నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నల్లగొండ వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ చెప్పారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఏడుగురు వ్యక్తులను బుధవారం ట్రైనీ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట హాజరు పరుచగా వారిలో ఇద్దరు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలల పాటు రద్దు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు వ్యక్తులకు ఒక రోజు జైలు శిక్ష విధించారని, వీరితో పాటు మరో నలుగురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి ఒక్కొక్కరికి 2,100 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగిందని సిఐ సురేష్ తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం కావద్దని, రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబం రోడ్డున పడుతున్న పరిస్థితులను గమనించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిని సహించబోమని, జరిమానాలు, జైలు శిక్షలతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్సులు సైతం రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. వాహనదారులంతా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, నిబంధనలు పాటిస్తూ పోలీసులతో సహకరించాలని వన్ టౌన్ సిఐ సురేష్ కోరారు.