Header Top logo

Hindu Religion : హిందూ మతం అంటే ఏమిటి ?

హిందూ మతం అంటే ఏమిటి ? చరిత్ర ఏం చెప్తోంది ?

వేల వేల సంవత్సరాలు మనుషులు సమృద్ధిగా ఆహారం, సమతుల శీతోష్ణస్థితి ఎక్కడుంటే అక్కడికి వలసలు వెళుతుండేవారు. భయాలు, భ్రాంతులూ లేక శిలాయుగమంతా స్వేచ్ఛా జీవులుగా సంచార జీవితం గడిపారు. క్రీ.పూ.(బీసీఈ) 7000 ఏండ్ల వరకూ స్థిరనివాసాలు ఏర్పరుచుకున్న దాఖలాలు లేవు. క్రీ.పూ.5000 నుంచి మాత్రమే స్థిరనివాసాలు ఏర్పరుచుకోవడం.. ఫలితంగా నాగరికతలు ప్రారంభం కావడం జరుగుతూ వచ్చింది. అన్నిటికన్నా ముందు మొసపొటేమియా నాగరికత ఏర్పడితే, తర్వాత గ్రీకు మంచూరియన్‌, సుమేరియన్‌ నాగరికతలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత భారత భూభాగంలో సింధూ నాగరికత ఏర్పడింది. తొలినాళ్లలో ప్రజలు ప్రకృతిని ఆరాధించేవారు. ఆ తర్వాత గాలి, నీరు, అగ్ని, సూర్యుడు, భూమి వంటివాటిని గుర్తించుకున్నారు.

అవే జీవనాధారాలని గుర్తించి, వాటిని పూజించడం ప్రారంభించారు. మూలకాల కలయిక వల్లనే జీవి ఏర్పడిందని తెలుసుకున్నారు. తర్వాత కాలంలో సృష్టికి మూలకారణం మానవ ప్రత్యుత్పత్తి అవయవాలు గనక, వాటిని పూజించడం మొదలు పెట్టారు. అందుకే వాటికి గుళ్ళు కట్టుకుని పూజలు చేయడం మొదలైంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత దేవుడు ఒక్కడే అనే భావన ఉండేది. తర్వాత, దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడు అనే భావనతో దేవుళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

దేవుళ్ళకు రూపకల్పన జరుగుతున్న కొద్దీ, ఆయా దేవుళ్ళ చుట్టూ వేర్వేరు మతాలు స్థిరపడుతూ వచ్చాయి. దేవుణ్ణి దర్శించే దృష్టికోణాలు మారుతూ వచ్చాయి. అందుకే చూడండి. తను ‘శృతి’లో దేవుణ్ణి చూస్తున్నానంటాడో గాయకుడు. తను ‘లయ’లో దేవుణ్ణి దర్శిస్తున్నానంటుంది ఓ నర్తకి. అక్షర శక్తే దేవుడంటాడు కవి. సహాయం చేయడంలోనే దేవుడున్నాడని అంటాడో సామాజిక కార్యకర్త. ఇలా లేని దేవుడికి నిర్వచనాలు పెరిగిపోయాయి. చివరికి ఊపిరి పీల్చి వదులుతున్నామంటే, అది దేవుడి కటాక్షమే తప్ప, మానవ ప్రమేయమేమీ లేదనే వరకు వచ్చారు జనం.

ఏది ఏమైనా క్రీ.పూ.1500 (బిసీఈ) నాటికి తొలుత ఏర్పడ్డ జూడాయిజం హిందూయిజం లాంటి మతాలు ప్రణాళికాబద్ధంగా తమ మతాలకు రూపురేఖలు రూపొందించుకున్నాయి.

