Chittithalli Batuku Poru (Poetry) చిట్టితల్లి బతుకు పోరు (కవిత్వం)
Chittithalli Batuku Poru (Poetry)
చిట్టితల్లి బతుకు పోరు (కవిత్వం)
చిట్టిపొట్టి పాపలు
చిన్నారి పాపలూ
చిగురాకు చిన్నెలు
మారాకు వన్నెలు
బోసి నవ్వు బోణీలు
అందమైన ఓణీలు
పాలుగారే పసితనం
పాలబుగ్గ సోయగం
ఎడారి పాలవుతున్నది
ఎండి మోడవుతున్నది
చిగురించడమే మరిచింది
ఈ చిట్టి చేతుల బాల్యం!!
ఆకలంటూ అరచి అరచి
పొట్టపై చేయి తడిమి తడిమి
అమ్మలేని తనం గుర్తొచ్చి
కళ్ళలోనే నీళ్ళు కుక్కి కుక్కి
రోడ్డు పక్కనే చిత్తు కాగితంలా
గాలివాటుకుఎగిరి ఎగిరి
ఏ పంచన పడుతుందో తెలీక
ఏ పనోదొరకక పోదా అన్న ఆశ
నెత్తిన తట్ట కాకుంటే బండ
కసుగందే చేతుల్లో సుత్తి
రాళ్ళను రత్నాలుగా మార్చే
ప్రయాసలో కరడు గట్టినబాల్యం
ఎండకు ఎండి వానకు తడిసి
ఒంటిమీద బట్ట చిరిగి చిరిగి
స్నానమాడి ఎన్నాళ్లయిందో
చింపిరి జుత్తుకు దువ్వెనే తెలీదు
చీకటిలో చెట్టుకింద
కాకుంటే రోడ్డు పక్క
అలసిసొలసి నిదరోతే
మగత నిద్రలో పాపిష్టి కల
పని సరిగా చేయడం లేదని
సేటుగారు కళ్ళెర్ర జేస్తే
బాల్చనంటూ కాళ్లట్టుకుంటే
కర్రుకాల్చి వాతపెట్టినట్లు కల
ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూస్తే
పక్కన అమ్మ లేదు బొమ్మాలేదు
రొప్పుతూ రొష్టుతూ గజ్జికుక్క
తోడుకోసం కావలించుకుంది
అమ్మ గోరుముద్దలెడుతుందని
లాలిపోసి జోల పాడుతుందని
గుండెలద్దుకొని సేద తీరుస్తుందని
ఈ చిట్టి తల్లికి తెలీనే తెలీదు
అమ్మా నాన్నల మదపు చేష్టలకి
కడుపున పడ్డ ఏడు నెలలకే
భూమ్మీద పడిన ఈ శాకుంతలం
చెత్తకుండీయే ఆవాసమైన వైనం
దయగల తల్లుల చేతి ముద్ద
మనసున్న మారాజుల ఆదరం
ఇష్టమే తెలీని కష్టం నష్టం
బతుకు చితిలో కాలుతున్న మొగ్గ
ఎవరింటి దీపమో ఈ చిట్టి తల్లి
ఇలా మినుకు మినుకు మంటూ
మోయ లేని భారాన్ని మోస్తూ
ఎంత కాలమో ఈ బతుకు పోరు?
(నవంబర్ 14న బాలల దినోత్సవం…అంటే బాలలపండగ!
అయితే ఇలాంటి పిల్లలకు మాత్రం మినహాయింపు.
ఎంతకాలమీ వివక్ష?చేయని పాపానికి వీళ్లకెందుకీ శిక్ష?)