Childrens stories-02 Parrot Tiny – A story without US characters చిలుకముక్కు చిన్నోడు – సంయుక్త అక్షరాలు లేని కథ
Childrens stories-02
Parrot Tiny – A story without US characters
చిలుకముక్కు చిన్నోడు – సంయుక్త అక్షరాలు లేని కథ
ఒక అడవిలో ఒక పిల్లోడు వుండేవాడు. వాడు చానా మంచోడు. బాగా చదువుతాడు. మంచి ఎత్తు. చక్కని రంగు. రింగులు తిరిగిన జుట్టు వుండేది. కానీ పాపం వాని ముక్కు కొంచెం పెద్దగా వుండి, ముందు భాగం వంపు తిరిగి అచ్చం చిలకముక్కులా వుండేది. దాంతో అందరూ వాన్ని ”రేయ్… చిలకముక్కోడా” అని బాగా ఎగతాళి చేసేవాళ్ళు. వానికి అద్దంలో తన ముక్కు చూసుకున్నప్పుడల్లా చానా బాధ కలిగేది. ఒక్కడే కూచోని కళ్ళనీళ్ళు పెట్టుకునేవాడు. ఎప్పుడూ అదే ఆలోచన. ఒకటే బాధ. దాంతో నెమ్మదిగా చదువు అటకెక్కింది. బడిలో బాగా వెనుకబడిపోయాడు.
ఆ పిల్లోని ఇంటి వెనుక పెరడులో ఒక మామిడిచెట్టు వుంది. దాని మీద ఒక అందమైన రామచిలుక గూడు కట్టుకుంది. ఒకరోజు ఆ పిల్లోడు పెరటిలో మంచమేసుకొని పడుకున్నాడు. ఎదురుగా కనబడిన చిలుకను చూసి ”ఏయ్… చిలుకా.. నీ ముక్కు నా ముక్కు ఒకేలా వున్నాయి. కానీ నీ ముక్కు చూసి అందరూ అబ్బ… ఎంత ముచ్చటగా వుంది అని పొగుడుతారు. నా ముక్కు చూసి ‘ఛీ…ఛీ… ముక్కెలా వుందో చూడు అచ్చం చిలకముక్కులా అంటూ తిడతారు. ఈ ముక్కు వంకర పోయి చక్కగా ఎప్పుడు మారతాదో ఏమో” అన్నాడు.
ఆ మాటలకు చిలుక చిరునవ్వు నవ్వి ”ఈ లోకంలో అందరికీ అన్నీ వుండవు. ముక్కు బాగుంటే మూతి బాగుండదు. కన్ను బాగుంటే కాలు బాగుండదు. కొందరు ఎత్తుగుంటే ఇంకొందరు పొట్టిగుంటారు. కొందరు లావుగుంటారు. మరికొందరు బక్కగా వుంటారు. కొందరికి అవయవాలన్నీ బాగున్నా అందమైన మనసు వుండదు. సరే ఇవన్నీ ఎందుకుగానీ నా మీద ఎక్కి కూచో. నీకు కొన్ని చూపించాలి” అంది.
వాడు పకపక నవ్వి ”నువ్వుండేదేమో జామకాయంత. నేనుండేదేమో పనసకాయంత. ఎలా కూచుంటా నీమీద” అన్నాడు.
”అదా నీ అనుమానం. పరవాలేదు. నేను అలాంటిలాంటి అల్లాటప్పా చిలుకను గాదు. దేవలోకంలో దేవతల దగ్గర పెరిగినదాన్ని. కొంతకాలం ఈ అందమైన భూమి ఎలా వుంటుందో చూద్దామని వచ్చా. నేను కావాలంటే ఏనుగంత పెద్దగా మారగలను. చీమంత చిన్నగా కాగలను. ఒక్క నిమిషం ఆగు” అంటూ నెమ్మదిగా పెరగడం మొదలు పెట్టింది. ముందు పావురమంత అయ్యింది. తరువాత కోడిపుంజంత అయ్యింది. మరునిమిషం నెమలంత అయ్యింది. ఇంకో నిమిషంలో నిప్పుకోడంత అయ్యింది. ఆ మరునిమిషమే గండభేరుండమంత అయ్యింది. అది చూసి వాడు సంబరంగా దాని మీదకు ఎక్కాడు.
