Header Top logo

Boshadike whore myth బోషడీకే బూతు పురాణమా

 Boshadike whore myth బోషడీకే బూతు పురాణమా

తిట్ల తద్ది “బోషడీకే..”

ఇది నాకు ఎంతో సుపరిచితమైన పదం. నాకే కాదు, నేను పుట్టి పెరిగిన ఉత్తరాంధ్రలో అందరికీ బాగా నోళ్లలో నానిన పదం ఇది. ఇప్పుడయితే దీన్ని అందరూ పరమ బూతు తిట్టుగా చీదరించుకుంటున్నారు గాని ఇది బూతు అని తెలియకుండానే ఇన్నాళ్ళూ ఒక మామూలు తిట్టుగా (అంటే వెధవ, వాజమ్మ లాగా) చలామణీ అయిపోయింది. నా చిన్నప్పుడు, నేను శ్రీకాకుళంలో హైస్కూల్లో చదువుతున్నప్పుడు మా మేష్టార్లు చాలా విరివిగా ఈ తిట్టు వాడేవారు. మా తెలుగు మేష్టారొకాయన ఈ పదాన్ని తిట్టుగా మాత్రమే కాదు, ఒక పిలుపుగా కూడా వాడేవారు. “ ఏరా, బోషడీకే.. ఏం చేస్తున్నావ్?” అని ఆప్యాయంగా పలకరించేవారు. అసలు ఆయన చెప్పే పాఠం కన్నా ఈ పదమే నాకు బుర్రలో బాగా నాటుకుపోయింది. “ మీవల్ల నాకు చుట్ట కాల్చడమొక్కటే వచ్చింది” అనే వెంకటేశం గిరీశంతో చెబుతాడు చూడండి, అలాగన్న మాట.

బోషడీకే అర్థం తెలియకుండా..

అయితే ఈ పదాన్నిఅప్పుడూ ఇప్పుడూ ఉపయోగిస్తున్న వాళ్లలో నూటికి తొంభై తొమ్మిది మందికి అది అసలు ఏ భాషా పదమో, దాని అర్ధమేమిటో తెలియకుండానే యధేచ్చగా వాడేస్తున్నారని నేనంటే మీరు నమ్మాలి. గత వారం రోజుల్లో ఎంతో మంది పెద్దలు చేసిన పరిశోధనా కృషి వల్ల “బోషడీకే ” అన్న పదానికి అర్ధం “ లంజ కొడుకు” (క్షమించాలి. ఈ ఒక్క చోట చుక్కలు పెట్టకుండా రాయాల్సి వస్తోంది.) అని తేట తెల్లమైపోయింది. “లం. కొ.” అనే తిట్టుకి తత్సమము “బోషడీకే” అని తెలిసుంటే మా తెలుగు మేష్టారు ఆ పదం చచ్చినా వాడి ఉండేవారు కాదు.

 అలాగే  “లం. కొ.” తిట్టుకి అదే అర్ధంలో వెన్నంటి ఉండే మరో తిట్టు “లమ్డీ కొడుకు” (క్షమించాలి. ఈ పదం కూడా చుక్కలు పెట్టకుండా రాయాల్సి వస్తోంది.) దీన్ని షార్ట్ ఫార్మ్ లో “లమ్డిక్” అనడం కూడా కద్దు. (అదేమిటో ఖర్మ..మగాళ్ళని తిట్టినా ఆ తిట్లు ఆడవాళ్లకే తగుల్తాయి) గమ్మత్తేమిటంటే ఈ మూడు తిట్లూ ఆగ్రహావేశాలతో పలికేటప్పుడు బూతు రూపాన్ని ధరిస్తే, ఆప్యాయంగా పిలుచుకునేటప్పుడు ముద్దు ముద్దు మేకప్ వేసుకుంటాయి. (ఉదా: “ఆ నంజి కొడుకు భలేగా యాక్ట్ చేసేడ్రా!”). “ముండా” అన్నది తిట్టే అయినా చిన్న పిల్లల్నీ, కుక్కపిల్లల్నీ “దొంగ ముండ, బుజ్జి ముండ, పిచ్చి ముండ..” అని ముద్దు చేస్తాం చూడండి, అలాగన్న మాట.

ఒరే బోషడీకే మాస్టర్ పిలుపు..

అసలు తిట్టుకి ‘సౌండింగ్’ కూడా ప్రధానం అని నేను అనుకుంటూ ఉంటాను. ఉదాహరణకి “బోషడీకే” అని ఆగ్రహంతో ఘర్జిస్తూ పలికితే అర్ధం తెలియకపోయినా అది తిట్టు అని అర్ధమై పోతుంది. అదే మా తెలుగు మేష్టారిలా “ ఒరే బోషడీకే.. మా ఇంట్లో ఈ కూరగాయల సంచీ పడేసి రారా” అని లాలనగా అంటే అది తిట్టులా కాకుండా అదో ఊతపదం లాగా ధ్వనిస్తుంది. నిజానికి మన తెలుగు నాట “బోషడీకే” అన్న తిట్టుకి కవల అక్క చెల్లెళ్ళ వంటి ఇంకో రెండు తిట్లు కూడా అర్ధం పర్ధం తెలియకుండానే చలామణీలో ఉన్నాయి. “బాంచత్, మాదర్చుత్” అనే సదరు ఈ రెండు తిట్ల అసలు అర్ధం విడమర్చి చెప్తే అస్సలు బాగుండదు. అవి “బోషడీకే” కన్నా పరమ దారుణమైన, ఘోరమైన  తిట్లని నాకు కాస్త లేటుగా జ్ఞానోదయమైంది. అర్ధం తెలియకుండానే ఆ తిట్ల వాడకం తెలుగునాట విచ్చలవిడిగా సాగుతూనే ఉంది. ఈ తిట్ల మాతృ భాష పంజాబీ అని కొందరు, హిందీ అని మరి కొందరు బూతు భాషా పరిశోధకులు వాదించుకుంటూ ఉంటారు. ఏ భాష అయితేనేం, ‘’బోషడీకే” అన్న తిట్టుకి తెలుగులో అసలు అర్ధం ఏమిటో ఇప్పుడు యావన్మందికీ తెలిసిపోయింది.

తిట్లపై పిహెడ్ డి చేస్తే..

అసలూ.. మనకి పొరుగునే ఉన్న ఒడియా, కన్నడ, తమిళ భాషల బూతు తిట్లు మన తెలుగు భాషలోకి చొరబడకుండా ఎక్కడో ఉత్తరాది నుంచి బూతు తిట్లు జబర్దస్తీగా వచ్చి మన భాషని ఇంత సుసంపన్నం ఎలా చేశాయో నాకు ఎప్పటికీ అర్ధం కాని విషయం. ఇది బూతు భాషా పరిశోధకులు పిహెచ్ డి చేయాల్సిన అంశం. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే.. మన కోపాన్నీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చెయ్యడానికి కొత్త కొత్త తిట్లు కనిపెట్టాల్సిన అవసరాన్ని గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు నొక్కి వక్కాణిస్తున్నాయని నేననుకుంటున్నాను. ఈ దిశగా జంధ్యాల గారూ, ముళ్లపూడి వెంకటరమణ గారూ చేసిన కృషిని మరిచిపోకూడదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను.

సినిమాలలో కొత్త తిట్లతో..

ఉదాహరణకి, ‘మొగుడూ పెళ్లాలు’ సినిమాలో సుత్తి వీరభద్రరావు తన కొడుకు నరేష్ ని కొత్త కొత్త తిట్లతో తిడుతూ ఉంటాడు. ఒక సీనులో నరేష్ ని “కిష్యూటికా” అని తిడతాడు. “ఆ తిట్టుకి అర్ధం ఏమిటి నాన్నా” అని నరేష్ అమాయకంగా అడిగితే “నాకూ తెలీదు. మాట బావుందని వాడా” అంటాడు సుత్తి వీరభద్రరావు. అలాగే, తెలుగువారి చిచ్చర పిడుగు బుడుగుకి కోపం వస్తే ఎదుటివాణ్ణి “జాటర్ డమాల్” అని తిడతాడు. ఆ మాటకి అర్ధం “అర్ధం లేదూ” అని అర్ధం అని విడమర్చి కూడా చెప్తాడు. మరి ఈ మాటలకి కూడా అర్ధం ఉందని, ఏ నైజీరియా భాషలోనో, చైనా భాషలోనో వీటికి అర్ధం “లం.కొ. “ అని ఏ బూతు భాషా పరిశోధకులైనా కష్టపడి కనిపెట్టి భాష్యం చెబితే స్వర్గంలో ఉన్న జంధ్యాల గారు, రమణ గారు జుత్తు పీక్కుంటారని నా ప్రగాఢ నమ్మకం.

 మంగు రాజగోపాల్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking