Header Top logo

Childrens is stories Form chickens పిల్లల కోసం కథలు ఫారంకోళ్లు – వ్యంగ్య కథ

Childrens is stories Form chickens పిల్లల కోసం కథలు ఫారంకోళ్లు – వ్యంగ్య కథ

 

”ఏరా… ఇంగా స్నానం గూడా చేయకుండా అడ్డగాడిదలెక్క కూచున్నావ్‌. బడికిపోయేదుందా లేదా… మీ చెల్లెలు చూడు అప్పుడే సంచి సంకకెక్కిచ్చుకోనింది” రాంచంద్‌ చదువుతున్న పేపర్‌ పక్కన పెట్టేసి గట్టిగా అరిచాడు కొడుకుని చూస్తూ.

వాడు ఏమీ పలకలేదు. మన్నుతిన్న పాములెక్క అట్లాగే కూచున్నాడు..

ఏంరా… ఏమైంది… అట్లావున్నావ్‌ .. ప్రశ్నించాడు.

‘నేను పోను నాన్నా ఈరోజు’ తలొంచుకొని చిన్నగా గొణిగాడు.

”ఏమండీ… ఈ మధ్య వాడు ఇంతకు ముందులా స్కూలుకు ఇష్టంగా కాక ఏదో భారంగా, దిగులుగా, బలవంతంగా ఎవరో తరుముతున్నట్లు పోతున్నాడు” రాంచంద్‌ భార్య వంటింట్లోంచి నెమ్మదిగా చెప్పింది.

”అట్లాగా” అంటూ రాంచంద్‌ వాన్ని అనునయంగా దగ్గరికి తీసుకోని ”వూరికే పోనంటే ఎట్లా… కారణం చెప్పు. ఆరోగ్యం బాలేదా” మెడకింద చేయిపెట్టి చూస్తూ ప్రశ్నించాడు.

”అదీ… అదికాదు నాన్నా. ఈ మధ్య మా సైన్సుమిస్‌ అయిన్దానికీ కాన్దానికీ వూకూకెనే అందరి ముందు ఇన్సల్ట్‌ చేస్తావుంది. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద పనిష్మంట్లిస్తోంది. నిన్న సైకిల్‌ పంచర్‌ అయి ఐదు నిమిషాలు ఆలస్యంగా పోయేసరికి తిట్లు, తన్నులు… ఆపై ఒన్నవర్‌ బైట్నే నిలబెట్టేసింది. స్కూలుకి పోవాలంఏనే భయంగా వుంది” ఏడుపు ముఖంతో విచారంగా చెప్పాడు.

”ఎప్పట్నించి జరుగుతుందిలా”

”అదే… నువ్వు నోట్‌బుక్స్‌ బైట తీసుకురావద్దు నాన్నా… స్కూళ్ళోనే కొనుక్కుంటా అని మొత్తుకుంటున్నా వినకుండా బైట్నే తెచ్చినావు చూడు… అప్పట్నించీ”

”అరే! వాడు పది రూపాయల పుస్తకం ఇరవై రూపాయలకమ్ముతుంటే… ఎట్లా కొనాల. డబ్బులేం చెట్లక్కాయడం లేదు గదా వూకివ్వడానికి. ఐనా ఎక్కడైతే ఏం. వాళ్ళు చెప్పిన నోట్సులన్నీ తెచ్చిచ్చినా గదా… ఇంగేమంట”

”నీకేం నాన్నా… మస్తుగ చెబుతావ్‌. నీ ముందేమీ అనరు. ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. మీరు తెచ్చుకోకుంటే మేం ఇస్తాం. అంతే… అంటారు వినయంగా. కానీ తర్వాతుంటాది తెచ్చుకున్నోళ్ళకి”.

”సర్లే… సర్లే.. ఈరోజుకి నువ్వుపో… ఇంకోసారిలా జరగకుండా నేనొచ్చి మాట్లాడ్తాలే మీ కరెస్పాండెంట్‌తో” అంటూ వానికి నచ్చచెప్పి పంపించేశాడు.

