అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం మన దేశ టెక్నాలజీ కంపెనీలకు పరీక్షగా మారింది. ఎందుకంటే, ఇక్కడి కంపెనీలకు నిధులు సమకూర్చేది అక్కడి ఇన్వెస్టర్లే కావడం గమనార్హం. ఇదొక కోణం మాత్రమే. మరోవైపు భారీ నష్టాలతో నడిచే కంపెనీలకు వాల్యూషన్ విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పు వచ్చింది. అందుకని దాదాపు అన్ని టెక్నాలజీ కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో మన దేశంలోని టెక్నాలజీ కంపెనీలు ఒక్కొక్కటిగా ఉద్యోగుల సంఖ్యను కుదించుకుంటున్నాయి.
మరోపక్క, ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో ఇప్పటికే కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఇదే బాటలో పోటీ సంస్థ స్విగ్గీ కూడా చేరుతోంది. సుమారు 250 మంది ఉద్యోగులను స్విగ్గీ తొలగించొచ్చని తెలుస్తోంది. ఈ నెలలోనే 3 శాతం నుంచి 5 శాతం మంది సిబ్బందిని ఇంటికి పంపొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.
సప్లయ్ చైన్ (సరఫరా నెట్ వర్క్), ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ విభాగాల్లో పనిచేసే వారిపై ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ తొలగింపులు 250 కంటే ఎక్కువే ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై స్విగ్గీ అధికారికంగా స్పందిస్తూ.. ఇప్పటి వరకు అయితే తొలగింపులు లేవని స్పష్టం చేసింది. అలాగే, ఈ నెలలో, సమీప కాలంలో తొలగింపులను కాదనలేమని కూడా చెప్పింది. పనితీరు ఆధారిత తొలగింపులు ఏటా ఉండేవని పేర్కొంది.
ఈ ఏడాది అక్టోబర్ లో ఉద్యోగుల పనితీరును స్విగ్గీ మదింపు వేసి, రేటింగ్ లు ఆధారంగా పదోన్నతులు కూడా కల్పించింది. స్విగ్గీ ఇన్ స్టంట్ గ్రోసరీ విభాగమైన ఇన్ స్టామార్ట్ లో నష్టాలు పెరగడంతో అక్కడి నుంచి కొంత మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.