్ లో ఖాళీగా వుండలేక తనలోని ఆర్టిస్ట్ ను నిద్రలేపాడు. అతనేమో కుంచె పట్టుకొని అందమైన బొమ్మలు వేసేశాడు. అప్పుడు గానీ మనకు తెలీలేదు. బ్రహ్మానందం నటుడు మాత్రమే కాదు. గొప్ప చిత్రకారుడు కూడా అని. ఆయన నటన గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన ‘చిత్రలేఖనం’గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిజానికి బ్రహ్మీకి ఎంతో ఇష్టమైన వాటిలో చిత్రకళ కూడా ఒకటి.!!
బ్రహ్మానందం తెలుగు లెక్చరర్
లాక్‌డౌన్‌లో ఆయన కాగితం, పెన్సిలు పట్టుకుని గీసిన చిత్రాలు సోషల్ మీడియా లో ఎంతగా వైరల్ అయ్యాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. పూర్వాశ్రమంలో బ్రహ్మానందం తెలుగు లెక్చరర్. శ్రీనాధుడు, పోతన వంటి మహాకవుల కావ్యాల పాఠాలను విద్యార్ధులకు చెప్పేవాడు. అడపాదడపా మిమిక్రీ కూడా చేసేవాడు. అదే ఆయనను సినీ ఇండస్ట్రీ వరకు నడిపించింది. బ్రహ్మానందం మంచి చిత్రం కారుడు కూడా. సినిమాల్లోకి వచ్చాక బిజీ కావడంవల్ల ఆయనలోని చిత్రకారుడు మరుగున పడిపోయాడు.
అబ్బురపరిచే చిత్రాలు
కరోనా లాక్డౌన్ లో కాస్తంత తీరిక దొరకడం,ఇంటిపట్టునే వుండాల్సిరావడంతో మళ్ళీ తన పూర్వపు అభిరుచులను బయటకు తీశారు. చిత్రకళకు మళ్ళీ పదును పెడుతూ అబ్బురపరిచే అనేక చిత్రాలు గీశారు.!! ఇటీవల అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో ‘ఆంజనేయుని ఆనంద బాష్పాలు’ పేరుతో వేసిన చిత్రానికి జనం *ఫిదా’అయ్యారు. అలాగే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కాగితంపై సాక్షాత్కరింపజేశారు. ఈ చిత్రం గీయడానికి ఆయనకు 45 రోజుల సమయం పట్టిందట. ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం గారు నటుడు అల్లు అర్జున్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇంకేముంది బన్నీ ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
అల్లు అర్జున్ సంతోషం
‘‘మేమెంత గానో అభిమానించే బ్రహ్మానందంగారు కొత్త ఏడాదిలో గొప్ప బహుమతినిచ్చారోచ్..”! ’అంటూ అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేయడమే కాదు. తనకిది వెలకట్టలేని బహుమతి అని ట్వీట్ కూడా చేశాడు. అంతేకాదు బ్రహ్మీ ఎందరో కవులు,కళాకారులు,దేశ నాయకుల చిత్రాలను సజీవంగా ఆవిష్కరించారు. తన ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను చిత్రీకరించారు. ముఖ్యంగా రాముడు,ఆంనేయుడ్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న చిత్రం ఎంతో గొప్పగా వుంది. ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానాకు ఫ్రేముకట్టించి మరీ బహూకరించారు. దాంతో రానా ఆనందపడుతూ.. ‘‘నాకు బ్రహ్మానందం గారి నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందింది. తాతగారు బతికుంటే ఎంతో ఆనందించేవారు’’ అని ట్వీట్ చేశాడు.
ఇంతకూ ఈ చిత్రాలన్నీ చిత్రించింది ఓ చిన్న పెన్సిల్ తో మాత్రమే అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి మరి ఎందుకంటే..?అది నిజం కాబట్టి.
దటీజ్…బ్రహ్మీ ది ఆర్టిస్ట్…!!
బ్రహ్మానందం గారికి అభినందనలు
ఎ.రజాహుస్సేన్, రచయిత
హైదరాబాద్