Another step forward మరో అడుగు ముందుకు కవిత్వం
Another step forward
మరో అడుగు ముందుకు
కోరికల కుటీరంలో చేరుకున్నాక
మనసు పొలిమేరలు దాటిపోతోంది
బ్రతుకు పుస్తకంలో
అన్నీ అర్థంకాని ప్రశ్నలే
నిన్నను సమాధిచేసి నేడు వెలుతోంది
నేడును అంతమొందించుటకు
రేపు సమాయత్తమౌతోంది
ఆశల పందిరిలో ఊసులాడుకుంటుంటే
అపసవ్యదిశలో అడుగులు పడుతున్నాయి
నిర్జీవమైన సమాధానాలు
కుప్పలు తెప్పలుగా రాలిపడుతున్నాయి
ఆశలు ఆవిరైననాడు
అనుభూతులు ధగ్ధమైననాడు
ఆప్తులు వెన్నుపోటు పొడిచిననాడు
శూన్యమై మిగిలిన దేహానికి అమృతం కూడా విషాహారమే
సమ్మెటపోటుల్లా వెంటాడేనీడలు
స్వార్థానికి కొత్త రంగు వేసుకుంటున్నాయి
చిద్రమైన మనసుకు
చీకటి పొరలు అల్లుకుంటున్నాయి
ఒరుసుకుపోతున్న అనుభవాలు
శిథిలావస్థకు చేరుస్తున్నాయి
స్వప్నంలో నైనా గెలవాలని నా కళ్ళు
విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి
నిముషాలు క్షణాలను మింగేస్తున్నాయి
అడుగు తీసి మరో అడుగు వేస్తూ…