టిఫిన్‌ తిని, స్నానం చేసి ఆఫీసుకు అర్ధరోజు సెలవు పెట్టి, పెళ్ళాన్ని వాళ్ళ ఆఫీస్‌ దగ్గర దింపి స్కూల్‌ వైపు బయలుదేరాడు.

స్కూలు ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో వుంది. ఇద్దరినీ సెమీ రెసిడెన్షియల్‌ పద్దతిలో చేర్పించాడు. పొద్దున్నే ఆరుకల్లా బీక్యాంప్‌ దగ్గరికి బస్సొచ్చేస్తుంది. పొద్దున టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అంతా వాళ్ళే చూసుకుంటారు. స్నానం చేపించి బస్సెక్కిస్తే చాలు. సాయంత్రం స్కూలయిపోగానే అక్కన్నే ట్యూషన్‌, వెనకబన్న సబ్జెక్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. హోంవర్కును కూడా వాళ్ళే చేయిస్తారు. ఇంటికి చేరుకునే సరికి ఏడున్నరో, ఎనిమిదో అవుతుంది. ఆదివారాలు గూడా ఎక్స్‌ట్రా క్లాసులు మధ్యాహ్నం దాకా తీసుకుంటారు. పిల్లలకు ఇంగ్లీష్‌ బాగా రావడానికి టీచర్లతో గానీ, స్నేహితుల్తో గానీ స్కూలు కాంపౌండ్లో తెలుగులో మాట్లాడ్డం నిషేధించారు.

ఇద్దరూ వుద్యోగస్థులే కావడంతో రాంచంద్‌కు ఇవి బాగా నచ్చేశాయి. దాంతో దూరమయినా ఫీజులెక్కువయినా అందులోనే చేర్పించాడు. ఆలోచనల్లోనే స్కూలొచ్చేసింది. లోపలికి అడుగుపెట్టాడు.

యూ షేప్‌లో కట్టబడిన మూడంతస్తుల తరగతి గదులు. మధ్యలో శుభ్రంగా మెరిసిపోతున్న విశాలమైన గ్రౌండ్‌. చుట్టూ పచ్చని చెట్లు, పూలమొక్కలు, మెత్తటిలాన్‌, మధ్యలో వివిధ రకాల ఆటల కోర్టులు, తగిలించిన నెట్లు, కుడివైపు చివరన వరుసగా నిలుచున్న పసుప్పచ్చని స్కూలు బస్సులు.

దాదాపు మూడు వేల మంది విద్యార్థులున్నా తరగతి గదుల్లో పిల్లలున్నారా లేక సెలవు రోజా అనేది చెప్పలేనంత శ్మశాన ప్రశాంతత వుందక్కడ.

ప్రారంభంలోనే కరస్పాండెంట్‌ గది. రిసెప్షన్లో ఇరవైయేళ్ళ యువతి చిరునవ్వుతో వివరాలడిగి ”సారు లోపల వాళ్ళ స్నేహితునితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడ్తున్నారు. కాసేపు వెయిట్‌ చేయండి” అంటూ సిటవుట్‌లో కుర్చీ చూపించింది. రాంచంద్‌ టైం చూసుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు.

జ జ జ జ జ

కరస్పాండెంట్‌ గది అందంగా నీలంరంగు పెయింట్‌తో ఆహ్లాదంగావుంది. ఎయిర్‌ కండిషన్‌ మల్లెపూల వాసనను నలుమూలలా వెదజల్లుతూ గదిని నిశబ్దంగా చల్లబరుస్తూ వుంది. గోడలపై అందమైన పెయింటింగ్స్‌ వేలాడుతూ వున్నాయి. కుడివైపునున్న షోకేష్‌లో రకరకాల షీల్డులు స్కూలు గొప్పతనాన్ని గర్వంగా చూపిస్తున్నాయి.

