Header Top logo

జర్నలిస్ట్ వేణు గోపాల్ చారి స్వీయానుభవం

గుర్తుకొస్తున్నాయి..

స్వరూపక్క @ సామ్రాజ్యవాదం

2000 మార్చి 18..

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం సోమారంపేటలో..

సూర్యుడు అస్తమిస్తుండగా చీకట్లు అలుముకుంటున్నాయి.
మేతకు వెళ్ళిన పశువుల మందలు ఊళ్ళోకి వస్తున్నాయి.
పొలం దగ్గరకు వెళ్ళిన రైతులు ఇళ్లకు చేరుకుంటున్నారు.
అలీవ్ గ్రీన్ దుస్తుల్లో ఉన్న నక్సలైట్లు డప్పు చప్పుళ్ళతో పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతున్నారు. వాళ్ళ వెంట జనం కదిలి ఊరి నడుమకు చేరుకున్నారు.

వార్త కవరేజీ కోసం నాకు ముందే అందిన సమాచారం మేరకు ఇంకో మిత్రుడితో కలిసి ఆ ఊరికి వెళ్ళాను. ఊరిలో ప్రవేశించే చోట ఇద్దరు యువకులు కాపలా ఉన్నారు. నన్ను చూసి గుర్తు పట్టి నమస్తే అన్నా అంటూ వెళ్ళమని పంపించారు.

అప్పటి పీపుల్స్ వార్ దళ కమాండర్ స్వరూప అలియాస్ మొర్రి లస్మవ్వ మైక్ తీసుకుని మాటలు మొదలు పెట్టింది.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటన ( 2000 మార్చి 24) కు వస్తున్నారు. క్లింటన్ పర్యటనను వ్యతిరేకిస్తూ నక్సలైట్లు కార్యక్రమం చేపట్టారు.

స్వరూప స్పీచ్ అద్భుతం..

నాకు తెలిసినంతవరకు స్వరూప చదువుకోలేదని తెలుసు. కానీ విప్లవోద్యమం లో చదవడం, రాయడం నేర్చుకుంది. ఎంత నేర్చుకుంది అంటే సామ్రాజ్యవాదం మీద మాట్లాడేంత !
సామ్రాజ్యవాదం మన ఇంట్లోకి ఎలా వస్తోంది అని ఆమె అధ్బుతంగా వివరించారు.
కుంకుడు కాయలతో తల స్నానం చేసిన మనకు శాంపుల వాడకాన్ని ఎలా అలవాటు చేస్తున్నారో ఆమె వివరించింది.

కుంకుడు కాయలతో తల రుద్దుకుంటే వెంట్రుకలు రాలిపోయేవి కాదని,
షాంపూలు వాడటంతో ఎలా రాలిపోతున్నాయి అనేది అక్కడి జనాలకి అర్థం అయ్యే విధంగా వివరించింది.

షాంపూతో మొదలై, ఆహారపు అలవాట్లు, ఇంట్లో వాడుకునే వస్తువులు, బట్టలు… ఇలా అలవట్లపై మాట్లాడింది. సామ్రాజ్యవాదులు మన సంపదను ఎలా కొల్లగొడుతారు, మన దగ్గరి చిరు వ్యాపారులు ఏమవుతారో వివరించిన తీరు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది.
బయట తిరుగుతున్న నాకు తెలియని ఎన్నో విషయాలు ఆరోజు ఆమె స్పీచ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను.

సుదీర్ఘ కాలంపాటు ఆమె ఉద్యమంలో పనిచేసింది.
తప్పు చేసిన సొంత అన్ననే ఆమె శిక్షించిందని అప్పట్లో వార్తలు చదివిన విషయం గుర్తుంది.
తరువాతి కాలంలో తీవ్ర నిర్బంధం తో పొరుగు జిల్లా సిరిసిల్ల లో జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తూ ఎన్కౌంటర్ లో చనిపోయింది.

ఆమెది మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామం.

– ఎస్ . వేణు గోపాల్ చారి, సీనియర్ జర్నలిస్ట్

—–

నోట్ : ఔను.. వేణు చెప్పింది నిజమే.. మహిళ నక్సలైట్ స్వరూప స్వంత అన్నయ్య దేవన్న పోలీస్ ఇన్ పార్మర్ (కోవర్గు) గా మారాడని మానాల అడవులలో విలేకరుల సమక్షంలో ఒప్పించారు. ఆ విలేకరుల బృందంలో నేను ఉన్నాను. ఆ తరువాత కోవర్టుల వార్త సేకరణ తరువాత అడవి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ మహిళ నక్సలైట్ స్వరూప మాకు సెక్యూర్టీ గా వచ్చారు.  ఆమె వయసు ఇరువై అయిదు ఉండచ్చు.  నేను ఆమెతో ముచ్చటించాను. ఎన్నో విషయాలు నక్సలైట్ ఉద్యమం గురించి చెప్పారు స్వరూప.

‘‘తప్పు ఎవరు చేసిన తప్పే.. పార్టీ నిర్ణయిస్తే నేనే మా అన్నయ్యను శిక్షిస్తా..’’ అంది మహిళ నక్సలైట్ స్వరూప. మేము ఇంటికి చేరుకునే లోపు నక్సలైట్ నేత ఆజాద్ ఆధ్వర్యంలో స్వరూప అన్నతో పాటు ఐదుగురిని కోవర్గుల పేరుతో కాల్చి చంపారు నక్సలైట్లు..

ఆ అనుభవంను ‘‘ అన్నలతో ఒక రోజు..’’ పుస్తకం రాసాను. చాలా వివరాలు అందులో రాసాను..

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking