Header Top logo

పార్టీ ఇంతితై వ‌టుడింతై అన్నట్లు ఎదిగింది.. టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా హ‌రీశ్, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, క‌విత‌ శుభాకాంక్షలు

  • తెలంగాణ ప్రజల గుండెల నిండా గులాబీ జెండా: హ‌రీశ్ రావు
  • ప్రజ‌ల హృద‌యాల్లో పార్టీ సుస్థిర స్థానం సంపాదించుకుంది: ఇంద్ర‌క‌రణ్ రెడ్డి
  • తెలంగాణ‌ సాధనలో ప్రధాన కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే: క‌విత 
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత‌లు త‌మ పార్టీ శ్రేణుల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. ”2001లో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల్లోంచి, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆవిర్భవించి.. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి.. స్వరాష్ట్రంలో‌ సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ.. కోట్లాది ప్రజల మద్దతు, కార్యకర్తల బలంతో  టీఆర్ఎస్ పార్టీ సగర్వంగా 21వ వసంతంలోకి అడుగుపెట్టింది. 
టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశ విదేశాల్లోని ‘గులాబీ’ అభిమానులకు.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ ప్రజల గుండెల నిండా… గులాబీ జెండా” అని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు.

టీఆర్ఎస్‌ పార్టీ శ్రేణులకు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త‌మ‌ పార్టీ ఇంతితై వ‌టుడింతై అన్నట్లు 2001 నుంచి నేటి వ‌రకు ప్రజ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంద‌ని చెప్పారు. ఉద్యమ ఆంకాంక్షలైన నీళ్లు, నిధులు, ఉద్యోగాలను సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకోవడం గర్వంగా ఉందని ఆయ‌న తెలిపారు. మంత్రి కేటీఆర్ తమ‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండిందని ఆయ‌న చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా ప్ర‌త్యేక‌ రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందు అడుగు వేశారని ఆమె చెప్పారు. తెలంగాణ అంశాన్ని జాతీయ రాజకీయ ఎజెండాలో చేర్చి, రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించార‌ని ఆమె అన్నారు. ప‌లు పార్టీలతో జై తెలంగాణ అనిపించడానికి ప్రజా పోరాటాలను నిర్మించార‌ని క‌విత చెప్పారు. తెలంగాణ‌ సాధనలో ప్రధాన కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే అని ఆమె చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking