Header Top logo

రాజధానిని విశాఖకు తరలిస్తే అమరావతి రైతులకు రూ. 1.50 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది: ఎంపీ రఘురామ కృష్ణరాజు

మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంపై వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేసిన ఒకే ఒక్క మంచిపని ఇదేనని రఘురామ అన్నారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఇది ఇంటర్వెల్ మాత్రమేనని, క్లైమాక్స్ వేరే ఉందన్న మంత్రి పెద్దిరెడ్డి మాటలను తప్పుపట్టారు. విలన్లు విరామంలోనే హీరోలకు హెచ్చరికలు చేస్తారని, ముగింపులో విలన్లు చచ్చిపోతారని అన్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్‌ను విలన్లు చూపిస్తారని అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే అవుతుందన్నారు.

పెద్దిరెడ్డి, సజ్జల, ఇతరుల సలహాలతో సీఎం జగన్ ఇప్పటికే అపకీర్తిని మూటగట్టుకున్నారని, మంత్రివర్గ ప్రక్షాళనలో పెద్దిరెడ్డిని పక్కనపెట్టాలని జగన్‌కు సూచించారు. రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన రఘురామ రాజు.. అయితే, బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురందేశ్వరి, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? అని ప్రశ్నించారు. రాజధానిని విశాఖకు మార్చాలంటే అమరావతి రైతులకు రూ. 1.50 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
Tags: Raghu Rama Krishna Raju, YSRCP, Jagan, Peddireddi Ramachandra Reddy, Amaravati

Leave A Reply

Your email address will not be published.

Breaking