Header Top logo

Science : అంతా దేవుడి దయానెనా..?

Science : అంతా దేవుడి దయానెనా..?

మనకు తెలియని దాన్ని దేవుడికి ఆపాదించడం కరెక్ట్ కాదు ! చాలా విషయాలను సైన్స్ క్లారిఫై చేసింది. ఇక ముందు కూడా చేస్తుంది. మనం కాస్త ఓపిక పట్టాలి ! అంతే.. కొందరు ఆధ్యాత్మిక వాదులు, ‘దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి ఓ వంద కారణాలు చెప్పగలము’ అనంటారు (అనుకుంటారు)..

కానీ వారు చెప్పేవన్నీ ఏమాత్రం పస లేని కారణాలే. వారు వంద ప్రశ్నలు వేస్తే, అంతకు ఎన్నోరెట్లు ఎక్కువ ప్రశ్నలు మనం వాటికి కౌంటర్ గా సంధించవచ్చు..

ఉదాహరణకు: ‘దేవుడే లేకుంటే.. జీవుల పుట్టుక చావు ఎలా జరుగుతున్నాయి ? వాటి వెనుక ఏ దేవుడో/ ఏ దేవతో లేదా మరేదైనా ఒక మానవాతీత శక్తి ఈ విశ్వంలో ఉండాలి కదా!’ అంటారు..

వారి దృష్టిలో ఏ ప్రశ్నకు సమాధానం దొరక్కపోయినా దేవుడు ఉన్నట్టే లెక్క. ఒక వేళ ఎవరైనా శాస్త్రయంగా సమాధానం చెప్ప (వివరింప) జూస్తే, వారు అసలు అర్థమే చేసుకోరు. ఒకవేళ అర్థం చేసుకోగలిగినా.. మరో కాంప్లికేటెడ్ (వారికి కాంప్లికేటెడ్ అనిపించిన) ప్రశ్న వేసి., దానికి సమాధానం ఎవరూ చెప్ప లేరు, కాబట్టి ఇక దేవుడున్నట్టే కదా.. అని నిర్ధారించేస్తారు. అంటే సామాన్యులకు అర్థం కాని విషయాల నన్నింటినీ దేవుడి మీదికి నెట్టేస్తారు. కానీ దేవుడున్నాడు అనడానికి ఈ రోజు (ఏరోజైనా) సమాధానం తెలియక పోవడం ప్రాతిపదిక కాదు. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో అనేకానేక విషయాలు మామూలు మనిషికి అర్థం కానివి ఉంటాయి. అంత మాత్రాన్నే దేవుడున్నాడు అని నిర్ధారించడం అర్థం రహితం అవుతుంది..

మన సెల్ ఫోన్లు కలర్ టీవీలు ఎక్కడో దూరం నుంచి పంప బడుతున్న రంగుల చిత్రాలు, సినిమాలు గాలిలో.. చాలాచాలా దూరాల నుంచి ప్రయాణం చేసి, మన వరకూ వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో చాలా మంది సామాన్యులకు అర్థం కాదు.. గతంలో పిల్లలు కలుగుతే దేవుడి దయవల్ల పుట్టారనీ.. పిల్లలు కలగకపోతే దేవుడికి తమ మీద కోపం వచ్చిందని అనుకునే వారు. కాని అభివృద్ధి చెందిన సైన్స్ ఫలితంగా.. ఈరోజు పిల్లలు లేని వాళ్లకు డాక్టర్లు పిల్లలు పుట్టిస్తున్నారు..

మానవ శరీరంలో ఉండే అంతర్గత అవయవాలపై మనుషులకు సరియైన అవగాహన గతంలో ఉండేది కాదు. కాని ఇప్పుడు హ్యూమన్ అనాటమీ చదవడం ద్వారా, లోపల ఏఏ అవయవాలు, ఏ విధంగా పని చేస్తాయో తెలుసుకో గలిగారు. ఈ రోజు మన రక్త పీడనాన్ని మనమే కొలవగలుగుతున్నాం. ఒక చిన్న మాత్రతో అధిక రక్త పీడనంను ఎన్నో సంవత్సరాల తరబడి అదుపులో ఉంచ గలుగుతున్నాం. కేవలం ఆరు అడుగుల ఎత్తు ఉన్న మనిషి.. తన కన్నా ఎన్నో రెట్లు ఎత్తైన భవనాలు, వంతెనలు, విగ్రహాలు ఇతర కట్టడాలు/ నిర్మాణాలు తయారు చేస్తున్నాడు. ఒకప్పుడు పక్షి లాగా పైకి ఎగరడం సాధ్యం కాని మనిషి, నేడు అంతరీక్షం లోకి దూసుకెళ్తున్నాడు. ఇవన్నీ ఏ దేవుని సహాయం లేకుండానే మనిషి సాధించాడు. ఇంకా సాధిస్తాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఇలా ఆస్తికులు వేసే ప్రశ్నలకు, ఇంకా అనేకానేక ప్రశ్నలు మనం కూడా ఎదురు సందించవచ్చు.

అసలు విషయం ఏమిటంటే.. ఈ విశ్వంలో ఏ దేవుడూ/ ఏ దేవతా లేదు. అలాగే ఏ మానవాతీత శక్తి కూడా లేదు. ఉన్నదల్లా కొన్ని నియమిత సూత్రాలకు లోబడి నడుస్తున్న ప్రకృతి, అందులోనే సమస్త జీవులు, నిర్జీవ రాశులు.  మొన్న తెలియని విషయాలు, నిన్న తెలియని విషయాలను, ఈ రోజు సైన్స్ సహాయంతో తెలుసుకున్నాం. అలాగే ఈ రోజు తెలియని విషయాలను రేపు లేదా మరి కొంత కాలం తర్వాతైనా తెలుసుకుని తీరుతాం. అది కూడా ఏ దేవుని/ ఏ దేవత అవసరం లేకుండానే.. అందుకే మనకు తెలియని దాన్ని దేవుడికి ఆపాదించడం కరెక్ట్ కాదు..

Chelimela Rajeswar padma

– Rajeshwer Chelimela , Jvv Telangana

Leave A Reply

Your email address will not be published.

Breaking