అప్పుడప్పుడే ఏర్పడుతూ వచ్చిన భాషలలో తమ తమ మతాల నియమావళిని మనుషులు రాసుకోవడం ప్రారంభించారు. తమ దేవుళ్ళను జనానికి పరిచయం చేసి, వారి రూపురేఖలు వర్ణించి ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని కట్టిపడేసే విధంగా పథకాలు రూపొందించుకున్నారు. ఎవరూ వేలెత్తి చూపకుండా, ప్రశ్నించకుండా కఠినంగా వ్యవహరిస్తూ, జనాన్ని ఠారెత్తించారు. ఆ పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం. తొలినాళ్ళలో హిందూ మతాన్ని ‘వేదమతం’గా వ్యవహరించేవారు. అదే తర్వాతి కాలంలో హిందూ మతమైంది. అప్పటికి కాస్త విద్యావంతులైన పురోహితవర్గం మతం మీద పట్టు బిగించి, తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వంటి శాఖలుగా ప్రజల్ని విడగొట్టారు. దేవుడి తల నుంచి ఒకరు, భుజాల నుంచి మరొకరు పుట్టుకొచ్చారని కాకమ్మ కబుర్లు చెప్పి, పుక్కిటి పురాణాలు ప్రచారం చేశారు. వాటిని పవిత్ర గ్రంథాలన్నారు. జనంలో తెలివి పెరగకుండా చదువును దూరం చేశారు. అక్షరాలు ఉచ్ఛరిస్తేనే నాలుకలు తెగ్గోసారు. మతం పేరుతో హింస వేల ఏండ్ల కిందటే తారాస్థాయికి చేరింది.

ఒక సమయంలో ఎంతో ప్రాచుర్యం పొందిన గ్రీకు దేవతల్ని కాలగమనంలో జనం మర్చిపోయారు. ఆధునీకరణకు గురయిన ఆ మతానికి అనుగుణంగా గ్రీకు దేవతలు కొత్త రూపాలు సంతరించుకోవడమే అందుకు కారణం! అలాగే సింధూ నాగరికత నాటి దేవతలంతా అలాగే కొనసాగలేదు. వేద (హిందూ) మతంలో కలిసిపోయి, మార్పులకు గురయ్యారు. సమాజం వర్ణాలుగా విభజింపబడటం, అణచివేత, చిత్రహింసలతో పాటు దేవతలకు జంతువుల్ని బలియివ్వడమనే భయంకర సంప్రదాయం వాడుకలోకి వచ్చింది.

ఇప్పుడు మనం చూస్తున్న దేవతా విగ్రహాలేవీ తొలినాళ్ళ నుంచి ఈ విధంగా లేవు. తవ్వకాల్లో బయటపడ్డ ఒకప్పటి దేవతా శిల్పాలకు, తర్వాత కాలంలో మనిషి శిల్పకళలో నైపుణ్యం సంపాదించిన తర్వాత చెక్కుకున్న శిల్పాలకూ చాలా తేడా ఉంటుంది. దేవుడి పరిణామక్రమం బోధపడాలంటే హాలీవుడ్‌ సినిమా ‘ద కాస్టవే’ చూడటం మంచిది.

క్రీ.పూ. 6వ శతాబ్దంలో సమాజంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. బౌద్ధ, జైన జీవన విధానాలు విస్తరించాయి. జనాన్ని నిర్దాక్షిణ్యంగా విడగొట్టి, హింసను తారాస్థాయికి చేర్చిన వేద (హిందూ) మతంపై ఒకరకంగా ఇవి తిరుగుబాటు చేసాయి. మనుషులు సమానులని గుర్తించడం, అహింసను పాటించడం వాటి మూల సూత్రాలయ్యాయి. బుద్ధుడు దేవుడు లేడని ప్రకటించాడు. వ్యక్తిగతంగా మానవీయ విలువల్ని కాపాడేందుకు ఆయన ”అష్టాంగ మార్గాల్ని” ప్రకటించాడు. జరిగిన విషాద ఘట్టమేమంటే బౌద్ధాన్ని క్షీణింపజేసే క్రమంలో హిందూమతం బుద్ధుణ్ణే తన దశావతారాల్లో చేర్చుకుంది.

బౌద్ధజైన ఆరామాలు కొల్లగొట్టి హిందూ దేవాలయాలుగా మార్చుకుంది. బౌద్ధ జాతల కథల స్ఫూర్తితో కొన్ని పురాణ ఘట్టాలు రాయబడ్డాయి. బుద్ధుడు, జైనుడు ప్రతిపాదించింది జీవన విధానాలు మాత్రమే. మతాలు కావు. కానీ, తర్వాత కాలంలో వాటిని కూడా మతాలుగా వ్యవహరిస్తూ వచ్చారు. ‘నిరీశ్వరవాదం కూడా ఓ మతమే’ – ‘వైజ్ఞానిక దృక్పథం ఉండటమూ ఓ మతమే’ అనే ”జ్ఞానుల్ని” మనమిప్పుడు చూస్తూనే ఉన్నాం కదా? మతాలన్నీ విభజింపబడ్డట్టుగానే, బౌద్ధం కూడా మహాయానం, హీనయానం అని – రెండుగా విడిపోయింది. బుద్ధుడు దేవుడని, పునర్జన్మ ఉంటుందని మహాయాన బౌద్ధులు విశ్వసించారు. బుద్ధుడు దేవుడు కాదని, జ్ఞానబోధ చేసిన గురువు మాత్రమేనని హీనయాన బౌద్ధులు నమ్మారు. ఇవి రెండూ కాక టిబెట్‌లో లామాలు తాంత్రిక బౌద్ధాన్ని నమ్మారు. అదే వజ్రయాన బౌద్ధంగా వర్ధిల్లింది. ఇక జైన మతం – శ్వేతాంబరులు, దిగంబరులు అనే రెండు శాఖలుగా విడిపోయింది.

భారత ఉపఖండంలో పుట్టిన బౌద్ధ, జైన మతాల ప్రభావం వల్ల, అప్పటి వరకు బలంగా ఉన్న హిందూమతం బాగా క్షీణించింది. అయితే అప్పటి వరకూ ఉన్న సామాజిక స్థితిగతుల్ని, అందుబాటులో కొచ్చిన ఉపనిషత్తుల్ని పరిగణనలోకి తీసుకుని, నూతన తాత్విక దృక్పథంతో చార్వాకులు ముందుకొచ్చారు. నిరీశ్వరవాదాన్ని ప్రచారం చేశారు. అంటే ఏమిటీ? క్రీ.పూ..6వ శతాబ్దంలోనే భారతదేశం ప్రపంచానికి నిరీశ్వరవాదాన్ని పరిచయం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ, విశాల ప్రాపంచిక దృక్పథం, మానవీయ విలువల పరిరక్షణల గూర్చి ఈ దేశం ఆనాడే ప్రపంచానికి చాటిచెప్పింది. ఆ ఘన చరిత్రను మర్చిపోయి, సమకాలీన సమాజం మూఢత్వంలోనే మునిగిపోయి ఉంటానంటే తప్పెవరిదవుతుందీ? అధికారాన్ని, హౌదాని అడ్డుపెట్టుకుని కొందరు మత మౌఢ్యాన్ని ప్రచారం చేస్తామంటే తప్పెవరిదవుతుందీ? మానవ మేధస్సు ఆలోచనా పరిధి ఈ దేశంలో క్రీ.పూ.మే ఎంతో పరిణతి చెందినందుకు గర్వపడాల్సింది పోయి, దాన్ని నాశనం చేసే దిశలో ప్రభుత్వాలే పనిగట్టుకుని కృషి చేస్తుంటే తప్పెవరిదవుతుందీ?

క్రీ.శ. ఒకటో శతాబ్దం (సీ.ఈ) నాటికి ప్రపంచంలో మరిన్ని మార్పులు వచ్చాయి. మరికొన్ని కొత్త మతాలు రంగం మీదికొచ్చాయి. అబ్రహం మతం అనే జుడాయిజం నుంచి ఇజ్రయిల్‌ – జెర్రూసలెంలో క్రైస్తవం పుట్టుకొచ్చింది. మరో నాలుగు శతాబ్దాల తర్వాత క్రీ.శ. ఐదో శతాబ్దం (సీ.ఈ)లో అదే అబ్రహం మతశాఖ నుంచి ఇస్లాం అనే మరో మతం పుట్టుకొచ్చింది. రాజ్యాధినేతలు ఏ మతాన్ని విశ్వసిస్తే, ఆ రాజ్యంలోని సామాన్య జనమంతా విధిగా ఆ మతాన్నే విశ్వసించాల్సి వచ్చేది. ఎదురు తిరిగితే కఠిన శిక్షలు తప్పేవి కావు. క్రైస్తవ మత ప్రచారం కోసం క్రుసేడ్లు; ఇస్లాం మత ప్రచారానికి జిహాద్‌ యుద్ధాలు జరిగాయి. పైగా వీటికి పవిత్ర యుద్ధాలని గొప్పగా పేర్లు పెట్టుకున్నారు. అడవిలో జంతువులకుండే స్వేచ్ఛ కూడా ఈ మత సామ్రాజ్యంలో ఉండేది కాదు. ఇప్పటికీ అది చూస్తూనే ఉన్నాం. మనిషయిన వాడికి వ్యక్తిత్వం లేకుండా, స్వేచ్ఛ స్వాతంత్య్రాలు లేకుండా, మానవ హక్కులనేవి లేకుండా మతాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దారుణాలు చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి.

ప్రకృతి నియమాల్ని ఏ మతమూ అర్థం చేసుకోలేదు. స్వీకరించలేదు. పైగా బ్రూనో, గెలీలియో వంటి శాస్త్రవేత్తల్ని, ఎంతోమంది తాత్త్వికుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాయి. మత బోధనలు ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పిన వారిని సహించలేకపోయాయి. మానవ మేధస్సును, ఔన్నత్యాన్ని హననం చేశాయి. ఆ పరంపర నేటికీ మన దేశంలో కొనసాగుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం!

విశ్వాసాల ఆధారంగా పుట్టుకొచ్చిన మతాలు ఎప్పుడూ ఎక్కడా తమ తప్పుల్ని ఒప్పుకోలేదు. ఇస్లాం-సున్నీ, షియాలుగా విడిపోయింది. హిందూమతం-వైష్ణవ, శైవ శాఖలుగా విడిపోయింది. అలాగే జుడాయిజం, సిక్కిజం, జోరాష్ట్రయనిజం వంటివి కూడా విభజింపబడ్డాయి. ఇక క్రైస్తవం గురించి చెప్పేపనిలేదు. అది లెక్కలేనన్ని ముక్కలయ్యింది. జగత్తులో సత్యం ఒక్కటే – అయితే దాన్ని చూసే వాళ్ళు తమ తమ దృష్టి కోణాల్లోంచి, తమకు అనువైన విధంగా చూసుకుంటూ వచ్చారు. అంటే ఏమిటీ? అక్కడ సత్యం లేదు. మార్పులకు లోనైన వారి వారి దృష్టికోణం మాత్రమే ఉంది. జరిగిన -జరుగుతున్న యుద్ధాలన్నీ ఆ దృష్టి కోణం కోసమే! సత్యం కోసం జరిగినవి కావు. దేవుడు లేడన్నదే సత్యం! దాన్ని ఒప్పుకున్నప్పుడే మనిషి ప్రధాన సూత్రధారి అవుతాడు. భ్రమలు తొలగిపోయి, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మనిషి సాధిస్తూ వస్తున్న ఈ వైజ్ఞానిక ప్రగతికి అప్పుడే అర్థం ఉంటుంది.

వ్యాసకర్త : – డాక్టర్‌ దేవరాజు మహారాజు, సుప్రసిద్ధ సాహితీవేత్త బయాలజీ ప్రొఫెసర్‌

Leave A Reply

Your email address will not be published.

Breaking