Header Top logo

నిజామాబాద్‌లో యువకుడి అపహరణ

కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు..

నిజామాబాద్‌లో యువకుడి అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎడపల్లి సమీపంలో కిడ్నాప్‌కు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను బోధన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. కిడ్నాప్‌ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న నిజామాబాద్‌ పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు.

నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ కాలేజి గ్రౌండ్‌లో పట్టపగలే యువకుడి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. బుధవారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు తెలుపు రంగు కారులో వచ్చి ఫిజికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న నరేశ్‌ను పాలిటెక్నిక్‌ కళాశాల గ్రౌండ్‌కు పిలిపించారు.

అక్కడే చితకబాది కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు కారులో బోధన్‌వైపు వెళ్లినట్టు గుర్తించారు.

నిందితులు ఉపయోగించిన కారు నంబరు TS29C 6688 గా గుర్తించి వివరాలు సేకరించారు. కారులో ఉన్న ముగ్గురు నిందితుల సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితులు ఎడపల్లి వద్ద ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అయితే, నరేశ్‌ను ఎడపల్లి వెళ్తుండగా మార్గం మధ్యలోనే వదిలేసినట్టు సమాచారం. నిందితులను బోధన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

కిడ్నాప్‌ చేసిన వారికి సంబంధించిన ఓ యువతిని నరేశ్‌ వేధించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే నరేశ్‌ను నిందితులు చితకబాది, కిడ్నాప్‌ చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking