కంభం: ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శ్రీ కోట సత్యమాంబాదేవి ఆలయంలో ఏటా నిర్వహించే కోటిదీపోత్సవ కార్యక్రమంలో భక్తులు ఆనందోత్సాహాల నడుమ భక్తి ప్రపత్తులతో వత్తులు వెలిగిస్తూ కార్తీక కోటి దీపోత్సవాలలో పాల్గొన్నారు. కార్తికమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని సత్యమ్మ తల్లి ఆలయంలో కొండలపై నుండి దివ్వెలు దిగివచ్చేలా దీపశిఖలు నేలపై రెపరెపలాడేలా కోటి దీపోత్సవంలో కార్తీక దీపాలు కోటికాంతులతో అలరారాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, వేద పండితుల వేద పారాయణలు, గురువుల అనుగ్రహ భాషణలు, మాతృస్త్రీల మంగళశాసనాలతో దీపోత్సవ ప్రాంగణములో ఆధ్యాత్మిక శోభలు ఆనంద రాగాలు ఆలపించాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలతో వైభవంగా బ్రహ్మోత్సవంగా విశేష పూజలతో ఓం నమః శివాయ నినాదాలతో భక్తుల మనసులు భక్తిపారశ్యంలో మునకలు వేశాయి. ఆలయ కమిటీ వారి విశేష సేవలు భక్తులకు సంపూర్ణ సౌకర్యాలనందించాయి.