Header Top logo

పొలంలో ఇల్లుంటే తప్పా?

  • వందల ఎకరాలు ఉన్న ఇంట్లో కేసీఆర్‌ పుట్టిండు
  • రైతు కుటుంబంలో పుట్టడం వల్లనే రైతుల పట్ల ధ్యాస
  • మానేరు మత్తడి దుంకుతుందని ఎన్నడూ అనుకోలేదు
  • పూర్వీకుల గ్రామం కోనాపూర్‌లో మంత్రి కేటీఆర్‌

నిజామాబాద్‌, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పుట్టడమే వందల ఎకరాలు ఉన్న ఇంట్లో పుట్టాడని, ఆయనకు ఆస్తులు కొత్త కాదని పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టడం వల్లనే రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

తమ పూర్వీకుల గ్రామమైన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని కోనాపూర్‌ (గతంలో పోసానిపల్లి)లో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ శోభారాజు, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. రూ.25 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.75 లక్షలతో సీసీ రోడ్లకు, రూ.2.40 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం స్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు.

కొంతమంది నాయకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గురించి సోయి లేకుండా వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొలం మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఫామ్‌హౌస్‌ అని పేరు పెట్టి అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రైతులకు 24 గం టల నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్నారు. రూ.50 వేల కోట్లను రైతుబంధు రూపంలో 63 లక్షల మందికి పంపిణీ చేశారు. రైతు ఏ కారణంగానైనా చనిపోయినా రైతు బీమా కింద రూ.5 లక్షలు అందిస్తున్నాం. ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం.

కాళేశ్వరం ద్వారా నీరందించి ఇలాం టి ప్రాంతాలను సస్యశ్యామలం చేశాం’ అని కేటీఆర్‌ తెలిపారు. ఏప్రిల్‌, మే నెలలో మానేరు మత్తడి దుంకుతుందని ఎప్పుడూ అనుకోలేదని, కానీ ఇవాళ అది ఆవిష్కృతమైందని చెప్పారు. గత 75 ఏండ్లలో ఎవరన్నా ఇన్ని పథకాలు అమలు జేసిండ్రా అని ప్రశ్నించారు. ‘కామారెడ్డిని జిల్లా కేంద్రం, బీబీపేటను మండల కేంద్రం, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్‌ కాదా? ఎవడెవడో ఏదేదో ఒర్రుతాండ్రు.. వాళ్లను పట్టించుకోవద్దని చెప్పారు. మీడియా కనిపిస్తే చాలు కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు’అని విమర్శించారు.

‘ఇష్టమొచ్చినట్లు ఒర్రాలే.. టీవీల్లో పడాలే. ఈ పిచ్చోళ్లు మాట్లాడితే మీడియాకు వార్త. కోనాపూర్‌లో బడి కడుతున్నామంటే చూపించేటోడు ఉండడు. పొరపాటున కూడా దానిగురించి రాయరు. ఎవడో ఒకడొచ్చి ఇక్కడ ఒర్రిండనుకో అది పెద్దగా రాస్తారు. తెల్లారిందాక (టీవీల్లో) అదే తిరుగుతది. అందులో నిజం, అబద్ధం తెలుసుకోకుండా 24గంటలు తిప్పుతరు’ అంటూ వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో మంత్రులుగా పని చేసినవాళ్లు కంత్రీ పనులు తప్ప ఏమీ చేయలేదని పరోక్షంగా షబ్బీర్‌ అలీని ఉద్దేశించి అన్నారు.

ఖబడ్దార్‌.. ఇక ఊరునేది లేదు : వేముల
మహబూబ్‌నగర్‌లో గోడలకు సున్నాలు వేసుకునేటోడు, కరీంనగర్‌లో దుకాణాల్లో చందాలు వసూలు చేసినోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. వారికి సరైన బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణను అనేక రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్‌ అని, ఆయన గురించి చిల్లరగాళ్లు మాట్లాడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఖబడ్దార్‌.. ఇక ఊరుకునేది లేదు. మీకు బుద్ధి చెబుతాం’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మనవడు(కేటీఆర్‌) వచ్చిన వేళ కోనాపూర్‌ ఊర్లో దసరా పండుగ జరుగుతున్నంత ఆనందం కనిపిస్తున్నదని ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. కేటీఆర్‌ నాయనమ్మ వెంకటమ్మ గారి ఇల్లును చూస్తున్న సందర్భంలో కేసీఆర్‌ యాదృచ్ఛికంగా ఫోన్‌ చేశారని, కోనాపూర్‌లో ఉన్నానని కేటీఆర్‌ చెప్పడంతో సీఎం చాలా సంతోష పడ్డారని వివరించారు.

నాయనమ్మ ఊరికి కేటీఆర్‌
మంత్రి కేటీఆర్‌ తన నాయనమ్మ గ్రామమైన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని కోనాపూర్‌ (గతంలో పోసానిపల్లి)లో పర్యటించారు. ఆరు నెలల క్రితం ఇచ్చినమాట ప్రకారం నాయనమ్మ ఊరికి మంత్రి వచ్చారు. తన నాయనమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థం మన ఊరు మన బడిలో భాగంగా రూ.2.50 కోట్ల సొంత ఖర్చుతో నిర్మించబోతున్న స్కూల్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. కోనాపూర్‌కు వరాల జల్లు కురిపించారు. తొలిసారిగా నాయనమ్మ ఊరికి వచ్చినందుకు సంతోషంగా ఉన్నదని ఉద్వేగంగా చెప్పారు. కోనాపూర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘సుమారు 80-85 ఏండ్లటి కింది కథ. నాయనమ్మది పోసానిపల్లి. తాతది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని మోహినికుంట గ్రామం.

నాయనమ్మ వాళ్లకు మగ పిల్లలు లేరు. పెళ్లి చేసేటప్పుడే అల్లుడిని ఇల్లరికం అడిగారు. రాఘవరావు గారు ఇక్కడికే వచ్చారు. ఇప్పుడున్న ఇదే ఇంట్లో 1930లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. దాదాపు 1945వ సంవత్సరం దాకా అంటే అప్పర్‌ మానేరు ప్రాజెక్టు కట్టేదాకా ఇక్కడే ఉన్నారు. మానేరు వాగు మీద అప్పర్‌ మానేరు డ్యాం కట్టాలని నిజాం నిర్ణయం తీసుకున్నప్పుడు చెరువు విస్తరణలో వందల ఎకరాలు పోయాయి. 1940 దశకంలో భూములను కోల్పోయాం. ఆనాటి రోజుల్లోనే భూమి కోల్పోయినందుకు మా తాత, నాయనమ్మలకు అప్పటి ప్రభుత్వం రూ.2.5 లక్షలు పరిహారంగా ఇచ్చింది. ఇప్పుడు ఆ విలువ రూ.కోట్లలో ఉంటుంది. పోసానిపల్లి నుంచి సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామానికి తాత వెళ్లి ఐదారు వందల ఎకరాలు కొన్నారు. 1954లో చింతమడకలో కేసీఆర్‌ జన్మించారు’ అని వివరించారు.

మానేరుతో ఏదో అనుబంధం ఉంది
మానేరు ప్రాజెక్టుకు తమ కుటుంబానికి ఏదో అనుబంధం ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నాయనమ్మ ఊరు అప్పర్‌ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్‌ మానేరులో, ఇంకో అమ్మమ్మ ఊరు లోయర్‌ మానేరులో మునిగిపోయిందని తెలిపారు. నాయనమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థంగా మన ఊరు మన బడి ప్రోగ్రాం కింద తన సొంత ఖర్చులతో పాఠశాలలు నిర్మిస్తున్నట్టు కేటీఆర్‌ వెల్లడించారు. ‘నాయనమ్మ పేరు మీద రూ.రెండున్నర కోట్లతో బడిని కడుతున్నాను. నాయనమ్మ ఆత్మ శాంతించాలని, ఈ ఊరికి సొంతంగా మేలు చేసిన వాళ్లం కావాలని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పారు.

కోనాపూర్‌కు వరాల జల్లు
కోనాపూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. గ్రామానికి సీసీ రోడ్లు, తాగునీటి కోసం 2 కిలోమీటర్ల పైప్‌లైన్‌, రెండు బస్‌ షెల్టర్లు, మినీ లైబ్రరీ, మినీ డెయిరీ, మహిళా మండలి భవనం, కొన్ని కుల సంఘాల భవనాలు, గ్రామ పంచాయతీకి ప్రహరీ, పశు వైద్యశాల, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ అంశాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మంజూరు చేస్తామని ప్రకటించారు. బీబీపేటకు ఒక జూనియర్‌ కాలేజీని మంజూరు చేస్తామన్నారు.

నానమ్మ జ్ఞాపకార్థంగా సూల్‌ భవనం సొంత ఖర్చులతో నిర్మిస్తున్నా: కేటీఆర్‌
హైదరాబాద్‌, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా సూల్‌ భవనాన్ని నిర్మిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. ‘నానమ్మను స్మరించుకోడానికి ఇంత కంటే మంచి మార్గం లేదు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సొంత ఖర్చులతో నాన్నమ్మ పేరుతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నా. కామారెడ్డి జిల్లాలో నా పూర్వీకుల గ్రామమైన కోనాపూర్‌లో సూల్‌ భవనానికి ఈ రోజు శంకుస్థాపన చేసినందుకు ఆనందంగా ఉంది’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తాను నిర్మించనున్న స్కూల్‌ భవవ నమూనాను ట్విట్టర్‌లో పెట్టారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking