Rosaiah garu politica life రోశయ్య గారూ! మరువలేము మీ కార్య చతురత
Rosaiah garu Can not be forgotten
రోశయ్య గారూ! మరువలేము మీ కార్య చతురత…!!
రోశయ్య గారు ఇక లేరన్న వార్త నన్ను కలచివేసింది. కారణం రోశయ్య గారితో నాకున్న అనుబంధం..!! ఈనాడులో పనిచేయడం వల్ల సహజంగానే రాజకీయ నాయకులతో పరిచయాలు కలుగుతాయి. అయితే కొందరితో మాత్రమే అనుబంధం ఏర్పడుతుంది. అలా నాకు అనుబంధం ఏర్పడిన రాజకీయనాయకుల్లో రోశయ్య గారొకరు. ఆయన మా గుంటూరు జిల్లా వాడు కావడం కూడా ఆయనతో సాన్నిహిత్యం కలగడానికి ఓ కారణం కావచ్చు. ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డిగారి వద్ద నేను పిఆర్వో గా వున్నప్పుడు ఆయన మంత్రిగా వున్నారు.
రోశయ్య గారి శైలి Unique గా..
అప్పుడు ఆయనతో సాన్నిహిత్యం మరింత బలపడింది. ఆ తర్వాత మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారి ఓఎస్డిగా వున్నప్పుడు రోశయ్య గారి ఛాంబర్లో నే తరచూ కలుస్తూ మాట్లాడుకునే వాళ్ళం. చిన్నాపెద్దా తేడాలేకుండా ఆయన అందరితో కలివిడిగా వుండేవారు. ఎవరితో ఏది మాట్లాడాలో అదే మాట్లాడే వారు. ఆయన పిసిసి అధ్యక్షుడుగా వున్నా కౌన్సిల్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా ఎంపీఅయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా రోశయ్య గారి శైలి Unique గా వుండేది.
ప్రత్యేకతలు..!!
రాజకీయాల్లో రోశయ్య గారు ఓ లెజెండ్ . కేంద్రమంత్రి పదవితప్ప రాష్ట్రస్థాయిలో అన్నిరకాల పదవుల్నిచేపట్టారు. ఆయన రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రిగా 15సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రాష్ట్ర స్థాయిలో అన్నిరకాల ప్రజాప్రాతినిథ్య సభల్లో సభ్యుడిగా వున్నారు. నర్సరావుపేట నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. పదవుల కోసం ఆయన ఏనాడు ప్రాకు వాడలేదు. పదవులే ఆయన్ను వరించివచ్చాయి. ఏ పదవిలో వున్నా వాటికి అలంకారమయ్యారే గానీ, ఎప్పుడూ విమర్శల పాలు కాలేదు. రాజకీయనాయకుడిగా నవ్వుల పాలు కాలేదు. Rosaiah garu politica life
రోశయ్యను అడిగి మరీ తన క్యాబినెట్ లో
చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రోశయ్యను అడిగి మరీ తన క్యాబినెట్ లో చేర్చుకున్నారు. అప్పటి నుండి రాష్ట్రం లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరున్నామంత్రివర్గంలో రోశయ్య తప్పనిసరిగా వుండాల్సిందే. రోశయ్యలేని మంత్రివర్గాన్ని ఊహించలేం అన్నట్టు గా వుండేది. ముఖ్యమంత్రి ఎవరైనా రోశయ్యకు సన్నిహితం గా మెలిగే వారు. ఆయన కూడా లౌక్యంగా, చాకచక్యంగా నడుచుకునేవారు.
జై ఆంధ్రా ఉద్యమం నుంచి..
ఆర్థికమంత్రి గా ప్రతీ పైసాను సద్వినియోగం చేశారు. వృధా ఖర్చులను ఆయన సహించేవారు కాదు. పాపులర్ పథకాల కోసం డబ్బులు తగలెయ్యడం మంచిది కాదనే వారు. రాష్ట్రాన్ని Productive గా చేయడానికి ఆయన ఎంతో శ్రమించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రులకు సైతం నచ్చజెప్పడానికి వెనుకాడే వారు కాదు. జై ఆంధ్రా ఉద్యమంనుంచి మొదలైన ఆయన ప్రస్థానం గవర్నర్ గిరీతో ముగిసింది. సీనియారిటీ, అనుభవం, వినయం, విజ్ఞత, విలువలకు రోశయ్య గారు బ్రాండ్ అంబాసిడర్. ఇది పొగడ్త గా చెబుతున్న మాట కాదు. ప్రత్యక్షంగా రోశయ్య గారిని సన్నిహితంగా చూసినదాన్నిబట్టి చెబుతున్నాను. Rosaiah garu politica life
రోశయ్య గారు అజాత శత్రువు
రాజకీయాల్లో అందరూ శత్రువులే వుంటారు. రోశయ్య గారి లాంటి అజాత శత్రువు బహు అరుదుగా వుంటారు. పార్టీ ఏదైనా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇచ్చేవారు. పాత్రికేయుల పట్ల ఎంతో ప్రేమగా, అభిమానంతో వుండేవారు. ఆయన గురించిన వార్త ఏదైనా రాస్తే గుర్తుపెట్టుకొని ఆ విలేకరి కి ఫోన్ ద్వారానో. లేక ఉత్తరం ద్వారానో కృతజ్ఞతలు తెలిపేవారు. ఇలాంటి గొప్ప గుణం ఒక్క రోశయ్య గారిలో మాత్రమే వుంది.
మృదుస్వభావిగా రోశయ్య..
రోశయ్య గారితో అనుభవాలను రాస్తే ఓపుస్తకమే అవుతుంది. రాజకీయాల్లో ఇంత ట్రాక్ రికార్డ్ వున్న వారిని వేళ్ళమీద లెక్కించవచ్చు. వివాదరహితుడిగా, మృదుస్వభావిగా పేరున్న రోశయ్యగారు ఒక్క ఎన్టీఆర్ సిఎంగా వున్నప్పుడు ప్రతిపక్షంలో వున్న రోశయ్య ఒకటి రెండు సందర్భాల్లో కాస్తంత కరుకుగా మాట్లాడారు. అప్పుడు ఎన్టీఆర్ బాధపడటం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకొని రోశయ్య గారు కూడా బాధపడటం నాకు తెలుసు. రాజకీయాల్లో శత్రుత్వం, మిత్రత్వం చాలా సహజమని ఆయన అంటుండేవారు.
కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం
కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేనంత అభిమానం. పార్టీ విధేయతకు ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి వెనుకాడే వారు కాదు. అందుకే రాజకీయాల్లో ఓ సామాన్య కార్తగా కెరీర్ ప్రారంభించి సిఎం, గవర్నర్ వంటి ఉన్నతమైన పెదవులను కూడా చేపట్టడం వెనుక ఆయన కృషి, విధేయత, సమర్థత లౌక్యం వున్నాయి. ఇలాంటి నాయకులు చాలా అరుదుగా వుంటారు. రోశయ్య గారి మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఓ పెద్దరికం కనుమరుగైందని చెప్పొచ్చు.!! Rosaiah garu politica life
రోశయ్య గారి మృతికి కన్నీటి నివాళి…!!