కరస్పాండెంట్‌ కుర్చీలో వున్న శేఖర్రెడ్డి చిన్నగా నవ్వుతూ ”రేయ్‌,… ఏందీ… నువ్వు స్కూలు పెట్టాలను కుంటున్నావా… నిజమా… ఐనా ఇట్లా అందరూ స్కూళ్ళు పెడ్తాపోతే మాలాంటివాళ్ళంతా ఏమైపోవాల. ఐనా హఠాత్తుగా ఎందుకిట్లా ఈ వైపుకి గాలి మళ్ళింది” అన్నాడు.

ఎదురుగా కూచున్న శ్రీనివాసనాయుడు ”అది గాదు శేఖరు… తమాషాక్కాదు సీరియస్‌గానే అంటున్నా. ఈ మధ్య చికున్‌గన్యా వచ్చి యాపారం ఒక్కసారిగా నున్నగా నూక్కపోయింది. గిట్టుబాటు కాకపోయినా ఎదిగిన కోళ్ళను ఏం చేయాల్నో తెలీక అయినకాడికి అమ్మేసుకొంటి. ఆదినం నుండి ఏం యాపారం చేద్దామా అని ఆలోచిస్తావుంటే మా బామ్మర్ది గాడు ”కోళ్ళఫారానికీ, కాన్వెంటు స్కూలుకీ పెద్ద తేడా లేదు బావా… కోడిపని తినడం గుడ్లు పెట్టడం. స్టూడెంటు పని చదవడం మార్కులు సంపాదించడం. కోళ్ళఫారంలో కోళ్ళనెట్లయితే పద్ధతి ప్రకారం గదుల్లో బంధించి పెంచుతామో, కాన్వెంటు స్కూళ్ళో కూడా పొట్టెగాళ్ళను అట్లాగే బంధించి చదివించాలంతే… మాగాణిని నమ్ముకున్నోడు కాన్వెంటు స్కూలుని నమ్ముకున్నోడు ఎన్నటికీ చెడిపోడు గుర్తుంచుకో” అని సలహా ఇచ్చినాడు. ఆ రోజు నుండి ఇదే ఆలోచన. నువ్వయితే చాలా దినాల్నుండీ ఈ యాపారంలో వున్నావు గదా… లోతుపాతులు బాగా తెలిసుంటాయి. అందుకని నీ దగ్గరికొస్తి” అంటూ వున్నదున్నట్టు చేప్పేశాడు.

”సర్లే… సర్లే… ఐనోనివి. పైగా కాలేజీలో కంచం పంచుకున్నోనివి. నీకుగాకపోతే… ఇంగెవరికి సాయం చేస్తాగానీ…ఇంతకీ ఏం చేయాల్నో చెప్పు” అడిగాడు.

”అచ్చరాలు రానోన్ని వాక్యాలు రాయమన్నట్లు అసలేమన్నా తెలిసేడిస్తే గదా అడగడానికి… చానా పెద్ద పెట్టుబడితో దిగాలనుకుంటున్నా గాబట్టి అసలీ యాపారం నమ్మకమేనా… గాదా… ముందది చెప్పు” అన్నాడు.

 