రామచిలుక రివ్వున గాల్లోకి ఎగిరింది. అలా ఎగురుతా… ఎగురుతా… ఒక పెద్ద ఆఫీసు మీద వాలింది. ”ఆ కిటికీలోంచి కిందికి తొంగిచూడు” అంది. వాడు తొంగి చూశాడు. అక్కడ ఒక బెంచీ మీద చూడముచ్చటైన ఒక యువకుడు కూచొని వున్నాడు. ఆరడుగుల ఎత్తు, తెల్లని ఛాయ, ముద్దొచ్చే మొగం, రింగుల రింగుల జుట్టు…. చూడడానికి సినిమా హీరోలెక్క వున్నాడు. పెళ్ళయిన ఆడవాళ్ళు చూసినారంటే చాలు… అబ్బ… కంటే ఇలాంటి కొడుకునే కనాలి అనుకుంటారు. అదే పెళ్ళికాని అమ్మాయిలు చూసినారంటే చాలు… అబ్బ! చేసుకుంటే ఇలాంటి చూడచక్కనోన్నే మొగునిగా చేసుకోవాలి అనుకుంటారు. అంత చక్కనోడు వాడు.
”ఎలా వున్నాడా యువకుడు” అంది చిలుక.
”అబ్బ… ఆకాశంలో మెరిసే చుక్కలా వున్నాడు. అడవిలో పురి విప్పి తిరిగే నెమలిలా వున్నాడు. గాలిలో ఎగిరే సీతాకోకచిలుకలా వున్నాడు. నేను గూడా అలా వుంటే ఎంత బాగుండో” అన్నాడు.
అంతలో ఆఫీసు లోపలి నుంచి ఒకతను బైటకు వచ్చాడు. పొట్టిగా, నల్లగా, బట్ట నెత్తితో, అందవికారంగా వున్నాడు. అతను బైటకి రాగానే ఈ ఆరడుగుల అందగాడు ఒక్కసారిగా పైకిలేచి ”సార్… సార్…” అంటూ భయంభయంగా వంగి వంగి సలాములు చేసుకుంటూ, వణుకుతున్న చేతులతో అతని చేతిలోని సంచీని అందుకొని అతని వెనుకనే పరుగులాంటి నడకతో వినయంగా బైలుదేరాడు. అతను హుందాగా అడుగులో అడుగు వేసుకుంటూ పోతుంటే ఎక్కడివాళ్ళక్కడ లేచి నిలబడి వినయంగా తల వంచి నిలబడుతున్నారు. అతను కారు దగ్గరికి పోగానే ఒకడు వురుక్కుంటా పోయి కారు తలుపు తెరిచి నిలబడ్డాడు. అతను అందులో ఠీవిగా కూచోని వెళ్ళిపోయాడు.
చిలుక ఆ పిల్లోని వంక తిరిగి ”చూశావా… అతడంత అందవికారంగా వున్నా… అందరూ ఎలా గౌరవం ఇచ్చారో. దీనికంతా కారణం చదువే. నిజమైన గౌరవం అందం నుంచి రాదు. తెలివితేటలు, అధికారం, నిజాయితీ నుంచే అందుతుంది. ఈ వెక్కిరించడాలు, వేళాకోలాలు అన్నీ చిన్నతనంలోనే. నువ్వు బాగా చదివి పెద్ద అధికారిగా మారావనుకో… గౌరవం దానంతటదే పరుగెత్తుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర చేరుతుంది. ఈ నడుమ నువ్వు అనవసర ఆలోచనలతో చదువులో బాగా వెనుకబడుతున్నావట గదా. పనీపాటాలేని వాళ్ళ మాటలను పట్టించుకోకుండా మనసంతా చదువు మీదే వుంచు. ఏం సరేనా” అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది.
”అలాగే … ఆగు. నువ్వు చెప్పినట్టే వింటాను. నన్ను ఇంటి దగ్గర దించు. ఇలా వదిలి వెలితే ఎలా” అంటూ ఆ పిల్లోడు గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అప్పుడే అక్కడకు వచ్చిన వాళ్ళ అమ్మ ”ఏరా… హాయిగా చెట్టు కింద పడుకోని పగటిపూటనే భలే కలలు కంటున్నావే. లెయ్‌లెయ్. ఇంక పడుకుంది చాలు” అంటూ కుదుపుతూ లేపింది.
”ఇంతసేపూ వచ్చింది కలనా. కానీ అది కల కాదు. నిజం. చిలక చెప్పిన నిజం. ఇకపై చదువులో అస్సలు వెనుకబడగూడదు” అనుకుంటూ మంచం మీద నుంచి కిందికి దిగాడు.
డా.ఎం.హరికిషన్, రచయిత, కర్నూలు సెల్: 9441032212