the illusory sparrow పల్లెల్లో కూడా మాయమైన పిచ్చుకా
పల్లె ముచ్చట్లు
The illusory sparrow
పల్లెల్లో కూడా మాయమైన పిచ్చుకా
పిచ్చుకా! పిచ్చుకా ! ఎక్కడికెళ్ళావు? ఏమై పోయావ్ ?
కంటికి కనిపించని పిచ్చుకలు.. మాయమైన గూళ్ళు..!!
పట్టణాల్లో సరే.. పల్లెల్లో కూడా కనిపించని పిచ్చుకలు !!
పిచ్చుకలపై నిర్లక్ష్యపు బ్రహ్మాస్త్రం ….!!
పిచ్చుకలు ఇప్పుడు.. గతకాలపు జ్ఞాపకం (Nostology)
ఒకప్పుడు పిచ్చుక కిచకిచలతో పల్లెలు మార్మోగేవి. ఇప్పుడు కనీసం చూడటానికి కూడా పిచ్చుక కనిపించని దుస్థితి
ఈ పాపం ఎవరిదంటే ఏం చెబుదాం.? ఇది ఖచ్చితంగా మనుషుల దుర్మార్గమే..పొలాల్లో విపరీతంగా రసాయనిక మందులు / ఎరువులు వాడుతున్నందువల్ల పిచ్చుకలు మృత్యువాత పడ్డాయి.అన్ని గ్రామాలకు మాదిరిగానే ఇది మా నంది వెలుగు గ్రామానికి కూడా వర్తిస్తుంది. అసలే అది బుజ్జి పిచ్చుక. దానిపైన..బ్రహ్మాస్త్రమా? మనిషి సిగ్గుతో తలదించుకొని, పిచ్చుకల జాతికి షరతుల్లేని క్షమాపణ చెప్పాలి.
“గతకాలము మేలు వచ్చు కాలము కంటెను’అన్న ఓ కవి వాక్యంలో ఎంతైనా నిజముంది. పిచ్చుక ఇప్పుడు
గతకాలపు వైభవం. ఓ ఆకుపచ్చని జ్ఞాపకం మాత్రమే..!!
యాదోంకి చిడియా…!!
అప్పుడప్పుడు
జ్ఞాపకాల పిచ్చుకలు
ఎగురుతుంటాయి
తమతో పాటు
ఎగరమంటూ
గోలచేస్తాయి !
నిజమే
వాటి లోకమే వేరు
పిచ్చుకల రెక్కల మాటున
ఎన్నెన్ని అనుభవాలు
అన్నీ ఒడుసుకుంటే
జీవితం ఎంత హాయి !
విడిపోతున్న
మనుషులు మధ్య
వీడి పోతున్న
మనిషితనం మధ్య
వాడి పోతున్న
మానవత్వం మధ్య
ఓ పచ్చని చిగురు
ఓ వెచ్చని అనుభూతి
ఈ జ్ఞాపకాల పిచ్చుకలు!!
-ఎ.రజాహుస్సేన్.!!
మామూలుగా అయితే ఊర్లలో వరి పంట కోతకొచ్చే సమయంలో పిచ్చుకల హడావుడి ఎక్కువగా వుంటుంది. ఒకప్పుడు పిచ్చుకల కోసం ఇంటి గుమ్మం ముందు,లేక వరండాలోనో వరి కంకుల్ని వేలాడగట్టేవారు. పిచ్చు కలొచ్చి ఎంచక్కా కంకుల్లోని ధాన్యాన్ని తినేవి. ఇలా చేయడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని భావించే వారు. ఆరోజులు పోయాయి. పిచ్చుకలూ పోయాయి.
పిచ్చుగ్గూళ్ళేవీ…!!
పిచ్చుకలే లేకపోతే ఇక పిచ్చుగ్గూళ్ళెక్కడుంటాయి? ఊర్లలో చెట్లకు అందమైన పిచ్చుగ్గూళ్ళు వేళ్ళాడుతూ కనిపించేవి. ఇప్పుడు చెట్లు కనిపించడమే గగనమై పోతుంటే ఇక పిచ్చుగ్గూళ్ళ సంగతి వేరే చెప్పాలా? గోరటి వెంకన్న చెప్పిట్టు ఒకప్పుడు పిట్ట బతుకు ఎంతో హాయిగా వుండేది.
“ఓ పుల్ల
ఓ పుడక
ఎండ్రుగడ్డి
సిన్న కొమ్మ
సిట్టిగూడు
పిట్ట బతుకు
ఎంతొ హాయి”
ఇప్పుడు సీన్ మారింది.
‘ఓ పుల్ల లేదు
ఓ పుడక లేదు
ఎండ్రుగడ్డి వున్నా
సిట్టి గూడు లేదు
పిట్ట లేదు..
పిట్ట బతుకూ లేదు’అన్నట్టు తయారైంది పిచ్చుకల పరిస్థితి..
మట్టి గూళ్ళు…!!
సాధారణంగా పిచ్చుకలు చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. అదేం చిత్రమోగానీ..కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం శాసనకోట కేసీ వంతెన కింద వందల సంఖ్యలో పిచ్చుకలు మట్టి గూళ్లు కట్టుకొని నివాసం ఉంటున్నాయట. ఏం కాలమొచ్చిందో చూశారుగా..? పిచ్చుకలకు ఎంత కష్టం వచ్చిపడింది?
ఇప్పుడు పిచ్చుక ఓ జ్ఞాపకం మాత్రమే.. భవిష్యత్తరాలు పిచ్చుకల్ని చూడాలంటే మ్యూజియం కు వెళ్ళాలేమో? పిచ్చుకల కిచకిచ ల్లేక వరిపొలాలుస్తబ్దుగా బిత్తర చూపులు చూస్తున్నాయి.