శేఖర్రెడ్డి ఒక్క నిమిషం ఆలోచించి ”నీ దగ్గర నేను దాచి పెట్టేదేముంది గానీ… వున్నదున్నట్టు చెబుతా విను. దోచుకున్నోనికి దోచుకున్నంతని… తెలివుండాలే గానీ బంగారు బాతులాంటిదీ యాపారం. నెలనెలా ఫీజులేగాక, ట్యూషన్సనీ, స్పోకెన్‌ ఇంగ్లీష్‌ కోర్సనీ, ఐదోతరగతి నుంచే ఐఐటి కోచింగనీ, కంప్యూటర్స్‌ స్పెషల్‌ ట్రయినింగనీ, మధ్య మధ్యలో స్టడీ టూర్లనీ, ఎస్కర్షన్లనీ, ఎండాకాలంలో సమ్మర్‌ క్యాంపనీ ఇట్లా పైన చానా సంపాదించొచ్చు. వీలైతే క్యాంపస్‌లోనే క్యాంటీన్‌, బుక్‌షాప్‌ గూడా రన్‌ చేయొచ్చు. దీంతో బాటు నోట్‌బుక్స్‌, టెక్ట్స్‌బుక్స్‌, స్కూల్‌ డ్రస్సు, స్కూలుబస్సు వుండనే వున్నాయి. మరోపక్క డిసిప్లిన్‌ పేరుతో లేట్‌గా వస్తే ఫైన్‌, క్లాసులో అల్లరి చేస్తే ఫైన్‌, పరీక్షల్లో మార్కులు తగ్గితే ఫైన్‌, బడికి ఆబ్సెంటయితే ఫైన్‌ ఇట్లా అనేకం వసూలు చేసుకోవచ్చు. డేస్కాలర్సేగాక రెసిడెన్సియల్‌, సెమీ రెసిడెన్సియల్‌ నడిపితే ఇంకా లాభం. దిగుతే గానీ లోతు తెలీదన్నట్లు ఎన్నని చెప్పనులే. కానీ ఏది చేసినా కోడికి తెలీకుండా గుడ్డును నూకేసినట్లు, నొప్పి తెలీకుండా సూదేసినట్లు జరిగిపోవాల. అన్నీ వాళ్ళకోసమే చేస్తున్నట్లు బిల్డప్పియ్యాల” అన్నాడు.

ఆ మాటలన్నీ నోరెళ్ళబెట్టుకోని విన్న శ్రీనివాసనాయుడు ”కానీ… ఇప్పటికే ప్రయివేట్‌ ఆస్పత్రుల్లెక్క అడుగడుగునా స్కూళ్ళున్నాయి గదా… మధ్యలో నాది సక్సెస్‌ అవుతుందంటావా” అనుమానంగా ప్రశ్నించాడు.

ఆ మాటలకు శేఖర్రెడ్డి శ్రీనివాసనాయుని భుజం తడుతూ ”చిన్న చిన్న స్కూళ్ళయితే లాభం లేదు నాయుడూ… పెట్తే మల్టీ స్టారర్‌ సినిమాలెక్క భారీ పబ్లిసిటీతో పెద్ద ఎత్తున కొత్తగా ఎదుగుతున్న కాలనీల్లో అడుగుపెట్టాల. అడ్మినిస్ట్రేషన్‌లో మంచి అనుభవమున్న హెడ్‌ మాస్టర్నొకర్ని అధికమొత్తంలో ఆశ చూపి నీ దాంట్లోకి లాగెయ్యాల. బస్సుల్తో చుట్టు పక్కల పల్లెల మీద, వీధుల మీద పడాల. కార్పొరేట్‌ హాస్పిటళ్ళు ఆర్‌.యం.పి. డాక్టర్లకు వలేసి కేసులు పడ్తున్నారు చూడు అట్లా పల్లెల్లో బ్రోకర్లని పట్టాల. పదిమందిని చేర్పిస్తే మీ పిల్లోనికి ఫ్రీ లాంటి పథకాలు రహస్యంగా ప్రకటించాల. స్కూలుకి గూడా మంచి పేరు పెట్టాల.

నీ చిన్న కూతురి పేరు సృజనే గదా. ఆపాప పేరు మీదనే సృజనా కాన్సెప్ట్‌ స్కూల్‌ అని పెట్టు అదిరిపోతాది… అసలు…”

మాటల మధ్యలో శ్రీనివాసనాయుడు అడ్డు తగులుతూ ”కాన్సెప్ట్‌ స్కూలా అంటే ఏ కాన్సెప్ట్‌ అయితే బాగుంటుంది” ప్రశ్నించాడు.

”కాన్సెప్టా… మన్నా… ఇప్పుడది లేటెస్ట్‌ స్టైల్‌… అంతే… ఏ కాన్సెప్ట్‌ లేకపోవడం గూడా ఒక కాన్సెప్టే. అంతగా ఎవరైనా తలమాసినోడు అడిగినా కోడి గుడ్డును పొదిగినంత జాగ్రత్తగా మీ పిల్లల్ని మీరు కలలు కంటున్నట్టు పెంచి పెద్ద చేయడమే మా కాన్సెప్ట్‌ అని చెప్పు. స్కూలు సింబల్‌ గూడా ముద్దులొలికే చిన్న పిల్లలను రెక్కల కింద జాగ్రత్తగా పొదువుకున్న కోడి బొమ్మ పెట్టు. కరెక్టుగా సరిపోతుంది” గట్టిగా నవ్వుతూ అన్నాడు.

నవ్వుల మధ్యలోనే ”ఎక్స్‌క్యూజ్‌మీ సర్‌” అనే సెక్రటరీ పిలుపు వినబడింది. ఏమన్నట్లుగా చూశాడు.

”రాంచందని తొమ్మిదో తరగతి ‘ఎఫ్‌’ సెక్షన్లోని వెంకటేష్‌ ఫాదర్‌.”

”ఏమంట… విషయం”.

”అదేసార్‌.. నోట్‌బుక్స్‌ బైట తెచ్చుకున్నాడు… ఈయనే”

శెఖర్రెడ్డికి విషయమంతా అర్థమయిపోయింది. ”సరే… ముందు ఆ పిల్లోవాని రిపోర్ట్సివ్వు” అన్నాడు. రిపోర్ట్స్‌ రాగానే అన్నీ చదివి ”నాయూడూ… అప్పుడప్పుడూ కొంత మంది పంటికింద రాయిలెక్క మన యాపారానికి అడ్డుపడుతూ వుంటారు. ఇప్పుడు లోపలికొచ్చేటోడు కూడా అట్లాంటోడే. నోట్‌బుక్స్‌ ఎక్కువ రేటుకి అమ్ముతున్నామని బైట తెచ్చుకున్నాడు. ఇట్లాంటోళ్ళ పిల్లల్ని సతాయించడానికి ఒకర్ని పెట్నాం. పిల్లలు విసిగి విసిగి ఇంట్లో గొడవ చేసింటారు. అందుకే మన మీదికి వచ్చింటాడు. ఇట్లాంటోళ్ళని ఎట్లా డీల్‌ చెయ్యాల్నో కాస్త గమనించు. ముందు ముందు పనికొస్తాది” అంటూ సెక్రట్రీని పిలిచి లోనికి పంపియ్యమన్నాడు.

రాంచంద్‌ లోపలికి అడుగు పెడుతుండగానే ”రండి… రండి… నేనే మిమ్మల్ని పిలిపిద్దామనుకుంటుంటే మీరే వచ్చినారు” కుర్చీ చూపిస్తూ గంభీరంగా అన్నాడు.

”ఏంసార్‌… విషయం” కన్‌ఫ్యూజవుతూ ప్రశ్నించాడు రాంచంద్‌.

”ఈ మధ్య మీ పిల్లోని మీద చానా కంప్లయింట్స్‌ వస్తున్నాయి. సరిగా చదవడం లేదనీ, శ్రద్ధగా వినడం లేదనీ, లేట్‌గా వస్తున్నాడనీ, మార్కులు తగ్గిపోతున్నాయనీ… ఇంతకూ ఏమి సమస్య. ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్సున్నాయా” ప్రశ్నించాడు.

తాను కంప్లయింట్‌ చేయాలని వస్తే తననే సంజాయిషీ అడుగుతూ వుండడంతో కొంచం సేపు రాంచంద్‌కు ఏం మాట్లాడాల్నో అర్థంగాలేదు. అంతలో పొద్దున కొడుకు చెప్పిందంతా గుర్తుకొచ్చి ”అదీ… వాళ్ళ సైన్సు మిస్‌ అనవసరంగా చిన్న చిన్న దాండ్లకే పనిష్‌మెంట్‌ ఇస్తున్నదంట ఈ మధ్య… దాంతో వాడు మానసికంగా డిస్టర్బ్‌ అవుతున్నాడు. ఆమె పై మీరు…”

మాటల మధ్యలోనే శేఖర్రెడ్డి అడ్డుపడుతూ ”చూడండ్సార్‌… టీచర్ల మీద కంప్లయింట్‌ చేసే ముందు ఎద్దు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్లు గాక కాస్త వెనుకాముందు ఆలోచించి చెయ్యాల. ఈ ఇన్‌స్టిట్యూషన్‌ ప్రారంభించినప్పటి నుండీ వుందామె. ఎంత సిన్సియర్‌ గాకపోతే కొనసాగిస్తాం ఇంత కాలం. ఐనా మీ పిల్లవానిపై ఆమెకేం కోపం. మీకు మీకు ఏమయినా పగలూ ప్రతీకారాలూ వున్నాయా” ప్రశ్నించాడు.

”అదిగాదు… ఈ సమ్మచ్చరం నోట్‌బుక్స్‌ ఇక్కడగాక బైట కొనుక్కొచ్చుకున్నాం గదా… అది మనసులో పెట్టుకోని…”

”నోట్‌బుక్స్‌ బైట తెచ్చుకుంటే కోపం మాకుండాల గానీ ఆమెకెందుకు. ఆమేమీ మా పార్ట్‌నర్‌ కాదు గదా… కేవలం ఒక టీచర్‌. ఏదయినా లాజికల్గా ఆలోచించాల. ఇట్లా నిజానిజాలు ఆలోచించకుండా పిల్లలను వెనకేసుకొస్త్తే రేప్పొద్దున వాళ్ళు మామాటేం వింటారు. మేమిలాంటివి ఇక్కడ అనుమతించం. మీకంతగా ఇబ్బందనిపిస్తే వేరే స్కూలు చూసుకోండి. మాకభ్యంతరం లేదు. మేం కాస్త అర్జంట్‌ మీటింగ్‌లో వున్నాం. మీరు ఆలోచించుకోని మళ్ళా కలవండి” అంటూ రాంచంద్‌ మాట్లాడ్డానికి అవకాశమివ్వకుండా ముగించేశాడు.

రాంచంద్‌కు దిక్కు తోచలేదు. బలవంతంగా చిరునవ్వు మొగమ్మీదకు తెచ్చుకోని బైటకు నడిచాడు.

అదంతా చూస్తున్న శ్రీనివాసనాయుడు రాంచంద్‌ బైటికి పోగానే ”అరెరే… అదేంది అట్లా డైరెక్టుగా చెప్పేశావు. టీసీ తీస్కోని పోతే ఎట్లా” ప్రశ్నించాడు.

శేఖర్రెడ్డి చిన్నగా నవ్వుతూ ఇప్పుడు ”కోళ్ళఫారంలో ఒక కోడికి తెగులొచ్చిందనుకో… అది మిగతాదాండ్లకి అంటుకోకముందే నువ్వేం చేస్తావు… ఇదీ అంతే… అర్థమైందా” అన్నాడు.

ఆ మాటలకు శ్రీనివాసనాయుడు అర్థమైందన్నట్లుగా తలూపుతూ ”కరెక్టే… ఇట్లాంటోళ్ళు వుండకపోవడమే మంచిది. వున్నా ఈ దెబ్బతో మళ్ళీ ఎప్పుడూ కంప్లయింట్‌ చేయడు” అంటూ నవ్వేశాడు.

*     **     **

Dr. M. HARIKISHAN, Writer

– డా.ఎం.హరికిషన్, రచయిత

సెల్. 9441032212

Leave A Reply

Your email address will not be published.

Breaking